అసెంబ్లీలో చర్చించి చట్టాన్ని సవరించండి
34% బిసి రిజర్వేషన్లు అమలు పర్చాలి : చాడ వెంకట్‌రెడ్డి
ప్రజాపక్షం/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం లోతైన అధ్యయనం చేయకుండానే మున్సిపల్ చట్టాన్ని తీసుకువచ్చిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట రెడ్డి అన్నారు. కోర్టు మొట్టికాయులు వేసిందని, 109 రోజులు సమ యం ఉందని చెప్పిందని తెలిపారు. అసెంబ్లీని సమావేశపరిచి చర్చించిన తర్వాతే చట్టాన్ని సవరించుకోవాలని ఆయన సూచించారు. ఆదరాబాదరాగా ఆర్డినెన్స్ తీసుకురావాల్సిన అవసరం ఏమిటని ఆయన ప్రశ్నించారు. మఖ్దూం భవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి, కార్యదర్శివర్గ సభ్యులు ఎన్.బాలమల్లేష్, ఎఐటియుసి రాష్ట్ర ప్రధానకార్యదర్శి బోస్, నాయకులు ఉజ్జిని రత్నాకర్‌రావు, సిపిఐ హైదరాబాద్ కార్యదర్శి ఇ.టి.నర్సింహలతో కలిసి చాడ మాట్లాడారు. రాష్ట్ర ప్రభు త్వం కొత్త చట్టంతో ఎన్నికల సంఘం అధికారాలను తీసుకుంటోందన్నారు. లోపభూయిష్టమైన చట్టాన్ని ఏకపక్షంగా తీసుకువచ్చి ప్రభుత్వం ప్రజాప్రతినిధుల అధికారాలకు చెక్ పెట్టిందని విమర్శించారు. అధికార వ్యవస్థను కేంద్రీకృతం చేయడం ద్వారా అధికారాన్ని ప్రభు త్వం తన గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తుందని, ఇది ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి నిదర్శనమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచ్‌ల అధికారాల విషయంలోనూ గందరగోళం నెలకొందని, 330 మంది సర్పంచ్‌లను అరెస్టు చేయడం అన్యాయమన్నారు. హారితహారంలో భాగంగా నాటిన మొక్కల్లో 85 శాతం మొక్కలు బతకకపోతే సర్పంచ్‌ను పదవి నుంచి తొలగిస్తామనడం సమంజసం కాదన్నారు. అటవీ ప్రాంతంలో 35 శాతం మొక్కలే బతికాయని, అందుకు ఎంతమంది అటవీ అధికారులను సస్పెండ్ చేస్తారని చాడ ప్రశ్నించారు. స్థానిక సంస్థలకు రాజ్యాంగం కల్పించిన అధికారాలు ఇవ్వకుండా వారిని పదవుల్లో కొనసాగనివ్వకుండా చేయడం దుర్మార్గమన్నారు. గ్రామపంచాయతీలలో బిసిలకు అన్యాయం చేసిన కెసిఆర్ ప్రభుత్వం మున్సిపాలిటీలలోనైనా 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అసెంబ్లీని సమావేశపరిచి చర్చించిన తర్వాతే మున్సిపల్ చట్టాన్ని తీసుకురావాలని, అనంతరమే ఎన్నికలను నిర్వహించాలని ఆయన అన్నారు.
నేడు రాజ్ బహదూర్‌గౌర్ శతజయంతి ముగింపు సభ
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు, మాజీ ఎంపి డాక్టర్ రాజ్‌బహాదూర్ గౌర్ శతజయంతి ముగిం పు ఉత్సవాల సభను గురువారం ఉదయం 11.30 గం టలకు నాంపల్లిలోని ఇందిరా ప్రియదర్శిని హాలులో నిర్వహించనున్నట్లు చాడ వెంకటరెడ్డి చెప్పారు. సభలో సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి, స్వాతంత్ర సమరయోధులు బూర్గుల నర్సింగ్‌రావు, ఎఐటియుసి జాతీయ నేత అమర్‌జిత్ కౌర్, కార్మిక సంఘాల నేతలు నాయిని నర్సింహారెడ్డి (హెచ్‌ఎంఎస్), జి.సంజీవరెడ్డి (ఐఎన్‌టియుసి), సాయిబాబా(సిఐటియు)తో పాటు రాజ్‌బహాదూర్ గౌర్ సహచర స్వాతంత్ర సమరయోధులు, బ్యాంకింగ్, ఆర్‌టిసి కార్మిక సంఘాల నేతలు, పార్టీ, ప్రజాసంఘాల నాయకులు పాల్గొంటారని వివరించారు. రాజ్‌బహాదూర్ గౌర్ ఒక వ్యక్తిగా, ఒక వ్యవస్థగా, ఒక ఉర్దూ రచయితగా, కార్మిక నాయకుడిగా అలిసిపోయిన నాయకులకు హస్యపు మాటలతో సంతోషపెట్టి అలసట తీర్చే మంచి వక్త అని చాడ కొనియాడారు. సమస్య ఎంత జఠిలమైనా పరిష్కరించేవారని, రాజ్యసభ సభ్యులుగా పనిచేశారన్నారు. ఉజ్జిని రత్నాకర్‌రావు మాట్లాడుతూ ప్రముఖ కార్మిక నేత సిపి నాయకులు రాజ్‌బహాదూర్ గౌర్ ముగింపు ఉత్సవాలను ఎఐటియుసి, సిపిఐ సంయుక్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు ఉదయం 10.30 గంటలకు హిమాయత్‌నగర్‌లోని మఖ్ధూంభవన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రాజ్‌బహదూర్ గౌర్ హాలును సురవరం సుధాకరరెడ్డి ప్రారంభిస్తారని, రాజ్‌బహదూర్ గౌర్ విగ్రహాన్ని బూర్గుల నర్సింగరావు ఆవిష్కరిస్తారని చాడ చెప్పారు.