శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టిన రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
కార్పొరేషన్ యథాతథంగా కొనసాగుతుందని ప్రకటన
ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే పిఆర్‌సి ఆర్‌టిసి ఉద్యోగులకూ వర్తిస్తుంది
విలీన బిల్లుకు ఆమోదం తెలిపిన గవర్నర్‌కు సిఎం కెసిఆర్ ధన్యవాదాలు
ప్రజాపక్షం/హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థ (టిఎస్‌ఆర్‌టిసి) ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వంలోవిలీనం చేస్తూ ప్రవేశపెట్టిన తెలంగాణ ఆర్‌టిసి విలీన బిల్లును శాసనసభ , శాసనమండలి ఆదివారం ఏకగ్రీవంగా ఆమోదించాయి. దీంతో బిల్లుపై గవర్నర్ ఆమోదం తెలిపిన వెంటనే 43 వేల మంది ఆర్‌టిసి ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారిపోతారు. అయితే, ఆర్‌టిసి కార్పొరేషన్ మాత్రం యథాతథంగా కొనసాగనుంది. ఉత్కంఠ భరిత పరిణామాల మధ్య రాష్ర్ట గవర్నర్ తమిళిసై ఆదివారం మధ్యాహ్నం బిల్లు ప్రవేశపెట్టేందుకు సమ్మతి తెలపారు. వెంటనే బిల్లును ఆదివారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ శాసనసభలో ప్రవేశపెట్టారు. బిల్లుకు బిఆర్‌ఎస్, ఎంఐఎం, బిజెపి మద్దతు ప్రకటించడంతో పది నిమిషాల్లోనే ఆమోదం పొందింది. కాగా బిల్లు ప్రవేశపెట్టి, చర్చ అనంతరం ఆమోదం తెలిపిన సమయంలో కాంగ్రెస్ సభ్యులు ఎవరూ సభలో లేరు. బిల్లుపై చర్చను ఎంఐఎం సభ్యులు మౌజం ఖాన్ ప్రారంభిస్తూ ఆర్‌టిసి ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడాన్ని ఎంఐఎం స్వాగతిస్తుందన్నారు. బిజెపి సభ్యులు ఈటల రాజేందర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలో ఆర్‌టిసి పేదలకు గొప్ప సేవలు అందిస్తుందని, ప్రభుత్వంలో ఉద్యోగుల విలీనంతో ఆర్‌టిసి కార్మికులకు ఉద్యోగ భద్రత కలుగుతుందని చెప్పారు. ఆర్‌టిసి ఉద్యోగులకు రెండు వేతన సవరణలు బకాయి ఉన్నదని, అలాగే కో ఆపరేటివ్ సొసైటీలో రూ.1050 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని, రిటైర్ మెంట్ బెనిఫిట్స్ వంటి అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరారు.ఆర్‌టిసిలో పని చేసే ఔట్ సోర్సింగ్, డైలీ వేజ్ కార్మికులను కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. బిల్లుకు మద్దతునిస్తున్నట్లు తెలిపారు. బిఆర్‌ఎస్ సభ్యులు , ఆర్‌టిసి చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ చైర్మన్‌గా తాను, ఎండిగా సజ్జనార్‌గా నియమితులైనప్పుడు ఆర్‌టిసిని ప్రవేటీకరించేందుకు మమ్మల్ని వేసారనే దుష్ప్రచారం చేశారన్నారు. అయితే, దానిని సవాలుగా తీసుకొని తాము పని చేశామని , 2021 రూ.1182 కోట్లు ఉన్న నష్టాన్ని , 2022 670 కోట్లు తగ్గించామని తెలిపారు. ఎంత కష్టపడినా నెలకు రూ.474 కోట్ల నగదు వస్తే, రూ.590 కోట్లు ఖర్చవుతున్నాయని, అంటే నెలకు రూ.125 కోట్ల నష్టం వస్తున్నదన్నారు. ఈ నేపథ్యంలో తాను ఆర్‌టిసి చైర్మన్‌గా ఉన్న సమయంలోనే ఆర్‌టిసి కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
జీతభత్యాలు బాధ్యత ప్రభుత్వానిది&
బకాయిల బాధ్యత ఆర్‌టిసికి : పువ్వాడ
ఒకసారి ఆర్‌టిసి ఉద్యోగులు విలీనమైన తరువాత ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణలోకి భావిస్తామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. వారికి కూడా ప్రభుత్వ
ఉద్యోగులకు వర్తించే పిఆర్‌ఎస్ వర్తిస్తుందని చెప్పారు. ఆర్‌టిసి కార్పొరేషన్ యథాతథంగాకొనసాగుతుందని, దానికే ఆస్తులు, బకాయిల బాధ్యత ఉంటుందని, ఆర్‌టిసి ఉద్యోగులక సంబంధించి సిసిఎస్ బకాయిలు, ఇతర బకాయిలను కార్పొరేషనే చెల్లిస్తుందని తెలిపారు. విలీనం తరువాత ఉద్యగులకు జీతభత్యాలు ప్రభుత్వం చెల్లిస్తుందని, వచ్చే ఆదాయం కార్పొరేషన్‌కే ఉంటుందన్నారు.ఆ ఆదాయం నుండే ఉద్యోగుల బకాయిలను చెల్లిస్తుందన్నారు. విలీనం తరువాత పదవీ విరమణ లబ్దికి సంబంధించిన విషయం మార్గదర్శకాలు రూపకల్పన సమయంలో ఉద్యోగస్తులతో చర్చించి నిర్ణయిస్తామన్నారు. ప్రస్తుత బిల్లు కేవలం ఆర్‌టిసి పర్మినెంట్ ఉద్యోగులకు సంబంధించిందేనని, డైలీ, క్యాజువల్ ఉద్యోగులు యథాతథంగా ఆర్‌టిసి కార్పొరేషన్‌లో కొనసాగుతారని చెప్పారు. అంతకుముందు బిల్లును ప్రవేశపెట్టిన ప్పుడు మంత్రి మాట్లాడుతూ ఆర్‌టిసి ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనమయ్యాక జీతభత్యాలు సంవత్సరానికి రూ.3వేలు కోట్లు ఖర్చవుతాయని, మొత్తం 43, 032 ఉద్యోగులు విలీనమవుతారని తెలిపారు. వివిధ కారణాల రీత్యా ఆర్‌టిసి కార్యకలాపాలు లాభదాయకంగా లేకపోగా నష్టాలు చవి చూస్తున్నదని, ప్రధానంగా డీజిల్ రేటు పెరుగుదల కారణమని వివరించారు. అందుకే ఆర్‌టిసి సిబ్బంది జీత భత్యాలు, ఉద్యోగ భద్రతను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వంలో విలీన ం చేసుకోవాలని క్యాబినెట్ నిర్ణయించినట్లు పువ్వాడ తెలిపారు. అయితే, 1997 చట్టం 14 ప్రకారం పబ్లిక్ సెక్టార్ యూనిట్‌లో పని చేస్తున్న ఉద్యోగులను ప్రభుత్వ సర్వీసుల్లో తీసుకోవడంపై సాధారణ నిషేధం ఉన్నందున ప్రత్యేక చట్టం ద్వారా వారిని తీసుకుంటున్నామని పేర్కొన్నారు. వారంతా టిఆర్‌ఆర్‌ఎం అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్‌మెంట్ నియంత్రణలో కొత్త డిపార్ట్ మెంట్ ఏర్పాటు చేసి , దానికి హెడ్‌గా విసి అండ్ ఎండి ఎక్స్ ఆఫిషియో సభ్యులుగా ఉంటారని వివరించారు. టిఎస్‌ఆర్‌టిసి కార్యకలాపాలు యథావిధిగా కొనాసాగుతాయని, ఉద్యోగస్తులు ప్రభుత్వంలో తగిన స్థాయిలో కొనసాగించబడతారని తెలిపారు. ఆర్‌టిసి ఆస్తులు యథాతథగా టిఆస్‌ఆర్‌టిడిసి ఆధీనంలో కొనసాగతాయని, ఉద్యోగులకు ప్రభుత్వ రూల్స్ రూపొందించేవరకు ప్రస్తుతం ఉన్న సర్వీస్ రూల్స్ కొనసాగుతాయని వివరించారు. ఆర్‌టిసి స్థిర చరాస్తులు కొత్తగా ఏర్పడే డిపార్ట్‌మెంట్, డైరెక్టర్‌ల ఆధీనంలో కొనసాగుతాయన్నారు. శాసనసభలో బిల్లు ఆమోదం లభించిన అనంతరం, శాసనమండలి కూడా ఏకగ్రీవ ఆమోదం తెలియజేసింది.
గవర్నర్‌కు ఇప్పుడు జ్ఞానోదయం అయిందిః సిఎం
బిల్లు ప్రవేశపెట్టక ముందు సిఎం కెసిఆర్ శాసనసభలో మాట్లాడుతూ ఆర్‌టిసి ఉద్యోగుల విలీనం బిల్లు విషయంలో గవర్నర్ తెలిసీ తెలియక వివాదం కొని తెచ్చుకున్నారని అన్నారు. గవర్నర్ బిల్లును దగ్గరే ఉంచుకొని పనిలేని పని పెట్టుకున్నారని, 96 వివరణలు కోరారని అన్నారు. వారికి జ్ఞానోదయం అయ్యిందని, మధ్యాహ్నం బిల్లుపై సమ్మతి సంతకం పెట్టి పంపారని అన్నారు. అందుకు గవర్నర్‌కు ధన్యవాదాలు అని సిఎం కెసిఆర్ అన్నారు. ఆర్‌టిసి ఉద్యోగులు గతంలో సమ్మె చేశారని, ప్రభుత్వంలో తీసుకోవాలన్నారని, అయితే తాము నిధులు ఇస్తామని నడుపుకోమన్నామని తెలిపారు. విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ డీజిల్ ధరల పెరుగుదలతో నష్టాలలోనే ఉందని, దీంతో ప్రభుత్వమే ఆర్‌టిసిని సాకుతోందన్నారు. చివరకు ఆర్‌టిసి ఉద్యోగుల ఉద్యోగ భద్రత బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని క్యాబినెట్‌లో నిర్ణయించామని చెప్పారు. కొందరు దుర్మార్గులు ఆర్‌టిసి ఆస్తుల కోసమే విలీనం అంటున్నారని, ఆర్‌టిసి సేవలను కొనసాగిస్తామని, ఆర్‌టిసికి అదనంగా ఇంకా కొన్ని జాగాలు సమకూరుస్తామన్నారు.
ఇవాళ ఉదయం నుంచి ఇలా..?
ఆదివారం మధ్యాహ్నం ఆర్టీసీ విలీన బిల్లుకు గవర్నర్ ఆమోదం లభించిన విషయం తెలిసిందే. ఉన్నతాధికారులతో చర్చించిన అనంతరం తమిళిసై ఎట్టకేలకు బిల్లను ఆమోదించారు. గవర్నర్ అనుమతితో ఆర్‌టిసి విలీన బిల్లుకు అడ్డంకులు తొలగిపోయాయి. అయితే.. ఆర్‌టిసి విలీన బిల్లును గత రెండు రోజులుగా గవర్నర్ పెండింగ్‌లో ఉంచడంతో ఆర్‌టిసిఉద్యోగులు, కార్మిక సంఘాలు రోడ్డెక్కాయి. మరోవైపు.. ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు రాజ్భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఆ తర్వాత విలీనంపై ప్రభుత్వానికి 5 ప్రశ్నలు సంధించడం, కార్మిక సంఘాల నేతలతో వీడియో కాన్ఫరెన్స్లో చర్చించడం, ప్రభుత్వం నుంచి ఆ ప్రశ్నలకు వివరణ రావడం.. ఆ తర్వాత మరికొన్ని సందేహాలను వ్యక్తం చేస్తూ తమిళిసై మరోసారి ప్రభుత్వానికి లేఖ రాయడం ఇవన్నీ జరిగాయి. దీంతో ఆదివారం నాడు ప్రభుత్వం తరుపున అధికారులు రాజ్‌భవన్‌కు వెళ్ళి వివరణ ఇచ్చారు. అనంతరం గవర్నర్ బిల్లుకు తన సమ్మతిని తెలియజేశారు.
ఆర్‌టిసి విలీన బిల్లుకుఅసెంబ్లీ ఆమోదం
RELATED ARTICLES