ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ : కండక్టర్ పోస్టులు భర్తీ చేయాలని మంత్రి పొన్నం ఆదేశం
ప్రజాపక్షం/ హైదరాబాద్ టిఎస్‌ఆర్‌టిసిలో పని చేస్తూ విధి నిర్వహణలో మరణించిన సిబ్బంది వారసులకు కారుణ్య నియామకాల కింద కండక్టర్ పోస్టులను భర్తీ చేయాలని ఆర్‌టిసి అధికారులను రవాణా, బిసి సంక్షేమ శాఖమంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. బ్రెడ్ విన్నర్ (కారణ్య నియామకాలు), మెడికల్ ఇన్‌వాలిడేషన్ స్కీమ్ కింద ఉద్యోగుల జీవిత భాగస్వామి/, పిల్లలకు ప్రత్యామ్నాయ ఉపాధిని అందించడానికి వారి విద్యార్హతల ఆధారంగా ఉద్యోగాలు కల్పిస్తున్న విషయం తెలిసిందే. సర్వీసులో ఉండగా మరణించిన సంస్థ సిబ్బంది కుటుంబాలకు ఇదొక ఊరట అని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ (66), సికింద్రాబాద్ (126), రంగారెడ్డి (52), నల్లగొండ (56), మహబూబ్‌నగర్ (83), మెదక్ (93), వరంగల్ (99), ఖమ్మం (53), అదిలాబాద్ (71), నిజామాబాద్ (69), కరీంనగర్ (45) రీజియన్ల నుంచి మొత్తం 813 కండక్టర్ పోస్టులను సంస్థ భర్తీ చేయనుంది. టిఎస్‌ఆర్‌టిసిలో కారుణ్య నియామకాల కింద కండక్టర్లను నియమించనున్నట్లు స్ఫష్టం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే 10 సంవత్సరాల నుండి పెండింగ్‌లో ఉన్న కండక్టర్ నియామకాలు చేపట్టామని మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అందులో భాగంగా 813 మంది కండక్టర్లను నియమించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామని, దీంతో చాలా సంవత్సరాలుగా కారుణ్య నియామకాల కోసం ఎదురు చూస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు న్యాయం జరిగిందని, తమ ప్రభుత్వం వారి సంక్షేమానికి కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.
ఆర్‌టిసిలో కారుణ్య నియామకాలు
RELATED ARTICLES