మరో ప్రపంచకప్ ట్రోఫీపై కన్నేసిన ఆస్ట్రేలియా
ఫుల్ జోష్‌తో ఉన్న ఫించ్ సేన
హాట్ ఫేవరెట్‌గా బరిలోకి
క్రీడా విభాగం : ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టు ఏదని అడిగితే.. వెంటనే ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు అని సమధానం వస్తోంది. అవును అది నిజం. క్రికెట్ చరిత్రలో ఆస్ట్రేలియా జట్టు తమదైన ముద్ర వేసింది. దశాబ్ద కాలంగా క్రికెట్‌లో రారాజుగా ఎదిగింది. ఆస్ట్రేలియాతో మ్యాచ్ అంటే ప్రత్యర్థి జట్లకు వణుకే. కంగారూలను ఓడించేందుకు అనేక జట్లు తీవ్రంగా శ్రమించినా వారికి ఫలితాలు దక్కేవి కావు. ఎన్నో సంవత్సరాలు ఏకపక్ష విజయాలతో ఆసీస్ జట్టు సంచలనాలు నమోదు చేసింది. చారిత్రక విజయాలతో చిన్న, పెద్ద తేడా లేకుండా అన్ని జట్లపై పెత్తనం సాధించి ఎదురులేని జట్టుగా ఆవిర్భవించింది. వన్డెల్లో, టెస్టుల్లో దశాబ్ద కాలంపాటు అగ్ర స్థానంతో ప్రపంచ క్రికెట్‌ను శాసించింది. ఇక వన్డే ప్రపంచకప్ చరిత్రలోనూ ఆస్ట్రేలియాకు తిరుగులేని రికార్డు ఉంది. 1975 నుంచి 2015 వరకు మొత్తం 11 ప్రపంచకప్ సమరాలు జరిగితే అందులో ఆస్ట్రేలియా జట్టు ఒక్కటే ఏకంగా 5 సార్లు విశ్వవిజేతగా నిలిచి కొత్త అధ్యాయాన్ని లిఖించింది. వరల్డ్‌కప్ చరిత్రలోనూ తిరుగులేని జట్టుగా ఆస్ట్రేలియా తమదైన ముద్ర వేసింది. ఈసారి కూడా డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా అదే జోష్‌తో బరిలో దిగబోతుంది. ఇప్పటికే ఐదు సార్లు ప్రపంచకప్ గెలుచుకున్న ఆసీస్ ఆరో టైటిల్‌పై కన్నేసింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. ఎలాంటి జట్టుకైన సవాల్ విసిరేందుకు సిద్ధమైంది. కంగారులు ప్రస్తుత ఫామ్‌ను చూస్తే మరోసారి కప్ కొట్టేలా కనిపిస్తోంది. స్మిత్, వార్నర్‌లు తిరిగి జట్టులో రావడంతో వారి బలం రెట్టింపు అయింది. బౌలింగ్‌లోనూ ఆసీస్‌కు ఎదురులేకపోవడంతో ఈ జట్టు ప్రపంచకప్ ఫేవరెట్ జట్లలో ఒకటిగా నిలిచింది.
గడ్డుకాలం గడిచింది..
ఐదు నెలల కింద కప్పు గెలవగలిగే జట్టు ఏదంటే.. ఆస్ట్రేలియా అని ఎవరూ చెప్పివుండే వారు కాదు! ఎందుకంటే పేలవ ఫామ్, వరుస ఓటములతో చాలా దయనీయంగా తయారైంది ఆ జట్టు పరిస్థితి. 2017 జనవరిలో పాకిస్థాన్‌తో జరిగిన వన్డే సిరీస్ గెలిచిన తర్వాత ఆసీస్ కథ రివర్స్ అయింది. అప్పటి వరకు ప్రపంచ మేటి జట్టుగా ఉన్న ఆస్ట్రేలియా రానురాను పేలవమైన ప్రదర్శనలతో వరుస ఓటములను చవిచూసింది. ఇక అప్పటి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి-మార్చిలో భారత పర్యటన ముందు వరకు రెండేళ్ల కాలంలో ఒక్క వన్డే సిరీస్ కూడా నెగ్గలేక పోయింది. ఈ క్రమంలోనే తమ చెత్త ప్రదర్శనలతో ఆసీస్ వరుసగా ఆరు సిరీస్‌లను ఓడింది. ఇందులో సొంతగడ్డపై ఓడిన సిరీస్‌లు కూడా ఉన్నాయి. పేలవ ప్రదర్శనతో నిరుడు సొంతగడ్డపై తొలిసారి భారత్ చేతిలో టెస్టు సిరీస్ కోల్పోయిన కంగారూల జట్టు.. వన్డే సిరీస్‌నూ సైతం పోగొట్టుకుంది. ఆ సమయంలో తీవ్ర విమర్శలకు గురైంది. పరాజయాలకు తోడు 2018లో బాల్ టాంపరింగ్ కుంభకోణంంతో జట్టు ప్రధాన ఆటగాళ్లు కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌లు ఒక సంవత్సరం నిషేధానికి గురయ్యారు. దాంతో ఆస్ట్రేలియా క్రికెట్ పెద్ద సంక్షోభంలో చిక్కుకుంది. స్మిత్, వార్నర్‌లు లేని ఆసీస్ జట్టు ఫలితాల్లో మరింతగా దిగజారిపోయింది. వరుస ఓటములతో కంగారు జట్టుకు చిన్న జట్లపై గెలవడం కూడా కష్టంగా మారింది. ఈ రెండు ఏళ్లు ఆస్ట్రేలియాకు గడ్డుకాలంగా మారాయి. ఈ నేపథ్యంలో.. ఈ ఏడాది ఆరంభంలో భారత పర్యటనకు వచ్చే వరకు కంగారూల జట్టుపై ఎలాంటి అంచనాలు లేవు. కానీ భారత పర్యటన ఆ జట్టుకు పెద్ద మలుపు. దాదాపు ఆటగాళ్లంతా ఒకేసారి ఫామ్‌లోకి రావడం, భారత్‌పై హ్యాట్రిక్ విజయాలతో 3-2తో వన్డే సిరీస్ కైవసం చేసుకొని ఒక్కసారిగా బలంగా మారిపోయింది. వార్నర్, స్మిత్‌లతో పాటు కీలక పేస్ బౌలర్లు లేకుండానే భారత్‌పై అద్భుత విజయాలు సాధించడం ఆసీస్ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. ఆ తర్వాత పాకిస్థాన్‌ను 5-0తో మట్టికరిపించి సమరోత్సాహంతో విశ్వసమరానికి సన్నద్ధమైంది. ఇంగ్లాండ్ పిచ్‌లపై ఆస్ట్రేలియాకు మంచి అవగాహణ ఉంది. ఇది ఆసీస్‌కు కలిసొచ్చే అంశం. ప్రస్తుతం ఆసీస్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభగాల్లో చాలా ప్రమాదకరంగా ఉంది. అందుకే 2019 ప్రపంచకప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా టైటిల్ ఫేవరెట్‌లలో ముందు వరుసలో నిలిచింది. ఇప్పటికే ఐదు సార్లు విశ్వ విజేతగా నిలిచిన కంగారు జట్టు మరో టైటిల్‌తో సిక్సర్ కొట్టాలని భావిస్తోంది.
జట్టు బలాలను ఓసారి చూద్దాం..
అనుభవజ్ఞులైన డేవిడ్ వార్నర్, మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ తిరిగి జట్టులోకి రావడంతో కంగారూల జట్టు మరింత బలోపేతమైంది. ఈ సీజన్ ఐపిఎల్‌లో పరుగుల వరద పారించిన వార్నర్ ఇప్పుడు జోరు మీదున్నాడు. మరింత పట్టుదలతో ఆడుతున్న అతడిని అడ్డుకోవడం ప్రపంచకప్‌లో ప్రత్యర్థి బౌలర్లకు పెద్ద సవాలే. ఇక స్మిత్ ఐపిఎల్‌లో అంత గొప్పగా రాణించకపోయినా ఆ తర్వాత కివీస్‌తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఫామును అందుకున్నాడు. తర్వాత ప్రపంచకప్ ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్‌తో జరిగిన సన్నాహక మ్యాచ్‌లోనూ స్మిత్ శతకంతో చెలరేగి సత్తా చాటాడు. స్మిత్ ఫామ్‌లోకి రావడంతో జట్టు టైటిల్ ఆశలు మరింతగా పెరిగాయి. మరోవైపు కెప్టెన్ అరోన్ ఫించ్, ఖవాజా, మ్యాక్స్‌వెల్ కూడా ఫామ్‌లో ఉండడంతో ఆసీస్ బ్యాటింగ్ విభాగం పటిష్టంగా మారింది. వీరందరూ కలిసి కట్టుగా రాణిస్తే ఆస్ట్రేలియా భారీ పరుగులు చేయడం ఖాయమే. ప్రపంచకప్‌లో అత్యంత పదునైన బౌలింగ్ దళాల్లో ఆసీస్ ఒకటి. ప్రపంచ అగ్రశ్రేణి బౌలర్లతో కంగారూ జట్టు బౌలింగ్‌లోనూ దృడంగా ఉంది. ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, కౌల్టర్‌నైల్, బెరెన్‌డార్ఫ్‌తో ఆసీస్ పేస్ బౌలింగ్ భీకరంగా ఉంది. వీళ్లను తట్టుకుని నిలవడం మేటి బ్యాట్స్‌మెన్‌లకు కూడా అంత తేలిక కాదు. అడమ్ జంపా రూపంలో మంచి లెగ్ స్పిన్నర్ కూడా ఆసీస్‌కు సొంతం. మరో స్టార్ స్పిన్నర్ నాథన్ లైయన్ కూడా ఆసీస్‌కు పెద్ద బలం. అయితే పిచ్ పూర్తిగా స్పిన్‌కు అనుకూలమైనప్పుడే ఈ సీనియర్ స్పిన్నర్ లైయన్‌కు తుది జట్టులో చోటు దక్కొచ్చు. ప్రస్తుతం ఆస్ట్రేలియా అన్ని విభాగాల్లో చాలా స్ట్రాంగ్‌గా ఉంది.
జట్టు బలహీనతలను ఓసారి చూద్దాం..
ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాకు పెద్దగా బలహీనతలు ఏమీలేవు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో ఆసీస్ జట్టుకు ఎదురులేదు. ఇక ఈ సారి ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా రెండో వికెట్ కీపర్ లేకుండా బరిలో దిగడం ఆశ్చర్యకరమైన విషయం. సుదీర్ఘంగా జరిగే ఈ టోర్నీలో ఒకే వికెట్ కీపర్‌తో ఆడటం ఆస్ట్రేలియాకు ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. జట్టు వికెట్ కీపర్ అలెక్స్ కేరీకు గాయమైతే ఆసీస్‌కు ఇది పెద్ద దెబ్బే అవుతుంది. ఇక గాయాల నుంచి కోలుకుంటున్న మిఛెల్ స్టార్క్, రిచర్డ్‌సన్‌లు పూర్తి ఫిట్నెస్ సాధించాల్సివుంది. నిషేధం నుంచి వచ్చిన వార్నర్, స్మిత్‌లను ఇంగ్లాండ్ ప్రేక్షకులు లక్ష్యంగా ఎంచుకోవచ్చు. టోర్నీ ఆసాంతం వాళ్లను గేలి చేస్తూ.. వారి ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నించవచ్చు. ‘చీటర్లు’ అంటూ ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టారు కూడా. ఈ పరిస్థితిని ఎదుర్కోవడం వాళ్లకు, ఆస్ట్రేలియా జట్టుకు సవాలే. జట్టు ప్రధాన బ్యాట్స్‌మెన్‌లైన వార్నర్, స్మిత్ ఏకాగ్రతను కోల్పోతే దాని ప్రభావం ఆసీస్‌పై స్పష్టంగా కనబడుతోంది. ప్రపంచకప్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ అభిమానులు వార్నర్‌పై తీవ్రంగా విమర్శలు చేశారు. చీటర్, చీటర్ అంటూ నినాదాలు చేస్తూ అతని ఏకాగ్రతను భంగం చేసే ప్రయత్నం చేశారు. ఇలా ప్రపంచకప్ మ్యాచుల్లో జరిగితే ఆసీస్‌కు కష్టమే.
వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా ప్రస్థానం:
1975- రన్నరప్
1987- విశ్వవిజేత
1996- రన్నరప్
1999- విశ్వవిజేత
2003- విశ్వవిజేత
2007- విశ్వవిజేత
2015- విశ్వవిజేత
కీలక ఆటగాళ్లు..
డేవిడ్ వార్నర్, మాక్స్‌వెల్, స్టీవ్ స్మిత్, అరోన్ ఫించ్, మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్.
ఆస్ట్రేలియా ప్రపంచకప్ జట్టు
ఆరోన్ ఫించ్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, అలెక్స్ కేరీ, ప్యాట్ కమిన్స్, నాథన్ లైయన్, గ్లేన్ మ్యాక్స్‌వెల్, స్టీవ్ స్మిత్, మార్కస్ స్టోయినీస్, అడమ్ జంపా, జేసన్ బెరెన్‌డార్ఫ్, నాథన్ కౌల్టర్‌నైల్, ఉస్మాన్ ఖవాజా, షాన్ మార్ష్, కేన్ రిచర్డ్‌సన్, మిఛెల్ స్టార్క్.
ఆరోసారి కప్ కొట్టెనా..!
RELATED ARTICLES