భారత్‌లో కేవలం ఐదు రోజుల్లోనే లక్ష మందికి కరోనా
24 గంటల్లో కొత్తగా 19,148 మందికి పాజిటివ్
మరో 434 మంది మృతి
18 వేలకు చేరువలో మరణాలు
న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్ వాయువేగంతో వ్యాపిస్తోంది. గురువారం ఉదయం నాటికి కరోనా కేసులు ఆరు లక్షల మార్కును దాటాయి. దేశంలో ఐదు లక్షల కేసులు దాటిన తరువాత కేవలం ఐదు రోజుల్లోనే మరో లక్ష కేసులు రికార్డు కావడం తీవ్ర కలవరాన్ని, భయాందోళనలను కలిగిస్తుంది. భారత్‌లోకి మహమ్మారి ప్రవేశించిన తరువాత లక్ష కేసులకు చేరుకోవడానికి 110 రోజుల సమ యం పట్టగా, వాయు వేగంతో వ్యాపిస్తుండడంతో కరోనా కేసులు కేవలం 44 రోజుల్లోనే ఆరు లక్షల మార్కును దాటింది. కాగా, గురువారం ఉదయం నాటికి గత 24 గంటల్లో కొత్తగా 19,148 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,04,641కి చేరింది. తాజాగా మరో 434 మంది ప్రాణాలు కోల్పోగా, మరణాల సంఖ్య 17,834కు పెరిగినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వశాఖ బులెటిన్‌లో పేర్కొంది. ప్రస్తుతం 2,26,947 యాక్టివ్ కేసులు ఉండగా, 3,59,859 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 59.52గా ఉన్నట్లు ఓ అధికారి చెప్పారు. 18 వేలకు పైగా కొత్త కేసులు నమోదు కావడం వరుసగా ఇది ఆరువ రోజు. జూన్ 1వ తేదీ నుంచి జులై 2వ తేదీ నాటికి మొత్తం 4,14,106 మంది వైరస్ బారిన పడ్డారు. కేవలం నెలరోజుల్లోనే నాలుగు లక్షలకు పైగా మందికి పాజిటివ్‌గా వచ్చిందంటే దేశంలో మహమ్మారి తీవ్రత ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలో అత్యంత వైరస్ ప్రభావితమైన దేశంగా అమెరికా, బ్రెజిల్, రష్యాల తర్వాత భారత్ నాలుగో స్థానంలో ఉంది. అయితే మూడవ స్థానంలో ఉన్న రష్యా కంటే భారత్ కేవలం 50 వేల కేసుల దూరంలో నిలిచింది. 26 లక్షల కేసులతో అమెరికా, 14 లక్షల కేసులతో బ్రెజిల్ మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. త్వరలోనే రష్యాను కూడా భారత్ అధిమించి మూడవ స్థానానికి ఎగబాకే అవకాశాలు ఉన్నాయి. మరణాల సంఖ్యలో ఇండియా 8వ స్థానంలో కొనసాగుతుంది. ఇదిలా ఉండగా, దేశంలో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు ముందువరుసలో ఉన్నాయి.
మహారాష్ట్రలో 8 వేలు దాటిన మృతులు
మహారాష్ట్రలో కొవిడ్ మహమ్మారి మరణ మృగందం మోగిస్తుంది. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 8వేలు దాటడం కలవరపెడుతోంది. దేశంలో సంభవిస్తోన్న కరోనా మరణాల్లో దాదాపు 45శాతం ఒక్క మహారాష్ట్రలోనే చోటుచేసుకోవడం ఆందోళనకరం. గురువారం ఉదయం నాటికి రాష్ట్రంలో కేసుల సంఖ్య 1,80,298కి చేరింది. కొత్తగా 198 మంది ప్రాణాలు కోల్పోగా, మృతుల సంఖ్య 8,053కు చేరింది. ఇక, మహారాష్ట్ర అనంతరం తమిళనాడులో కరోనా విలయతాండవం చేస్తోంది. తాజాగా రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 94,049 నమోదైంది. కొత్తగా 63 మంది మరణించారు. మొత్తం మృతుల సంఖ్య 1,264కు చేరాయి. దేశ రాజధానిలో మాత్రం కరోనా వైరస్ ఉద్ధృతి కాస్త అదుపులోకి వచ్చినట్లు ఢిల్ల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 89,802 పాజిటివ్ కేసులు నమోదుకాగా వీరిలో ఇప్పటికే 60వేల రోగులు కోలుకున్నట్లు వెల్లడించారు. ఢిల్లీలో కొత్తగా 61 మంది మృతి చెందారు. మొత్తం మృతుల సంఖ్య 2,803కు చేరింది. గుజరాత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో కేసుల సంఖ్య 33,232గా ఉంది. తాజాగా 21 మంది మరణించగా, ఇప్పటివరకు 1,867 మంది చనిపోయారు. ఉత్తరప్రదేశ్‌లో 24 గంటల్లో 21 మంది మరణించారు. మొత్తం మృతుల సంఖ్య 718కి చేరుకోగా, మొత్తం కేసుల సంఖ్య 24,056కు చేరింది. పశ్చిమ బెంగాల్ మొత్తం 683, మధ్యప్రదేశ్‌లో 581, రాజస్థాన్‌లో 421, తెలంగాణలో 267, ఆంధ్రప్రదేశ్‌లో 198 మంది మరణించారు. కేసుల విషయానికొస్తే.. పశ్చిమ బెంగాల్‌లో మొత్తం బాధితుల సంఖ్య 19,170కి చేరింది. రాజస్థాన్‌లో మొత్తం కేసులు 18,312గా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా 845 మంది కరోనా బారిన పడగా, మొత్తం కేసుల సంఖ్య 16,907కు చేరింది. మిగతా రాష్ట్రాల్లోనూ కొత్త కేసులు, మరణాలు నమోదవుతూనే ఉన్నాయి.
9 మిలియన్ మార్క్‌ను దాటిన కొవిడ్ పరీక్షలు
భారత్‌ల కరోనా గుర్తింపు పరీక్షలు 9 మిలియన్ మార్కును దాటాయి. జులై 1వ తేదీ నాటికి 90,56,173 నామూనాలను పరీక్షించినట్లు అధికారులు తెలిపారు. దేశంలో ప్రస్తుతం 1065 టెస్టింగ్ ల్యాబ్‌లు ఉండగా, అందులో 768 ప్రభుత్వానివి కాగా, మరో 297 ప్రైవేట్ ల్యాబ్‌లు అని భారత వైద్య పరిశోధన మండలి (ఐసిఎంఆర్) అధికారులు గురువారం వెల్లడించారు. పరీక్షల సామర్థ్యం రోజు రోజుకు అతివేగంగా పెరుగుతుందన్నారు. మే 25 వరకు రోజుకు 1.5 లక్షల పరీక్షలు నిర్వహించగా, ప్రస్తుతం ఆ సంఖ్య మూడు లక్షలకుపైగా చేరుకున్నట్లు వారు చెప్పారు. బుధవారం దాదాపు 2,29,588 నామూనాలను పరీక్షించారు. దీంతో మొత్తం పరీక్షల సంఖ్య 90 లక్షల మార్కును దాటగా త్వరలోనే కోటికి చేరుకోనున్నట్లు ఐసిఎంఆర్ అధికారులు వివరించారు. మొదట్లో కేవలం పుణెలో ఒకే ఒక్క టెస్టింగ్ ల్యాబ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవి) ఉండేది. అయితే లాక్‌డౌన్ ప్రారంభం నాటికి ఆ సంఖ్య 100కు చేరింది. జూన్ 23 నాటికి వెయ్యికిపైగా టెస్టింగ్ ల్యాబ్‌లను పెంచారు.
ఆరు లక్షలు దాటిన బాధితులు
RELATED ARTICLES