సభ్యులుగా మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
“ప్రజాపాలన” అంశంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్ష
30 నుండి 40 శాతం వరకు ప్రజాపాలన దరఖాస్తుల డేటా ఎంట్రీ పూర్తి : పొంగులేటి
ప్రజాపక్షం/హైదరాబాద్ ఆరు గ్యారంటీల అమలు నిమిత్తం విధి విధానాల ను రూపొందించేందుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో మంత్రులు దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సభ్యులుగా ఉంటారు. తెల్లరేషన్‌కార్డు లేనివారి అంశాన్ని కూడా సబ్ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. హైదరాబాద్‌లోని సచివాలయంలో “ప్రజాపాలన” అంశంపైన సోమవారం నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సభ్యులతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశ వివరాలను సచివాలయ మీడియా సెంటర్లో రవాణశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి సమాచార, రెవెన్యూ శాఖమంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. ప్రజా పాలనలో అందిన దరఖాస్తులలో 30 నుండి 40 శాతం వరకు డాటా ఎంట్రీని పూర్తి చేశామన్నారు. అర్హులైన వారందరికీ పథకాలు అందేలా చూస్తామని, ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని స్పష్టం చేశారు. దరఖాస్తు పత్రాలను ఆధార్, రేషన్ కార్డులతో అనుసంధానం చేస్తామని, సబ్ కమిటీలో చర్చించి, విధివిధానాలు ఖరారు చేసి, వాటి ఆధారంగా అర్హులను గుర్తిస్తామని వివరించారు. దరఖాస్తుదారుల ఇంటికెళ్లి అధికార యంత్రాంగం పరిశీలించనుందన్నారు. 85 లక్షల రేషన్ కార్డులు ఉంటే, ఒక కోటి 5లక్షల దరఖాస్తులు వచ్చాయని, వీటి వివరానలు డాటాఎంట్రీ ప్రక్రియను పూర్తి చేస్తామని, ఆ తర్వాత విధివిధానాల ఆధారంగా అర్హులైన లబ్ధిదారులను గుర్తించేందుకు అధికార సిబ్బంది ఆయా దరఖాస్తుల ఇంటికెళ్తారని వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని, ఎన్నికల సందర్బంగా ఇచ్చిన ఏ వాగ్ధానాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటి వరకు ఎవరైనా అభయాస్తం దరఖాస్తులు చేసుకోకపోతే స్థానిక తహసిల్ధార్ కార్యాలయాల్లో దరఖాస్తలు చేసుకోవచ్చని, వాటిని కూడా డాటా ఎంట్రీ చేస్తామని సూచించారు.
ప్రజా పాలన అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం సజావుగా జరిగిందని, ఇందుకు సహకరించిన అధికార యంత్రాంగానికి ఆయన ధన్యవాదాలు తెలిపరాఉ. రాష్ట్ర వ్యాప్తంగా అభయ హస్తం దరఖాస్తులు ఒక కోటి 5లక్షలు వరకు వచ్చాయని, ఇందులో రేషన్ కార్డు, భూములు తదితర అంశాలకు చెందిన 20 లక్షలు దరఖాస్తులు ఉన్నాయన్నారు. తాము అధికారంలోనికి వచ్చి నెల రోజులు కాకముందే తమ నుండి అధికారాన్ని లాక్కోవాలని ప్రతిపక్ష పార్టీ (బిఆర్ఎస్) ఉవ్విళ్లురుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దుయ్యబట్టారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను తమ హయాంలో జరిగినట్టు చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. 40 రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని ప్రతిపక్ష పార్టీ నాయకులు అవాకులు, చేవాకులు పేలుతున్నారన్నారు. ఎవరైనా కారు కూతలు కూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.
ప్రభుత్వంపై అబద్ధాలు, దుష్ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు : మంత్రి పొన్నం ప్రభాకర్
మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ప్రభుత్వంపైన అబద్ధాలను, దుష్ప్రచారం చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వంలో లేకపోయినా ఇంకా తాము ప్రభుత్వంలోనే ఉన్నట్టు బిఆర్ఎస్ నేతలు మైఖంలో ఉన్నారని ఎద్దేవా చేశారు. మహిళలు ఆర్టిసి బసుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తే బిఆర్ఎస్ నేతలు ఆటో వాళ్ళను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. బిఆర్ఎస్ పదేళ్ల పాలనలో డబుల్ బెడ్ రూమ్, దళితులకు 3 ఎకరాల భూమి హామీ ఏమైందని నిలదీశారు. తమకు రాఖీ కట్టిన ఒక సోదరిని వాట్సప్ యూనివర్సిటీలో అవమాన పరిచారని పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఇచ్చిన హామీలను అమలు చేస్తామని, నెల పూర్తయిందని, అప్పుడే అంత తొందరెందుకని బిఆర్ఎస్ నేతలన ప్రశ్నించారు. తాము శ్వేత పత్రాలు విడుదల చేస్తే, బిఆర్ఎస్ నేతలు స్వేద పత్రాలు ఇచ్చారని, ఇంతకు వారి సౌదాల లెక్కలు చెప్పాలని అన్నారు. అధికారంలో ఉన్నా పదేళ్ల కాలంలో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, రాష్ట్రాన్ని దివాళా తీశారని ఆరోపించారు.
ఆరు గ్యారంటీల అమలుకు కేబినెట్ సబ్‌కమిటీ
RELATED ARTICLES