నా గెలుపును సిద్ధిపేట ప్రజలకు, కెసిఆర్‌కు అంకితం చేస్తున్నా: హరీశ్ రావు
ప్రజాపక్షం / హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల్లో ఐదుగురు ఎంఎల్‌ఎలు ఆరోసారి గెలిచారు. టిఆర్‌ఎస్ నేతలు హరీశ్ రావు, ఈటలరాజేందర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్ ఈ ఎన్నికల్లో ఆరోసారి గెలుపొందారు. సిద్దిపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసిన టిఆర్‌ఎస్ నేత హరీశ్ రావు 1.20 లక్షలకు పైగా మెజార్టీతో విజయం సాధించడం విశేషం. ఈ విజయంపై హరీశ్ రావు స్పందిస్తూ, ఇంత మెజార్టీతో గెలిపించిన సిద్దిపేట ప్రజలకు చేతులు జోడించి నమస్కరిస్తున్నానని, తన గెలుపులో సిద్దిపేట ప్రజల చెమట చుక్కలున్నాయని అన్నారు. ఈ విజయాన్ని సిద్ది పేట ప్రజలకు, కెసిఆర్‌కు అంకితం చేస్తున్నానని అన్నారు. ఊపిరి ఉన్నంత వరకూ సిద్దిపేటకు సేవకుడిగా పని చేస్తానని చెప్పిన హరీశ్, నాడు ఉద్యమ సమయంలో.. మెజార్టీలో సిద్దిపేటకు సేవకుడిగా పనిచేస్తానని అన్నారు.
కెసిఆర్ ఘన విజయం
ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, గులాబీ దళపతి కెసిఆర్ గజ్వేల్ నియోజకవర్గం నుంచి విజయ దుందుభి మోగించారు. గజ్వేల్ నుంచి ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంటేరు ప్రతాపరెడ్డిపై కెసిఆర్ గెలుపొందారు. గత ఎన్నికల్లో 19,366 ఓట్లతో వంటేరుపై గెలిచిన కెసిఆర్ ఈ సారి ఎన్నికల్లో 50 వేలకు పైగా మెజారిటీ విజయం సాధించారు. సిఎం కెసిఆర్ 1983, 1985, 1989, 1994, 1999, 2001 (ఉప ఎన్నిక), 2004లో సిద్దిపేట నుంచి ఎంఎల్‌ఎగా గెలుపొందిన అనంతరం కరీంనగర్ ఎంపిగా పోటీచేశారు. 2014లో గజ్వేల్ నుంచి ఎంఎల్‌ఎగా, మెదక్ నుంచి ఎంపిగా పోటీ చేశారు. ఫలితాల అనంతరం మెదక్ స్థానానికి రాజీనామా చేశారు.