న్యూఢిల్లీ : వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టానికి (సిఎఎ) వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో నిరసన జ్వాలలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. అనేక మంది రోడ్లపైకి వచ్చి ఆందోళనల్లో పాల్గొంటున్నారు. నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు. తాజాగా శుక్రవారం ఢిల్లీలోని ప్రముఖ జామా మసీదు వద్ద పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. ఎముకలు కొరికే చలిని సైతం లెక్క చేయకుండా మసీదు వద్దకు చేరుకున్న వందలాదిమంది ప్రజలు శుక్రవారం పార్థనలు ముగించుకున్న తరువాత నిరసన ప్రదర్శన చేశారు. కాంగ్రెస్ నేత అల్కా లంబా, ఢిల్లీ మాజీ ఎంఎల్‌ఎ షోయబ్ ఇక్బాల్‌లు కూడా నిరసనలో పాల్గొన్నారు. కేంద్రప్రభుత్వంపై లంబా మండిపడ్డారు. నిరుద్యోగ సమస్య అనేది దేశంలో ఉందని, పెద్దనోట్ల రద్దు సమయంలో ప్రజలు ఎటిఎంల ముందు ఎలాగైతే క్యూలో నిల్చున్నారో, అలాగే ఎన్‌ఆర్‌సిని వ్యతిరేకించడానికి కూడా లైన్లలో లో నిల్చున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేయడం చాలా ప్రధానమని, కేంద్రం బలవంతంగా సిఎఎనును ప్రజలపై రుద్దడం తగదని లంబా మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తన ఎజెండాను నియతృత్వంగా ప్రజలపై అమలు చేయకూడదని చెప్పారు. కాగా, మసీదులో ప్రార్థనలు నిర్వహించేందుకు ఎద్ద ఎత్తున విచ్చేసిన వారు ఆందోళనలో పాల్గొన్నారు. కొత్త చట్టం, ప్రతిపాదిత జాతీయ పౌరుల జాబితా (ఎన్‌ఆర్‌సి)కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. “ఈ దేశానికి ఎన్‌ఆర్‌సి, ఎన్‌పిఆర్ అవసరం లేదు…ఈ దేశానికి ఉద్యోగాలు అవసరం. శాంతి, సౌభ్రాతృత్వం అవసరం” అంటూ పెద్ద పెట్టున నినందిచారు. అంతేకాకుండా ‘దేశాన్ని విభజించవద్దు… సేవ్ ఇండియా” అంటూ రాసిన ప్లకార్డులను ప్రదర్శించారు. శాంతియుతంగా ఆందోళనలు చేయాలని విజ్ఞప్తి చేశారు. హింసకు పాల్పడుతున్న వారు తమకు చెందిన వారు కాదని మాజీ ఎంఎల్‌ఎ షోయబ్ చెప్పారు. తాము ఎలాంటి హింసనూ సిహించబోమని స్పష్టం చేశారు.
ప్రధాని నివాసం ముట్టడికి నిరసనకారుల యత్నం
భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ వందలాది మంది ఆందోళనకారులు తమ చేతులను తాడుతో కట్టేసుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసం వైపు శుక్రవారం ర్యాలీగా వెళ్లారు. అయితే వారిని దారిలోనే పోలీసులు అడ్డగించారు. పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు, డ్రోన్లతో నిఘాను ఉంచినప్పటికీ భీమ్ ఆర్మీ సభ్యులు సహా నిరసనకారులు దేశరాజధాని జోర్‌బాగ్‌లోని దర్గా షా నుంచి ర్యాలీగా బయలుదేరారు. లోక్‌కల్యాణ్‌మార్గ్‌లోని ప్రధాని నివాసం వైపు వెళ్తుండగా మధ్యలోనే పోలీసులు బారిగేడ్లను ఏర్పాటు చేసి నిరసనకారులను అడ్డుకున్నారు. అంబేద్గర్, ఆజాద్ పోస్టర్లను చేబూని నినదించారు. కాగా, నిరసనకారులందరూ తమ చేతులను తాళ్లతో కట్టేసుకొని ర్యాలీలో పాల్గొనడం గమనార్హం. ఆందోళన సందర్భంగా తాము హింసాకాండకు, దమనకాండకు పాల్పడ్డామనే నిందలు తమపై రాకుండా ఉండేందుకే ఈ విధంగా చేతులు కట్టుకున్నట్లు వారు స్పష్టం చేశారు. శనివారం కూడా తాము చేతులుకొని కట్టుకొనే నిరసనలు చేస్తామని, దీంతో శాంతియుతంగా నిరసనలు చేయలేదని తమపై దాడి చేయవద్దని, అబద్ధాలు చెప్పవద్దని ఆందోళనలో పాల్గొ న్న ఓ నిరసనకారుడు మాజిద్ జమల్ పేర్కొన్నారు. జాతీయ మైనారిటీ కమిషన్ మాజీ చైర్మన్ వజహట్ హబిబుల్హా మాట్లాడుతూ కొత్త చట్టం రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక సూత్రాలకు విరుద్ధంగా ఉందన్నారు. కాగా, ర్యాలీగా వెళ్లిన నిరసనకారులను పోలీసులు అడ్డుకోవడంతో తమ ర్యాలీను కొనసాగించేందుకు అనుమతించాలని పోలీసు సిబ్బందికి వారు విజ్ఞప్తి చేశారు.
ఆరని అగ్ని కణం
RELATED ARTICLES