హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్యకేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసును సిబిఐకి అప్పగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. దీనిపై కొత్తగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని పేర్కొంది. గత కొంత కాలంగా దీనిపై విచారణ కొనసాగిస్తున్న ఉన్నత న్యాయస్థానం సిట్ చేస్తున్న దర్యాప్తును పర్యవేక్షిస్తోంది. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు సరిగా లేదని అసంతృప్తి వ్యక్తంచేసింది. విజయవాడలో ఆయేషా మీరా హత్య జరిగిన తర్వాత ఈ కేసులో సత్యంబాబును దోషిగా తేలుస్తూ 2010లో విజయవాడ కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే తాను నిర్దోషినంటూ సత్యంబాబు హైకోర్టులో అప్పీల్‌కు వెళ్లారు. ఆయన అప్పీల్‌పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం 2016లో సత్యంబాబును నిర్దోషిగా తేలుస్తూ తీర్పునిచ్చింది. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించాలని ఆయేషా తల్లితో పాటు పలు ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు హైకోర్టును ఆశ్రయించాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిపై సిట్‌ను ఏర్పాటు చేసింది. సిట్ దర్యాప్తు కొనసాగిస్తున్న క్రమంలో కీలక సాక్ష్యాధారాలు, రికార్డులు లేవని కోర్టుకు నివేదిక ఇవ్వగా.. న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తంచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గతంలో ఇచ్చిన తీర్పులు, కేసు దర్యాప్తులతో ఏమాత్రం ప్రభావితం కాకుండా తాజాగా ఈ కేసు విచారణ చేపట్టాలని సిబిఐని గురువారం ఆదేశించింది.
ఆయేషా హత్యకేసులో మరో కీలక మలుపు
RELATED ARTICLES