కాబూల్: ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా కాబూల్‌లోని జి4ఎస్ భద్రతా బలగాల శిబిరం ఉన్న ప్రాంత సమీపంలో కారులో బాంబు పెట్టి దాడికి పాల్పడ్డారు. ఈ ఉగ్రదాడిలో 10 మంది పౌరులు మృతి చెందగా, మరో 29 మందికి గాయాలయ్యాయని ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి నజీబ్ దానీశ్ తెలిపారు. మొదట తమకు తుపాకులతో కాల్పులు జరుగుతున్న ధ్వనులు వినపడ్డాయని, ఆ తరువాత బాంబు పేలుడు చప్పుడు వినపడిందని స్థానికులు మీడియాకు చెప్పారు. అయితే, కాల్పులు విషయాన్ని కాబూల్ పోలీసు అధికారి బసీర్ ముజాహిద్ కొట్టిపారేస్తున్నారు. ఈ దాడిలో గాయాలపాలైన వారిని వజీర్ అక్బర్ ఖాన్ ఆస్పత్రికి తరలించారు. కాగా జి4ఎస్ భద్రతా బలగాల శిబిరం బ్రిటీష్ రక్షణ సంస్థకు చెందినది. ఓ అంతర్జాతీయ పత్రిక వెల్లడించిన వివరాల ప్రకారం ఈ ఘటనకు తామే బాధ్యులమని తాలిబన్లు ప్రకటించారు. అలాగే, ఆ ఉగ్ర సంస్థకు, భద్రతా బలగాలకు మధ్య భారీ స్థాయిలో ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ఆఫ్ఘన్‌లో మరో ఉగ్రదాడి
RELATED ARTICLES