మావోయిస్టుల ఎన్‌కౌంటర్లపై న్యాయవిచారణ
మేధావులు, వామపక్షాల డిమాండ్
ప్రజాపక్షం/హైదరాబాద్
చత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని అబుజ్‌మాడ్ ప్రాంతంలో కొనసాగిస్తున్న ‘ఆపరేషన్ కగార్’ను తక్షణమే నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని వామపక్ష నాయకులు, పలువురు మేధావులు డిమాండ్ చేశారు. అక్కడ జరుగుతున్న ఎన్‌కౌంటర్లపై సుప్రీంకోర్డు సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని వారు కోరారు. “నక్సల్స్ పట్ల కేంద్ర ప్రభుత్వ రాక్షస విధానాలను ఖండిద్దాం ప్రశ్నించే గొంతుకలను కాపాడుకుందాం” అనే అంశంపై రాష్ట్ర సదస్సు సిపిఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని దేశోద్దరక్‌భవన్‌లో బుధవారం జరిగింది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ప్రొఫెసర్ జి.హరగోపాల్,మాజీ ఎంఎల్‌సి, ప్రొఫెసర్ కె.నాగేశ్వర్, ఇండియన్ జర్నలిస్ట్ అసోసియేషన్ (ఐజెయు) అధ్యక్షుడు, తెలంగాణ మీడియా అకాడమి చైర్మన్ కె.శ్రీనివాస్‌రెడ్డి, సీనియర్ సంపాదకులు కె.శ్రీనివాస్, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు పశ్యపద్మ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.ఎస్. బోస్, ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.బాల్‌రాజ్, వామపక్షాల నాయకులు డి.జి.నరసింహారావు (సిపిఐ( ఎం), చలపతిరావు (సిపిఐఎంఎల్ న్యూడెమొక్రసీ), కె.మురహరి (ఎస్‌యుసిఐ(సి)), రమేశ్‌రావు(సిపిఐ( ఎంఎల్) లిబరేషన్), ప్రసాద్ (సిపిఐ ఎంఎల్), ప్రసాద్ (ఫార్వర్డ్ బ్లాక్), అనిల్‌కుమార్ (ఎంసిపిఐ(యు) ప్రసంగించారు.
మావోయిస్టులను చంపొద్దు : కూనంనేని
మావోయిస్టులు ప్రజల కోసం అడవిలో ఉండి పనిచేస్తుంటే, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మాత్రం పెద్ద పెట్టుబడిదారుల కోసం, తన కుర్చీ కోసం ప్రజల మధ్య ఉండి ప్రజలనే చంపిస్తున్న వ్యక్తి అని కూనంనేని సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్, న్యాయస్థానం రాష్ట్రం నుంచి అమిత్‌షాను బహిష్కరించిన విషయాన్ని గుర్తు చేశారు. 2026 మార్చి నాటికి ఒక్క మావోయిస్టు కూడా లేకుండా నిర్మూలిస్తామని అమిత్‌షా అన్నారని, ఆయనను హోం మంత్రిని చేసింది ప్రజలను చంపేందుకేనా అని నిలదీశారు. అమిత్‌షా, మోదీ దొంగలకే దొంగ అని, ప్రశ్నిస్తున్న వారిని చంపేస్తున్నారని మండిపడ్డారు. గౌరి లంకేశ్వర్, పన్సారీ లాంటి ప్రశ్నించేవారిని చంపుతున్న చరిత్ర బిజెపిది అని విమర్శించారు. ప్రజల కోసం తాము ప్రాణాలు అర్పిస్తున్నామని మావోయిస్టు నాయకులు అనుకుంటుంటే, ప్రజలు మాత్రం కనీసం సానుభూతిని కూడా వ్యక్తం చేయడంలేదని, ఇది అన్యాయమని చెప్పగలిగే ధైర్యం కూడా లేకపోతే సమాజం ఎటువైపు పోతున్నట్టు అని సాంబశివరావు ఆందోళన వ్యక్తం చేశారు. మావోయిస్టుల తరపున గొంతును వినిపిస్తామని, ప్రశ్నిస్తామని, ఇందుకు తమపై కేసులు నమోదు చేసినా తాము వెనుకాడబోమని, నక్సల్స్ పేరుతో ప్రజలను, ప్రశ్నించేవారిని చంపితే ఉరుకోబోమని హెచ్చరించారు. మావోయిస్టులు బతకాలని, వారిని చంపేందుకు వీలులేదని, అడవిలో ఉన్నవారెవ్వరినీ కూడా చంపొద్దనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. నక్సలైట్లు కూడా విధానకర్తలను, విధాన నిర్ణయాలను తీసుకునే నాయకుల వద్దకు వెళ్లలేని పరిస్థితి ఉంటుందని, కానీ వారి విధానాలతో కింది స్థాయి పోలీసులు బలవుతున్నారని, ఇందులో దళిత, బిసి కుటుంబాలకు చెందిన వారే ఉన్నారని వివరించారు. ఇన్‌ఫార్మర్లను కూడా చంపొద్దని, అవసరమైతే వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలిపెట్టాలని ఆయన మావోయిస్టులకు సూచించారు. నాయకులను చంపేస్తుంటే భయపడి వెనక్కు రమ్మని తాము చెప్పడం లేదని, కానీ ప్రజాస్వామ్యం, ఎన్నికల క్రమంలో ప్రజలను సన్నద్ధం చేయాలని, ఎప్పటికైనా మన లక్ష్యం మనకు ఉంటుందని, ఈ విషయంలో మావోయిస్టులు కూడా పునారాలోచన చేయాలని, వృథా త్యాగాలు చేయవద్దని కూనంనేని సాంబశివరావు కోరారు. అడవిలో ఉంటూ ప్రజల కోసం కష్టపడుతూ, వారి కోసమే ఆలోచిస్తూ, వాన, ఎండ, రేయి, పగలు అనకుండా తమ కుటుంబాలను వదిలి అనేక రకాల జబ్బుల బారినపడి, అన్ని బాధలను పడుతూ చంపివేయపడుతన్న వారికి తాము ఉన్నామనే భరోసాను ఇచ్చేవారు లేరని ఆయన అన్నారు. ‘అవసరమనుకున్నప్పుడు రాజ్య స్పందనను బట్టి ప్రతిస్పందన ఉంటుంది. ప్రజలలో ముందు మమేకమవ్వాలి. ప్రజల ద్వారా ప్రజా ఉద్యమాలను పెంపొందించాలి. ప్రజలు మన వైపు ఉండేలా తయారు చేసుకోవాలి. ఆ దిశగా సన్నద్ధం చేసుకోవాలి. ఆ సమయంలో అణచివేసేందుకు ప్రయత్నిస్తే రాజ్య హింసకు పాల్పడితే, ఆప్పుడు అవసరం అనుకున్నప్పుడు, దానికి ప్రతిస్పందనగా, మనం కూడా దేనికైనా సిద్ధంగానే ఉండాలనేది మన రాజకీయ తీర్మానం. ప్రజలు మన వెనకాల చేరిన తర్వాత అప్పుడు తిరుగుబాటు చేయాలని, అవసరమైతే తుపాకీ పట్టాలి’ అని కూనంనేని అన్నారు.
రాజ్యం బలప్రయోగం వంద రెట్లు పెరిగింది : ప్రొఫెసర్ హరగోపాల్
ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ బస్తర్‌లో ఖనిజ సంపదను కార్పొరేట్లకు అప్పగిస్తామని, ఇందుకు అడ్డొస్తే చెట్లు, మనుషులను కూడా తొలగిస్తామని చత్తీస్‌ఘడ్ సిఎం మాట్లాడారని చెప్పారు. అడవిని ప్రేమించి, వాటిని రక్షించే వారిని ద్వేషించడం ఏమిటని హరగోపాల్ నిలదీశారు. అడవిలో ఉన్న సంపద నిజంగానే దేశానికి ఉపయోగపడితే ఈ విషయమై ఆదివాసీలతో మాట్లాడాలని సూచించారు. రాజ్యం చట్టబద్దమైన హద్దులను దాటి బల ప్రయోగ శక్తి వంద రెట్లు పెరిగిందన్నారు. దేశంలో పరిస్థితులు నిత్యం దారుణంగా మారుతున్నాయని, ఎవరు మాట్లాడినా, ప్రశ్నించినా పాలకులు అణచివేస్తున్నారని, దేశంలో నిర్భందమైన వాతావరణం నెలకొన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రశ్నించకపోతే ఉహించని పరిణామాలు రానున్నాయని తెలిపారు. అభివృద్ధి నమూనా, అసమానతలు, పేదరికం ఇలా అనేక అంశాలపైన ఆదివాసీ, దళితులు, మహిళలు ఇలా అనేక పోరాటాలు జరుగుతున్నాయన్నారు. చైతన్యం పెరిగిన కొద్దీ ప్రశ్నలు పెరుగుతాయన్నారు. హిట్లర్ నాజీయిజం, ఫాసిజం మరో రూపంలో రాబోతుందన్నారు.
ఎన్‌కౌంటర్‌లు జరిగితే న్యాయవిచారణలేవి? : కె.శ్రీనివాస్ రెడ్డి
కె.శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలో ప్రజాస్వామ్యవాదులు ఏకమై దేశంలో నెలకొన్న అణచివేతలను, దాడులను నిలువరించకపోతే భవిష్యత్‌లో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. దేశానికి ప్రధాన శత్రువులు కమ్యూనిస్టులేనని కేరళలో రెండేళ్ల కింద ప్రధాని మోదీ చేసిన ప్రకటనకు అనుగుణంగానే ప్రభుత్వ అడుగులు పడుతున్నాయన్నారు. మావోయిస్టుల గొంతు వినిపించొద్దనే ఉద్దేశ్యాన్ని సమావేశాలలో బోధిస్తున్నారా?, అన్యాయాన్ని , అక్రమాలను ఎదురిస్తున్నారని భావిస్తే చాలు వారి అడ్డును తొలగిస్తున్నారని ఆయన అన్నారు. గతంలో ఎన్‌కౌంటర్లు జరిగితే న్యాయ విచారణ జరిగేదని, ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపిని వ్యతిరేకించే శక్తులు, కాంగ్రెస్‌తో సహా బూర్జువా పార్టీలు, ప్రజాస్వామ్యంపై విశ్వాసం కలిగిన పార్టీలన్నీ తీవ్రంగా ఆలోచించాలని శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. 1989లో ఐఎఎస్ శంకరన్, ఎంఎల్‌ఎ బాలరాజుతో పాటు ఏడుగురిని నక్సలైట్లు కిడ్నాప్ చేశారని, వారిని విడిపించేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించిందని వివరించారు. ఈ క్రమంలో తన వద్దకు ఒక ఐఎఎస్ అధికారి వచ్చి, కిడ్నాప్ చేసిన వారిని విడిచిపెట్టాలని ఒక ప్రకటన చేయాలని కోరారని, అందుకు ఆల్ ఇండియా రేడియోలో వారిని వదిలిపెట్టాలని తాను నక్సలైట్‌లను కోరానని, ఆ తర్వాత వారు కిడ్నాపర్లను వదిలిపెట్టిన విషయాన్ని శ్రీనివాస్‌రెడ్డి గుర్తు చేశారు. ఇటువంటి పరిస్థితులు ప్రస్తుతం దేశంలో లేవని, కేంద్రం కూడా ఇటువంటివి కోరుకోవడం లేదని, మావోయిస్టులను, ప్రశ్నించేవారిని తొలగిస్తుందన్నారు.
ప్రశ్నించేతత్వాన్ని నిర్మూలించలేరు : కె.శ్రీనివాస్
కె.శ్రీనివాస్ మాట్లాడుతూ ‘భయమనేది ఇప్పుడు దేశంలో అధికారిక ఉద్వేగంగా మారింది. ఆ భావోద్వేగమే ప్రజల మనుస్సుల్లో భయాంకర వాతావరణం సృష్టిస్తోంది. గడిచిన 11 ఏళ్లుగా దేశంలో భావస్వేచ్చ హరించడం, పత్రికలను కొనుగోలు చేయడం, భయపెట్టడం, మాటవినని వారిని అంతమొందించడం, హేతుబద్దంగా ఆలోచించే వారిని అణిచివేయడం ఇలాంటి అనేక యుద్ద రంగాలు ఏర్పడ్డాయి. ఆందులో బీభత్సమైన యుద్ద రంగం ఇప్పుడు అబుజ్‌మాడ్‌లో కొనసాగుతోంది’ అని అన్నారు. దేశంలో ఇంతా జరుగుతున్నా సమాజం మౌనంగా ఉండడంతోనే నేడు పాలకులు ప్రశ్నించే గొంతుకలను భౌతికంగా లేకుండా చేస్తున్నారన్నారు. 1970లో అప్పటి ముఖ్యమంత్రి వెంగళరావు, ఆ తర్వాత వసంతరావు, అలా ప్రతి హోంశాఖ మంత్రి చెప్పిందేనని, ఇప్పుడు జాతీయ స్థాయిలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అదే చెబుతున్నారన్నారు. అమిత్‌షా చెబుతున్నట్లుగా వారికి ఉన్న శక్తి సామార్ధ్యాలతో లేక కౄరత్వంతో 2026 వరకు మవోయిస్టులను నిర్మూలించవచ్చు కానీ ఆ తర్వాత ప్రజలు ఏమి మాట్లాడకుండా ఉంటారా అని పాలకులను ప్రశ్నించారు. ప్రపంచంలో ఎక్కడ, ఎప్పుడు ఎదో ఒక గొంతు ఏదో రూపంలో ప్రశ్నిస్తూనే ఉంటారన్నారు. అయితే పాలకులు ఆలాంటి వారిని వ్యక్తులుగా నిర్మూలించగలుగుతారేమో గానీ, ప్రశ్నించే తత్వాన్ని ఎవరూ ఏమి చేయలేరన్నది ప్రభుత్వాలు గుర్తించుకోవాలని శ్రీనివాస్ పేర్కోన్నారు. పాలకులు కొనసాగిస్తున్న దమన కాండకు వ్యతిరేకంగా ప్రజలంతా సంఘటితమైన ఎదో ఒక రూపంలో నిరసన వ్యక్తం చేయాలని కోరారు.
పౌరసమాజంమౌనం వీడాలి : ప్రొఫెసర్ నాగేశ్వరరావు
ప్రొఫెసర్ కె.నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎన్‌కౌంటర్ల పేరుతో మవోయిస్టులపై కొనసాగిస్తున్న మరణకాండను అందరూ ఖండించాల్సిందేనని, భౌతికంగా మట్టు పెడుతున్న ఘటనలపై పౌర సమాజం మౌనం వీడాల్సిన అవసరముందున్నారు. మావోయిస్టులు , భద్రత బలగాలు తమ ఆయుధాలను పట్టుకుని థార్ ఏడారిలో కూర్చొని కోట్లాడితే వారి జోలికి ఎవరూ వెళ్లరని, కానీ ప్రజాక్షేత్రంలో ఇది కొనసాగుతుందునే ప్రశ్నిస్తున్నామన్నారు. ఈ దేశంలో తుపాకీ పట్టుకున్న అన్నల వద్దకు పేదలు స్వేచ్ఛగా వెళుతున్నట్లే, అదే తుపాకీ పట్టుకున్న పోలీసుల వద్దకు వెళ్లగలిగే పరిస్థితి ఏర్పడినప్పుడు ఈ పోరాటాల అవసరమే లేదని, రాదని ఆయన పేర్కొన్నారు. అందుకు మావోయిస్టుల చర్యలను సమర్థించకపోయినా వారి పట్ల జరగుతున్న అమానుష ఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ హాయాంలోనూ ఎన్‌కౌంటర్లు జరిగాయని, అయితే ఇప్పుడు కూడా జరుగుతున్నాయని, అయితే వాటికి వీటికి చాలా తేడా ఉందన్నారు. ప్రస్తుతం సైద్ధాంతికంగా జరుగుతున్న ఎన్‌కౌంటర్లను ప్రతిఘటించకపోతే ఇందుకు విస్తృతమైన ప్రజా సంఘర్షణకు సిద్దం కావడం ద్వారానే దీనిని అడ్డుకోగలుగుతామని, ఇందుకు సంసిద్దం కావాలని ఆయన కోరారు.
ప్రశ్నించే గొంతుకలను నిర్దక్ష్యంగా అణిచివేత ః డిజి నరసింహారావు.
డి.జి.నరసింహారావు మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి మూడో దఫా అధికారం చేపట్టిన తర్వాత ప్రశ్నించే గొంతుకలను మరింత నిర్ధాక్షిణ్యంగా అణిచివేస్తోందని అగ్రహాం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హాయంలోనూ ఎన్‌కౌంటర్లు జరిగాయని, అయితే బిజెపి ఓ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని ఎదురుపడిన ప్రతి ఒక్కరిని మట్టుపెడుతోందన్నారు. ఆర్‌ఎస్‌ఎస్, ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖమంత్రి అమిత్‌షా త్రయం కలిసి సాగిస్తున్న దమనకాండకు అడ్డుకట్ట వేసేందుకు పౌర సమాజాన్ని పూర్తి భాగస్వామ్యం చేసి పెద్దఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుట్టాల్సిన అవసరముందన్నారు.
కమ్యూనిస్టు ఐక్య ఉద్యమాలతోనే ఆడ్డుకట్ట : చలపతి
వామపక్షాల నాయకులు చలపతిరావు, కె.మురహరి, రమేశ్‌రావు, ప్రసాద్, అనిల్‌కుమార్‌లు మాట్లాడుతూ మధ్యభారతంలో జరగుతున్న హత్యాకాండను అడ్డుకునేందుకు అన్ని కమ్యూనిస్టు పార్టీలు ఐక్య ఉద్యమాలను పెద్దఎత్తున చేపట్టాల్సి అవసరముందన్నారు. ఇందుకు జరిగే పోరాటంలో తమ పార్టీలన్ని భుజం భుజం కలిపి ముందుకు సాగుతాయని ప్రకటించారు. తెలిపారు.
మావోయిస్టులపై హత్యాకాండకు వ్యతిరేకంగా తీర్మానాలు చేయాలి : పశ్యపద్మ
పశ్యపద్మ మాట్లాడుతూ అబుజ్‌మాడ్‌లో మావోయిస్టులపై కేంద్ర పాలకులు కొనసాగిస్తున్న హత్యాకాండను తక్షణమే నిలిపివేయాలని ఎక్కడికక్కడ ప్రజా తీర్మానాలను చేసి ప్రజా ఉద్యమాలను చేపట్టాల్సిన అవసరముందన్నారు. అప్పుడే కేంద్ర పాలకులు కొంత భయం పట్టుకుంటుందన్నారు. లేకపోతే ఈ చర్యలను మరింత యథేచ్ఛగా కొనసాగిస్తుంటాయని హెచ్చరించారు. ఈ ఎన్‌కౌంటర్లపై సుప్రీంకోర్డు న్యాయమూర్తితో విచారణ జరిపించాల్సిదేనన్నారు. అ విచారణలో దోషులకు తేలిన వారిని కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు.
ఎన్‌కౌంటర్ అంటే ఎదుటి పక్షం మాత్రమే చావడమా? ప్రజలు అలోచించాలి : ఎస్.బాల్‌రాజ్
బాల్‌రాజ్ మాట్లాడుతూ ఎన్‌కౌంటర్ జరిగిన ప్రతిసారి ఎదుటి పక్షం వారు మాత్రమే మరణిస్తున్న విషయాన్ని ప్రజలంతా ఆలోచించాలని కోరారు. ఏకపక్ష మరణాలంటే, అవి బూటకపు ఎన్‌కౌంటర్లే స్పష్టమైవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం అవలభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, కొనసాగిస్తున్న రాజ్యహింసకు వ్యతిరేకంగా సాగే ప్రతి ఉద్యమంలో ఎఐటియుసి సంపూర్ణగా భాగస్వామ్యమవుతుందన్నారు.