HomeNewsBreaking Newsఆనకట్టలకు బీటలు!

ఆనకట్టలకు బీటలు!

భారత్‌కు పొంచి ఉన్న ముప్పు ఐక్యరాజ్య సమితి నివేదిక
న్యూయార్క్‌: భారతదేశంలో 2025 నాటికి వేయికిపైగా ఆనకట్టలు సుమారు 50 ఏళ్లు పూర్తి చేసుకుంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇలాంటి వయసు మీరుతున్న నిర్మాణా లు ముప్పును అధికం చేస్తున్నాయని ఐక్యరాజ్య సమితి (ఐరాస) నివేదిక వెల్లడించింది. 2050 నాటికి భూమిపై ఉన్న చాలామంది జనం 20వ శతాబ్దంలో నిర్మించిన వేలాది ఆనకట్టల కిందిభాగంలో నివసించనున్నారని ఆ నివేదిక తెలిపింది. ఐక్యరాజ్య సమితి విశ్వవిద్యాలయానికి చెందిన కెనడాలో ఉన్న ఇన్సిట్యూట్‌ ఫర్‌ వాటర్‌, ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ హెల్త్‌ సంకలనం చేసిన “ఏజింగ్‌ వాటర్‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌: ఎన్‌ ఎమర్జింగ్‌ గ్లోబల్‌ రిస్క్‌” శీర్షికన విడుదలైన ఆ నివేదిక ప్రపంచవ్యాప్తంగా ఉన్న 58,700 భారీ ఆనకట్టల్లో చాలావరకు 50 నుంచి 100 ఏళ్ల జీవితకాల పరిమితితో 1930 1970 మధ్యకాలంలో నిర్మించినవే అని పేర్కొంది. అయితే 50 ఏళ్లయ్యాక భారీ కాంక్రీట్‌ ఆనకట్ట వయోభారం లక్షణాలను సూచిస్తుందని ఆ నివేదిక పేర్కొంది. ఆనకట్టల వైఫల్యం ఎక్కువకావడం, రోజురోజుకు పెరిగే ఆనకట్టల మరమ్మతు, నిర్వహణ ఖర్చు, రిజర్వాయర్‌లో పూడిక పెరగడం, ఆనకట్ట పనితీరు, సామర్థ్యం దెబ్బతినడం లాంటి “ఒకదానికొకటి బలంగా అనుసంధానమైన” రూ పాలనే ఆనకట్టల వయసు మీరుతున్న లక్షణాలుగా ఆ నివేదిక వెల్లడించింది. “2050 నాటి కి భూమిపై ఉన్న చాలామంది 20వ శతాబ్దం లో నిర్మించిన భారీ ఆనకట్టల దిగువభాగంలో నివాసం ఉంటారు. వీటిలో చాలావరకు వాటి డిజైన్‌ లైఫ్‌, లేదా దానికి ఆవలివే” అని ఐరాస విశ్వవిద్యాలయం విశ్లేషించింది. అమెరికా, ఫ్రాన్స్‌, కెనడా, భారత్‌, జపాన్‌, జాంబియా, జింబాబ్వే దేశాల నుంచి ఆనకట్టలకు స్వస్తి పలకడం(డీకమిషనింగ్‌), లేదా వయసు పైబడుతున్న ఆనకట్టల విశ్లేషణ ఈ నివేదికలో ప్రధానం. ఇక 20వ శతాబ్దం మధ్యకాలంలోలా ప్రపంచం మరో ఆనకట్టల నిర్మాణ విప్లవానికి సిద్ధంగా లేదని ఐరాస నివేదిక తెలిపింది. ప్రపంచంలోని మొత్తం భారీ ఆనకట్టల్లో 55% వరకు కేవలం నాలుగు ఆసియా దేశాలు చైనా, భారత్‌, జపాన్‌, దక్షిణ కొరియా దేశాల్లోనే ఉన్నాయని నివేదిక వెల్లడించింది. త్వరలోనే ఈ దేశాల్లోని ఆనకట్టలు 50 ఏళ్ల మైలురాయిని చేరుకోనున్నాయి. ఆఫ్రికా, దక్షిణ అమెరికా, తూర్పు ఐరోపాలోని చాలా ఆనకట్టల పరిస్థితీ ఇదే. భారత్‌ విషయానికి వస్తే 2025 నాటికి దాదాపుగా 1,115 భారీ ఆనకట్టలు 50 ఏళ్ల వయసును కలిగి ఉంటాయి. 2050 నాటికి దేశంలోని మరో 4,250కిపైగా భారీ ఆనకట్టలు 50 ఏళ్లు, 64 భారీ ఆనకట్టలు 150 ఏళ్లు పూర్తి చేసుకుంటాయి. 100 సంవత్సరాల కింద నిర్మించిన కేరళలోని ముల్లపెరియార్‌ ఆనకట్ట “తెగిపోతే” సుమారు 35 లక్షల మంది ప్రజలు ముప్పు బారినపడతారు. భూ చలనాలు చురుగ్గా జరిగే ప్రాంతంలో ఉన్న ఈ ఆనకట్టలో నిర్మాణపరైన లోపాలు కనిపిస్తాయి. ఇక దీని నిర్వహణ విషయంలో కేరళ, తమిళనాడు రాష్ట్రాల మధ్య వివాదం నడుస్తోందని నివేదిక తెలిపింది. మంచి నమూనా, నిర్మాణం, నిర్వహణ కలిగిన ఆనకట్టలు “సులువుగా” 100 ఏళ్లపాటు సేవలందిస్తాయి. అయితే ఆర్థిక, ఆచరణాత్మక పరిమితుల వల్ల ఆనకట్టలను నవీకరించడం సాధ్యం కాకపోవడంతో అమెరికా, ఐరోపాల్లో వాటికి స్వస్తిపలికే చర్చలు చేపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆనకట్టల వెనక భారీ పరిమాణంలో నీటని నిల్వచేస్తున్నారు. దీని ఘనపరిమాణం 7,000 నుంచి 8,300 ఘనపు కిలోమీటర్లు ఉంటుందని అంచనా. ఈ మొత్తం జలరాశి కెనడాలో దాదాపు 80% భూభాగాన్ని ఒక మీటర్‌ నీటితో కప్పేస్తుందట! నీటి నిల్వ మౌలిక వసతుల వయసు పెరగడం, దానివల్ల తలెత్తనున్న జల విపత్తును తట్టుకొనేందుకు అంతర్జాతీయ ప్రయత్నాలకు చురుకు పుట్టించడం విషయంలో ప్రపంచ దృష్టిని ఆకర్షించడమే ఈ నివేదిక లక్ష్యమని యుఎన్‌యు ఐఎన్‌డబ్ల్యుఇహెచ్‌ డైరెక్టర్‌ వ్లాదిమిర్‌ స్మాఖ్తిన్‌ పేర్కొన్నారు. ఆయన ఈ నివేదిక సహ రచయిత కూడా.

DO YOU LIKE THIS ARTICLE?
Prajapaksham
Prajapaksham
Praja Paksham Telugu News (తెలుగు వార్తలు) offers the Latest Telugu News, Breaking News in Telugu (ముఖ్యాంశాలు) from Andhra Pradesh and Telangana. National News, International News Headlines in Telugu Daily. prajapaksham.in is flagship online website of PrajaPaksham Newspaper
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments