బస్తీల్లో పర్యటించిన చాడ, కోదండరామ్, అజీజ్‌పాషా
హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించకపోతే ఉద్యమిస్తామని హెచ్చరిక
ప్రజాపక్షం / హైదరాబాద్ రాష్ర్టంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని, ప్రభు త్వం స్పందించకుంటే అన్ని పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మలక్‌పేట ప్రమిలాతాయినగర్ బస్తీలో చాడ వెంకట్‌రెడ్డి, టిజెఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ ఎం.కోదండరామ్, సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు సయ్యద్ అజీజ్‌పాషా తదితరులు సోమవారం పర్యటించారు. కరోనా నేపథ్యంలో బస్తీవాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ కరోనా పరిస్థితుల నుంచి ప్రభుత్వం ప్రజలను ఆదుకోవాలని, అఖిలపక్ష నేతలను కెసిఆర్ ఆహ్వానిస్తే అందరూ కలిసి కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావచ్చన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితులలో ప్రభుత్వం ఆదుకోకపోతే ప్రజలు ఆకలి చావులతో చనిపోయే ప్రమాదం ఉందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కరోనా కష్టకాలంలో కరెంటు బిల్లులు కూడా ప్రజలపై పెద్ద ఎత్తున మోపుతున్నారని, పాత స్లాబుల కంటే ప్రజలు ఎక్కువ కట్టాల్సి వచ్చిందని చాడ వెంకటరెడ్డి అన్నారు.
లాక్‌డౌన్ ఎత్తేసినా ఉపాధి కరువు : కోదండరామ్
లాక్‌డౌన్ ఎత్తివేయగానే ప్రజలకు ఉపాధి దొరుకుతుందని ప్రభుత్వం భావిస్తోందని, కానీ ఉపాధి లేక ప్రజలు చస్తూ బతుకుతున్నారని, తినడానికి తిండి గింజలు లేవని బస్తీ వాసులు చెబుతున్నారని తెలిపారు. కొవిడ్ చికిత్స సామాన్య ప్రజలకు సైతం అందుబాటులో ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 12 కిలోల బియ్యం, పప్పు, నూనె ఉచితంగా ఇవ్వడంతోపాటు ప్రతి కుటుంబానికి రూ. 7,500 నగదును అందజేయాలన్నారు. మనిషిని కాపాడటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రతి బస్తీలో పర్యటించి ప్రజల సమస్యల తెలుసుకుంటామని కోదండరామ్ వెల్లడించారు. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు అజీజ్‌పాషా మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో కరోనా సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు భయంతో బతుకులు వెళ్ళదీస్తున్నారని, హైదరాబాద్‌లో కరోనా పరీక్షలను పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ హైదరాబాద్ నగర కార్యదర్శి ఇ.టి. నరసింహాతోపాటు సిపిఐ, టిజెఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఆదుకోకపోతే..ఆకలి చావులే
RELATED ARTICLES