గిరిజనేతరులకు త్వరలో న్యాయం చేస్తాం
మహిళల పేరు మీదే పోడు పట్టాలు
మారుమూల గ్రామాల గిరిజనులకూ త్రీఫేజ్ కరెంట్
ఆసిఫాబాద్ బహిరంగ సభలో సిఎం కెసిఆర్
ప్రజాపక్షం/ఆసిఫాబాద్ ప్రతినిధి
పోడుభూములు కొట్టేసినందుకు ఆదివాసీ గిరిజనులపై పెట్టిన కేసులను ఎత్తివేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఇక గిరిజనులపై ఎలాంటి కేసులు ఉండవని, అందుకోసం అనుసరించాల్సిన ప్రక్రియపై సిఎస్, డిజిపికి ఆదేశాలు జారీ చేస్తామని స్పష్టం చేశారు. “రాష్ట్రవ్యాప్తంగా 1,51,000 మంది రైతులకు 4.06 లక్షల ఎకరాలకుపైగా పోడు భూముల పట్టాలను పంపిణీ చేస్తున్నాం. పోడు భూముల విషయంలో గిరిజన రైతులు కాకుండా గిరిజనులు కానివారు కూడా ఉన్నారు. అయితే, 75 ఏళ్లుగా వారు ఒక చోట నివాసముంటున్నట్లు రుజువు చేయాల్సి ఉంటుంది. అందుకోసం ఒక ప్రక్రియను తీసుకొస్తాం. త్వరలోనే పనులు పూర్తి చేసి వారికి కూడా న్యాయం చేస్తాం” అని సిఎం చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని సిఎం కెసిఆర్ శుక్రవారం ఆసిఫాబాద్‌లో ప్రారంభించారు. కుమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా పర్యటనలో ఆసిఫాబాద్, సిర్పూర్ (టి) నియోజకవర్గ ఆదివాసీలకు పోడుపట్టాలను సిఎం పంపిణీ చేశారు. పోడు పట్టాలు పొందిన ఆదివాసీలకు రైతుబంధు చెక్కులను కూడా అందించారు. పోడు పట్టాలన్నింటినీ మహిళల పేరు మీదే అందిస్తున్నామని, రెండు మూడు రోజుల్లో పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని సిఎం తెలిపారు. పర్యటనలో భాగంగా అంతకుముందు ఆసిఫాబాద్‌లో బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం, ఎస్‌పి కార్యాలయం, సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని సిఎం కెసిఆర్ ప్రారంభించారు. అనంతరం కుమురం భీం విగ్రహాన్ని సిఎం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో సిఎం కెసిఆర్ మాట్లాడారు. “తెలంగాణ ఉద్యమం సమయంలో అడవి ప్రాంతాలు తిరుగుతున్నప్పుడు మావా నాటె..మావా రాజ్.. నా గూడెంలో నా రాజ్యం.. మా తండాలో మా రాజ్యం అని చెప్పేవాళ్లు. అనేక దశాబ్దాలు గిరిజనులు పోరాటం చేసినా అది సాధ్యంకాలేదు. కానీ బిఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో దాదాపు 3 నుంచి 4వేల గిరిజన గూడేలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడమే కాదు.. కుమ్రంభీమ్ పేరుతో కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా ఏర్పాటు చేసుకున్నాం” అని సిఎం అన్నారు.
వాళ్ల పేరు మీదనే పోడు పట్టాలు.. మారుమూల పొలాలకూ త్రీఫేజ్ కరెంటు
ఇప్పటివరకు గిరిజన గ్రామాలకు కరెంటు సదుపాయం కల్పన దాదాపు పూర్తయ్యిందని, ఇకపై అన్ని జిల్లాల్లో మారుమూల గ్రామాల్లో ఉన్న గిరిజనుల పొలాలకు కూడా త్రీఫేజ్ కరెంటు ఇస్తామని సిఎం ప్రకటించారు. ’గిరివికాసం’ కింద బోర్లు వేసుకునేందుకు అవకాశం కల్పిస్తామని కెసిఆర్ వెల్లడించారు. త్వరలో మెడికల్ కాలేజీ కూడా అందుబాటులోకి రానున్నదని సీఎం పేర్కొన్నారు.
ధరణిని తీసేస్తే మళ్లీ పైరవీలు, రైతులకు సమస్యలు ఎదురౌతాయ్
ధరణిని తీసేస్తే మళ్లీ పైరవీకారుల మందలు రాజ్యమేలుతయని, రైతులకు సమస్యలు ఎదురౌతాయని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు అన్నారు. ధరణిని ఎత్తివేస్తే భూరికార్డుల్లో అడ్డగోలు మార్పులు చేర్పులు చోటుచేసుకుంటయని, అవినీతి అధికమై అమాయక రైతులు దోపిడీకి గురైతరని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో అలాంటి పరిస్థితి ఉండకూడదనే తాము ధరణిని తీసుకొచ్చామని, ఇప్పుడు ధరణిని తీసేస్తే పరిస్థితి మళ్లీ మొదటికొస్తదని సిఎం అన్నారు. అందుకే తాను ఎక్కడికి పోయినా ప్రజలను ధరిణి ఉండాల్నా.. వద్దా..? అని అడుగుతున్నానని, కానీ ఎక్కడ అడిగినా ప్రజలు మాత్రం ధరణి ఉండాలనే కోరుకుంటున్నరని ఆయన తెలిపారు. ప్రజలేమో ధరణి కావాలని కోరుకుంటుంటే, కాంగ్రెసోళ్లు మాత్రం ధరిణి తీసేయాలంటున్నారని అని కెసిఆర్ విమర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు మహ్మద్ మహమూద్ అలీ, ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, విప్ బాల్క సుమన్, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ కోవలక్ష్మి, ఎంఎల్‌ఎసి దండే విఠల్, ఎంఎల్‌ఎలు కోనేరు కోనప్ప, ఆత్రం సక్కు, నడిపెల్లి దివాకర్‌రావు, రాథోడ్ బాపు, జోగు రామన్న, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, సిఎంఓ కార్యదర్శి స్మిత సబర్వాల్, డిజిపి ఎం.అంజనీకుమార్, జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవ్ రావు, ఉట్నూర్ సమగ్ర అభివృద్ది సంక్షేమ సంస్థ ప్రాజెక్టు అధికారి వరుణ్ రెడ్డి, పెద్ద సంఖ్యలో గిరిజనులు, గిరిజన నేతలు పాల్గొన్నారు.
ఆదివాసీ గిరిజనులపైకేసులన్నీ ఎత్తివేస్తాం
RELATED ARTICLES