2004 నుంచి ముందుకు కదలని వ్యవహారం
కొన్నాళ్లపాటు ఎక్కడ నిర్మించాలంటూ కాలయాపన
ప్రస్తుతం ఆ ఊసే ఎత్తని తెలంగాణ సర్కారు
ప్రజాపక్షం/హైదరాబాద్ : ఆదిలాబాద్ జిల్లానంతటిని సస్యశ్యామలం చేయాలని చేసిన సాగునీటి ప్రాజెక్టు ఆలోచన అటకెక్కినట్లే కనిపిస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలోని సాగుభూములకు నీరందించాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే 2004లో పెన్‌గంగ, వార్దా నదులు కలిసే చోట ప్రాణహితపై బ్యారేజీ నిర్మించాలని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ నిర్ణయం అప్పటి నుంచి ఆలోచనలకే పరిమితమైంది తప్ప కార్యరూపం దాల్చలేదు. ప్రత్యేక తెలంగాణ సాధించిన అనంతరం ఏర్పడిన టిఆర్‌ఎస్ తొలి ప్రభుత్వం దీనిపై కొత్త ఆలోచన చేసినప్పటికి అది కూడా ఇప్పటి వరకు ముందుకు సాగడం లేదు. విషయానికి వస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సాగు భూములకు నీరందించేందుకు ఒక బ్యారేజీని తమ్మిడిహెట్టి వద్ద నిర్మించాలని నిర్ణయించారు. ఇది అధ్యయనంలోనే ఉండగా ప్రత్యేక తెలంగాణ ఏర్పడింది. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ పెండింగ్ ప్రాజెక్టులతో పాటు కొత ప్రాజెక్టుల నిర్మాణంపైనే ప్రధాన దృష్టి కేంద్రీకరించింది. ఇందులో భాగంగా తమ్మిడిహెట్టి బ్యారేజీ సర్కారు దృష్టికి వచ్చింది. దీనిపై అధ్యయనం చేయాలని, మరింత ఎక్కువ సాగుభూమికి నీరందించేలా రూపొందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే పెన్‌గంగా, వార్దా నదుల అనంతరం ప్రాణహితపై కాకుండా వార్ధాపై నిర్మిస్తే ఎలా ఉంటుందన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది. 2004లో ఈ బ్యారేజీ నిర్మించాలని నిర్ణయించినప్పుడు దీని ద్వారా ఆదిలాబాద్ జిల్లాలోని 56వేల ఎకరాలకు సాగునీరందించాలని నిర్ణయించారు. తెలంగాణ ఏర్పడిన అనంతరం అన్ని ప్రాజెక్టులను రీడిజైన్ చేసినట్లుగానే దీనిని చేసి మరో 1.44లక్షల ఎకరాలకు సాగునీరందించాలని నిర్ణయించారు. అయితే ఈ బ్యారేజీని ప్రాణహిత పైనా, వార్దాపైనా నిర్మించాలా అంటూ చేసే ఆలోచనలతోనే అధికారులు, ప్రభుత్వం కాలం వెల్లదీస్తూ వస్తోంది తప్ప దీనికి కార్యరూపం ఇవ్వడం లేదు. తెలంగాణ సర్కారు కొత్త ఆలోచన మేరకు రీడిజైన్ చేసి తమ్మిడిహెట్టి వద్దనే 4.5టిఎంసీల సామర్థ్యంతో బ్యారేజి నిర్మించి 20టిఎంసీల నీటిని ఎత్తిపోసేలా రూపొందించారు. దీనికి రూ.639కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. అయితే ప్రతిపాదిత ప్రాంతంలో నిర్మిస్తే వణ్యప్రాణికి నష్టం బాగా వాటిల్లుతుందని తేలడంతో నిర్మాణ ప్రాంతాన్ని ప్రాణహితపైనే ఒకటిన్నర కిలోమీటర్ ఎగువకు బ్యారేజీ నిర్మాణాన్ని మార్చారు. దీంతో అంచనా వ్యయం రూ.1918.70కోట్లకు చేరింది. ఈ విధంగా నిర్మిస్తే ఆ ప్రాంతం చాలా వెడల్పుగా ఉండడంతో మొత్తం 6.45 కిలోమీటర్ల మేర బ్యారేజిని నిర్మించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అంతే కాదు దీనికి ఏకంగా 107 గేట్లు నిర్మించాల్సిన పరిస్థితి తలెత్తింది. దీంతో పాటు మహారాష్ట్రలోని చంద్రాపూర్, గడ్చిరోలి జిల్లాల్లో 509ఎకరాలు ముంపుకు గురవుతోందని గుర్తించారు. ప్రస్తుత ఆసిఫాబాద్ జిల్లాలో కూడా 300ఎకరాల ముంపు ఉంటుందని గుర్తించారు. ఇలా లెక్కలు వేయడం, అక్కడా ఇక్కడా అంటూ ఆలోచనలు చేయడంతోనే తెలంగాణ సర్కారు తన తొలి అయిదేళ్లు గడిపేసింది. దీంతో అప్పట్లో దీని అంచనా వ్యయం రూ.1918.70కోట్లు అయితే అదే డిజైన్‌తో నిర్మిస్తే ఇప్పుడు దీని అంచనా వ్యయం 2500కోట్లు దాటుతుందని అంచనా. ప్రాణహితపై కాకుండా వార్దాపై నిర్మిస్తే ఖర్చుతో పాటు ముంపుకూడా తగ్గుతుందేమో ఆలోచనకు ప్రభుత్వం వచ్చింది, దీనిపై పునరాలోచన చేయండి అంటూ సిఎం అధికారులను ఆదేశించి కూడా ఏళ్లు గడుస్తోంది. అయితే ఈ విషయంలో అధికారులు వార్దాపై నిర్మిస్తే ఎలా ఉంటుందన్న దానిని ముఖ్యమంత్రికి వివరించారు. అధికారుల వివరణ ప్రకారం వార్దాపై నిర్మిస్తే మొత్తం ముంపు 400 ఎకరాలకు మించదని అంచనాకు. అంతే కాదు బ్యారేజీ నిర్మాణానికి ఖర్చు కూడా రూ.700కోట్లు దాటదని సిఎంకు తెలిపినట్లు తెలిసింది.