లాక్‌డౌన్‌పై ప్రభుత్వం తర్జనభర్జనలు
ప్రజాపక్షం / హైదరాబాద్ : రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్‌లో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఏమి చేయాలనే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. హైదరాబాద్‌లో నిత్యం కరోనా కేసులు పెరగడం పట్ల అధికార యంత్రాంగం భయపడుతుంది. ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలనే అంశంపై ప్రభుత్వం, అధికార యంత్రాంగం రకరకాల ఆలోనచనలు చేస్తున్నట్లు సమాచారం. కరోనా వ్యాప్తి నివారణకు కేసు లు ఎక్కువగా నమోదవుతున్న హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో తిరిగి లాక్‌డైన్ విధిస్తే ఉపయోగం ఉంటుందా, లేదా రాష్ట్రమంతా తిరిగి లాక్‌డౌన్ విధించాలా అని యోచిస్తున్నారు. ఒకవేళ లాక్‌డౌన్ విధిస్తే ఉద్యోగాలు, వ్యాపారాల పరిస్థితి ఏమిటి, ఇటీవల విధించిన లాక్‌డౌన్ పరిస్థితుల నుంచి రాష్ట్రం ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా తిరిగి లాక్‌డౌన్ విధిస్తే ఎలాంటి పరిణామాలుంటాయనే ఆలోచనలో ప్రభుత్వం పడినట్లు సమాచారం. లాక్‌డౌన్ కారణంగా వ్యాపారాలు, వాణిజ్య సంస్థలు మూతపడి వందల కోట్లకు పడిపోగా లాక్‌డౌన్ అనంతరం అవి తెరుచుకుని కార్యకలాపాలు కొనసాగించడంతో ప్రభుత్వం వేల కోట్లకు పెరిగింది. పైగా గత ఏడాది జూన్ నెలతో పోల్చితే ప్రస్తుత జూన్ నెలలో జిఎస్‌టి ఆదాయం 3 శాతం పెరిగింది. తిరిగి లాక్‌డౌన్ విధిస్తే వ్యాపారాలు, వాణిజ్య సంస్థలు మూతపడి రాష్ట్ర ఖజానా ఆదాయాన్ని కోల్పోవడమే కాకుండా సంక్షోభ పరిస్థితి వస్తుందని, మరోవైపు లాక్‌డౌన్ వంటి కఠిన చర్యలు చేపట్టకపోతే ప్రజల ఆరోగ్యం క్షీణించి మరణాల బారిన పడే ప్రమాదముందని అంచనా వేస్తున్నారు. ఈ సంకటం కారణంగానే కరోనా కేసులు పెరుగుతున్నాయని, వీటిని అరికట్టడానికి హైదరాబాద్‌లో తిరిగి లాక్‌డౌన్ విధించాలని వైద్య, ఆరోగ్య శాఖ నివేదిక ఇచ్చిందని, లాక్‌డౌన్ విషయంలో మూడు నాలుగు రోజుల్లో ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సిఎం కెసిఆర్ సంబంధిత అధికార యంత్రాంగాన్ని ఆదేశించిన గడువు దాటిపోయినప్పటికీ ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని అధికార వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో ఏమి చేయాలనే దానిపై ప్రభుత్వం డైలామాలో ఉన్నదని అధికార వర్గాలు అంటున్నాయి. కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రభుత్వం లాక్‌డౌన్ విధిస్తుందా లేదా అని ప్రజల్లో ఆసక్తి నెలకొంది. ఒక వేళ విధిస్తే ఏమి చేయాలనే దానిపై ప్రజలు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఆలోచనలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రజల్లో భయం నెలకొని స్వచ్ఛందంగా మళ్ళీ ఊరు బాట పట్టారు. చాలా ఐటి తదితర కంపెనీలు వర్క్‌ఫ్రమ్ హోమ్ అమలు చేస్తుండడంతో ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తున్నారు. దీంతో కరోనాపై ప్రజల్లో కొంత వరకు చైతన్యం వచ్చినట్లు కనబడుతుందని, పరిస్థితిని ఇదే విధంగా కొనసాగించాలా అనే మరో ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తుందంటున్నారు. లాక్‌డౌన్ పూర్తిగా అమలులో ఉన్నప్పుడు ఒక ప్రాంతంలో కరోనా పాజిటివ్ కేసు నమోదైతే ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తూ ఆ ప్రాంతమంతా కంటైన్‌మెంట్ జోన్‌గా పరిగణించి దాని వ్యాప్తి జరగకుండా తగిన నివారణ చర్యలు తీసుకున్నారు. క్రమంగా దానిని కరోనా కేసు వచ్చిన వీధికి, అనంతరం కేసు నమోదైన ఇంటిని మాత్రమే కంటైన్‌మెంట్ చేశారు. ప్రస్తుత కరోనా విచ్చిన వారి ఇంటిని కూడా కంటైన్‌మెంట్ చేయడం లేదని, కరోనా పాజిటివ్ వచ్చిన వారిని వారి ఇంటి నుంచి బయటకు రావద్దని మాత్రమే సూచిస్తున్నారని పలువురు చెబుతున్నారు. తాజాగా కంటైన్‌మెంట్ జోన్లలో లాక్‌డౌన్‌ను ఈనెల 31వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ ఇప్పటివరకు ఏ ప్రాంతాన్ని కొత్తగా కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో కంటైన్‌మెంట్ జోన్లు ఉన్నట్లా? లేనట్లా, ప్రభుత్వం లాక్‌డౌన్ విధిస్తుందా లేదా అని సందిగ్ధత ప్రజల్లో నెలకొంది.
ఆదాయమా.. ఆరోగ్యమా?
RELATED ARTICLES