HomeNewsBreaking Newsఆదాయంలేని గృహశ్రమ

ఆదాయంలేని గృహశ్రమ

దేశంలో రోజూ ఏడు గంటలుపైగా పనిచేస్తున్న గృహిణులు
అహ్మదాబాద్‌ ఐఐఎం నివేదిక
అహ్మదాబాద్‌ :
భారతదేశంలో మహిళలు ప్రతిరోజూ 7.2 గంటలు గృహశ్రమ చేస్తున్నారు. పురుషులతో పోల్చిచూసినప్పుడు వారు కేవలం 2.8 గంటలు మాత్రమే గృహశ్రమ చేస్తున్నారు. దేశంలోని ఇళ్ళల్లో 15 నుండి 60 ఏళ్ళలోపు మహిళలు ప్రతిరోజూ 7.20 గంటలసేపు గృహశ్రమ చేస్తున్నారని, తమ తమ ఇళ్ళల్లో చేసే ఈ శ్రమకుగాను వారికి ఒక్క రూపాయి ఆదాయం కూడా లభించదని అహ్మదాబాద్‌లోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం) పరిశోధనా నివేదిక వెల్లడించింది. దేశంలో మహిళలు ప్రస్తుతం ‘సమయ దారిద్య్రం’తో బాధపడుతున్నారని, వారికి తగినంత ఖాళీ సమయం లభించడంలేదని, రాజీ పడుతున్నారని పరిశోధనా నివేదిక పేర్కొంది. వారానికి 50 గంటల కంటే ఎక్కువ సమయం వారు ఇంటి పనులకోసం ఖర్చు చేస్తున్నారు. అహ్మదాబాద్‌ ఐఐఎంలోని ప్రొఫెసర్‌ నమ్రత చిందార్కర్‌ పరిశోధనా నివేదిక వివరాలను ఆదివారం పిటిఐ వార్తాసంస్థకుచెప్పారు. చివరకు వివిధ మార్గాల్లో ఆదాయాలు సంపాదించే మహిళలు కూడా, గృహ అవసరాలు తీర్చడంకోసం ఇంట్లో మగవారు చేసే సంపాదనకు రెట్టింపు విలువగల గృహ శ్రమ చేస్తున్నారని నమ్రత చిందార్కర్‌ చెప్పారు. ఆదాయం ఉన్న స్త్రీలకు, ఆదాయం లేని స్త్రీలకు క్లీనింగ్‌, వంట, సంరక్షణ చర్యలు వంటి అనేక పనులు చేయడానికే సమయం సరిపోవడం లేదని, వారు సమయ దారిద్య్రంతో బాధపడుతున్నారని అన్నారు. నేషనల్‌ శాంపుల్‌ సర్వే ఆఫీస్‌ (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ)కు చెందిన “టైమ్‌ యూజ్‌ సర్వే” (టియుఎస్‌) ఆధారంగా ఈ నివేదిక రూపొందించారు.అయితే ఇది ప్రజలకు సర్వసాధారణంగా తెలిసిన విషయాలే అయినప్పటికీ అధ్యయన రీత్యా రుజువుకాలేదు. “దేశంలో మహిళలు ఎక్కువ సమయం ఇంటిని చక్కదిద్దుకోవడంలో, ఇంటి పనులు చేయడంలోనే గడుపుతారు, ఈ పనులు చేసినందుకు వారికి నగదు రూపేణా ఎలాటి ఆదాయం లభించదు” అని ‘టైమ్‌ యూజ్‌ డేటా ః ఎ టూల్‌ ఫర్‌ జెండర్డ్‌ పోలసీ ఎనలైసిస్‌’ పేరిట విడుదలైన ఈ పరిశోధనా నివేదిక పేర్కొంది. మొదటిసారి ఈ నివేదిక ద్వారా ఇళ్ళల్లో స్త్రీ శ్రమపై ఈ నివేదిక ప్రచురించారు. దేశంలో సగటున ప్రతి మహిళా ఏడున్నర గంటలు ఇళ్ళల్లో శ్రమ చేస్తున్నారు.అదే సమయంలో పురుషులు రోజుకు 2.8 గంటలు శ్రమ చేస్తున్నారు. అనేక సంవత్సరాలుగా ఈ పరిశీలనలు జరిగాయి. యూరప్‌లో కూడా ఈ విధమైన సర్వేలు జరిగాయి. ్రస్త్రీలు, పురుషులు తమ తమ జీవితాలలో ఏ విషయానికి ఎంత సమయం కేటాయిస్తున్నారు, వీటిల్లో ఉత్పాదకత, అనుత్పాదకత విభజన ఏ శాతంలో ఉంది అనే విషయాలు స్పష్టంగా తెలుసుకోవడానికి ఈ గణాంకాలు, అధ్యయనం దోహదం చేస్తుంది. అనేక సంవత్సరాలుగా ఈ టైమ్‌ యూజ్‌ డేటా అనేక రంగాల పురోగతికి దోహదం చేస్తున్నది. స్త్రీ పురుష సమానత్వ విలువలను అంచనా వేయడానికి ఈ నివేదికలు దోహదం చేస్తున్నాయి. స్త్రీ పురుషులు దశాబ్దాల కాలం నుండి ఈనాటి వరకూ తమ సమయాన్ని వివిధ తరాలవారు ఏ విధంగా ఖర్చు చేస్తునారన్న విషయాలు దీనిద్వారా తెలుసుకోవచ్చు. వివిధ దేశాలలో మహిళలు ఎక్కువ సమయం తమ మౌలికమైన అవసరాలు తీర్చుకోవడంకోసం, మౌలికంగా ఇంటి పనులకోసమే కేటాయిస్తున్నారు, భర్తలు క్లీనింగ్‌ వంటి చిన్న పనులకు ఉపయోగపడుతున్నారు. వివిధ కార్యకలాపాల నిమిత్తం స్త్రీలు, పురుషులు ఎంతెంత సమయం కేటాయిస్తున్నారు, ఎంత తక్కువ సమయంలో ఎంత ఉత్పాదక పనులు చేస్తున్నారన్న విషయాలు తెలుసుకోడానికి ఈ నివేదికలు దోహదం చేస్తున్నాయి. స్త్రీలు ఎక్కువ సమయం విద్యుత్‌ కాంతిలోనే పనిచేస్తున్నారు. స్త్రీలు తాముచేసే పనులకు విద్యుత్‌ ప్రధానమైన వనరుగా ఉంటోంది. పురుషులతో పోలిస్తే 35 నిమిషాలు అదనంగా స్త్రీలు విద్యుత్‌ ఆధారిత వనరులతో ఇంటి పనులు చేస్తున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments