కెఆర్‌ఎంబి పరిధిలోకి ఉమ్మడి ప్రాజెక్టులను చేరిస్తే తెలంగాణకు తీవ్ర నష్టం
రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలిపెట్టుగా మారనున్న అంశాలపై ప్రభుత్వం దృష్టిపెట్టాలి
మాజీమంత్రి హరీశ్‌రావు
ప్రజాపక్షం/హైదరాబాద్ రాష్ట్రంలోని ఉమ్మడి ప్రాజెక్ట్‌లు కెఆర్‌ఎంబి పరిధిలో చేరిస్తే తెలంగాణకు ఆత్మహత్యా సదృశ్యమేనని బిఆర్‌ఎస్ మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఉమ్మడి ప్రాజెక్టులు కెఆర్‌ఎంబి పరిధిలోకి వారం రోజుల్లోగా వెళ్తాయని, దీనికి సంబంధించి ఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ప్రభుత్వం అంగీకరించినట్టు తెలుస్తోందని, ఇదే జరిగితే తెలంగాణ రాష్ట్రానికి నష్టమని, ఎపికి లాభమని వివరించారు. రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టుగా మారబోతున్న అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బిఆర్‌ఎస్ నాయకులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, దేశపతి శ్రీనివాస్‌తో కలిసి హరీశ్‌రావు మాట్లాడుతూ కొండ పోచమ్మ, మల్లన్న సాగర్ ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు కూడా వెంటనే నీటిని విడుదల చేయాలని, కాళేశ్వరం పంపులను సాంకేతికంగా 24 గంటలు నడపాలని, ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో మోటార్లు నడప కూడదని సూచించారు. కాళేశ్వరంపై రోజుకో లీకు, ఫేక్ వార్తను ప్రభుత్వం సృష్టిస్తున్నదని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలే బిఆర్‌ఎస్‌కు ముఖ్యమని, అందుకు ఎంతకైనా తెగిస్తుందన్నారు. ప్రాజెక్ట్ అంశంలో ప్రభుత్వం స్పందించకపోతే బిఆర్‌ఎస్ పోరాటం చేయక తప్పదని
హెచ్చరించారు. మేడిగడ్డ బ్యారేజికి నష్టం కలిగినా నీటిని ఎత్తిపోయడంలో ఇబ్బంది లేదని, ఇప్పటికీ అక్కడ 4 నుంచి 5 వేల క్యూసెక్కుల నీళ్లు ప్రవహిస్తున్నాయని వివరించారు. రాష్ట్రంలోని ఉమ్మడి ప్రాజెక్ట్‌లను కెఆర్‌ఎంబి పరిధిలోనికి తీసుకురావాలని గత ఏడాది జులై మాసంలోనే కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను నాటి సిఎం కెసిఆర్ వ్యతిరేకించారని గుర్తుచేశారు. తాము ఆనాడు కొన్ని షరతులను విధించామని, దీనిని కేంద్రం ఒప్పుకోలేదన్నారు.
కృష్ణా జలాల్లో తెలంగాణ రాష్ట్ర వాటా తేలనప్పుడు కెఆర్‌ఎంబి పరిధిలోకి ఉమ్మడి ప్రాజెక్టులను ఎలా తెస్తారని ప్రశ్నించారు. శ్రీశైలం నుండి జల విద్యుత్ ఉత్పత్తి చేసి 264 టిఎంసిల నీటిని నాగార్జున సాగర్ కు విడుదల చేయాలని మరో షరతు కూడా విధించామని తెలిపారు. ఎక పక్షంగా కెఆర్‌ఎంబి పై నిర్ణయం తీసుకోకుండా అపెక్స్ కమిటీ వేయాలని తాము ఆనాడే కోరిన విషయాన్ని హరీశ్‌రావు గుర్తు చేశారు. ఆపరేషన్ మాన్యువల్ రూపొందించకుండా కెఆర్‌ఎంబి పరిధిలోకి ఎలా తెస్తారన్నారు. కెఆర్‌ఎంబి చేతిలో ప్రాజెక్టులు పెడితే మనకు ఇష్టం ఉన్నపుడు విద్యుత్ ఉత్పత్తి చేసుకునేందుకు వీలు ఉండబోదని, కెఆర్‌ఎంబికి దరఖాస్తు పెట్టి వాళ్ళు అనుమతించే లోపు గ్రిడ్ కుప్ప కూలుతుందని తెలిపారు.
ఆత్మహత్యా సదృశ్యమే
RELATED ARTICLES