పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
ఆటో డ్రైవర్స్ సంఘాల జెఎసి చలో అసెంబ్లీ ఉద్రిక్తం
ప్రజాపక్షం / హైదరాబాద్ దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఆటో డ్రైవర్ల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ర్ట ఆటో డ్రైవర్స్ సంఘాల జెఎసి శుక్రవారం చేపట్టిన ‘చలో అసెంబ్లీ’ ఉద్రిక్తతకు దారి తీసింది. వందలాది ఆటో డ్రైవర్‌లను పోలీసులు అరెస్టు చేశారు. ‘చలో అసెంబ్లీ’లో భాగంగా హైదరాబాద్ హియాయత్‌నగర్‌లోని సత్యనారాయణరెడ్డి
భవన్ నుండి ఉదయమే వందలాది ఆటోడ్రైవర్‌లు అసెంబ్లీ వైపు బయలు దేరారు. వ్యూహాత్మకంగా పోలీసుల నిర్బంధాలను అధిగమించి సత్యనారాయణ రెడ్డి భవన్ నుండి ఒక్కసారిగా ఆటో డ్రైవర్లు హిమాయత్ నగర్ ప్రధాన రహదారిపై ప్రభుత్వానికి వ్యతరేకంగా నినాదాలు చేస్తూ ప్రదర్శనగా దూసుకొచ్చారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలిసులు అప్రమత్తమైయ్యే లోపు పోలీసుల బారికేడ్ల తోసుకుంటూ అసెంబ్లీ వైపు పరుగులు తీశారు. పోలీసులు అతికష్టం మీద హిమాయత్ నగర్ వై జంక్షన్ వద్ద అడ్డుకుని అరెస్ట్ చేసి నగరంలోని పలు పొలీస్ స్టేషన్ లకు తరలించరు. “చలో అసెంబ్లీ” కార్యక్రమాన్ని నిరోధించేందుకు పొలిసు బలగాలు శుక్రవారం తెల్లవారుజామున తెలంగాణ రాష్ర్ట ఆటో డ్రైవర్స్ సంఘాల జెఎసి నేతలు ఎండి. అమానుల్లా ఖాన్ (తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్), ఒమర్ ఖాన్, సిహెచ్. జంగయ్య (ఎఐటియుసి) జి. మల్లేశ్ గౌడ్ (ఐఎన్‌టియుసి), అజయ్ బాబు (సిఐటియు), వి.కిరణ్ (ఐఎఫ్‌టియు) తదితర నేతల ఇళ్లపై దాడి చేసి బలవంతంగా అరెస్ట్ చేసారు. “చలో అసెంబ్లీ” ప్రదర్శనను ఉద్దేశించి తెలంగాణ రాష్ర్ట ఆటో డ్రైవర్స్ సంఘాల జెఎసి కన్వీనర్, ఎఐటియుసి ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి బి. వెంకటేశం మాట్లాడుతూ 2014 సంవత్సరం నుండి నేటివరకు ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించకుండా పెండింగ్ రాష్ర్ట ప్రభుత్వం పెట్టిందని, లెక్కలేనన్ని ధర్నాలు, పోరాటాలు చేసిన చీమకుట్టినట్టుకూడా లేదని ఆవేదన వ్యక్తం చేసారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ మరియు నిత్యావసర వస్తువుల ధరలు అడ్డుఅదుపు లేకుండా పెరగడం వల్ల రవాణారంగా కార్మికుల జీవనం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడిందన్నారు. పెరిగిన ఇంధన, నిత్యావసర ధరలకు అనుగుణంగా ఆటో మీటర్ చార్జీలను మినిమం ఛార్జీ రూ.45 , కిలోమీటర్ కు రూ. 20- వెంటనే పెంచాలని, సామాజిక భద్రత కోసం ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ను ఏర్పాటు చేయాలని, కొత్త ఆటో పర్మిట్లను జారీచేయాలని, పెరిగిన ఆటో ఇన్సూరెన్సు ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. అలాగే ఆంధ్ర ప్రదేశ్ రాష్ర్టం మాదిరి తెలంగాణ రాష్ర్టంలో కూడా లైసెన్స్ కలిగిన ప్రతి ఆటో కార్మికునికీ “వాహన మిత్ర” ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం వెంటనే ఆటో రిక్షా కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే నిరవధిక ఆందోళనలు చేస్తామని వెంకటేశం హెచ్చరించారు. ఎఐటియుసి సీనియర్ నాయకులూ వి.ఎస్. బోస్ మాట్లాడుతూ ఆటో రిక్షా కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం తాత్సారం చేయడం సిగ్గుచేటు అని విమర్శించారు. ఆటో డ్రైవర్ల బతుకులు దినదిన గండంగా మారాయని వారి జీవితాలు ప్రశ్నార్థకంగా మారాయని, రాత్రి పగలూ తేడా లేకుండా ఆటోరిక్షాలు నడుపుతున్నా ఆ కష్టం ఒక్క పూటైనా తిండి గడిచేలా లేదని అయన ఆవేదన వ్యక్తం చేసారు. త్వరితగతిన సమస్యలు పరిష్కరించి ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలని అయన డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో ఎ. సత్తి రెడ్డి (ఆటో యూనియన్స్), ఎం.ఎ.సలీం, నజీర్ (తాడ్వా), ఆర్. మల్లేశ్, కొమురవెల్లి బాబు, ఎస్కె లతీఫ్, ఎం. శ్రీనివాస్, యాదగిరి, ఫరూక్, అబ్బాస్, శ్యామ్ (ఎఐటియుసి), ఎం. అంబదాస్ (ఐఎన్‌టియుసి), ఎండి. హబీబ్ (జిహెచ్‌ఎడియు) తదితరులు పాల్గొని అరెస్ట్ అయ్యారు.
ఆటో డ్రైవర్ల సమస్యలపై నిర్లక్ష్యం ఎందుకు?
RELATED ARTICLES