ఉద్యోగుల ఇపిఎఫ్ సొమ్ము చెల్లించని యాజమాన్యం
రెండున్నరేళ్లకు రూ.2.7 కోట్లు బకాయిపడ్డ ప్రభుత్వరంగ సంస్థ
దయనీయ స్థితిలో కార్పొరేషన్ ఉద్యోగులు
ప్రజాపక్షం / హైదరాబాద్ : యాజమాన్య నిర్లక్ష్య వైఖరి ఉద్యోగులను సమస్యల సుడిగుండంలో నెట్టింది. ప్రభు త్వ రంగ సంస్థ అయినా సిబ్బందికి భరో సా లేకుండా పోయింది. వికలాంగుల కార్పొరేషన్ యాజమాన్య వైఖరి కారణంగా సంస్థ ఉద్యోగులు తమకు రావాల్సిన ప్రయోజనాలు పొందలేక పోతున్నారు. గత రెండున్నరేళ్ళుగా ఉద్యోగుల ఇపిఎఫ్‌ను యాజమాన్యం చెల్లించడం నిలిపివేసిందని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దాదాపు రూ. 2.70 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. దీం తో ఉద్యోగులు ఎలాంటి బెనిఫిట్స్ పొందలేక పోతున్నారని వాపోతున్నారు. ఉద్యోగుల జీతాల నుండి పిఎఫ్ సొమ్మును మినహాయించుకుంటున్న యాజమాన్యం ఇపిఎఫ్ సంస్థకు మాత్రం చెల్లించడం లేదని విమర్శిస్తున్నారు. వికలాంగుల కార్పొరేషన్ అంటే ప్రభుత్వం ఏదైనా నిర్లక్ష్యంగా చూ స్తున్నారనే అభిప్రాయం ఉద్యోగుల్లో నెలకొంది. వికలాంగులకు చేయూతనిచ్చే సంక్షేమ పథకాల అమలులో ప్రధాన పాత్ర పోషించే ఉద్యోగులపై యాజమాన్యం అవలంబిస్తున్న తీరు సహేతుకంగా లేదని ఉద్యోగ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత సంస్థ పనితీరు మరింత దిగజారే విధంగా మారిందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. రాష్ట్ర విభజన తర్వాత పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కార్పొరేషన్ ఉద్యోగలకు అన్ని ప్రయోజనాలు లభిస్తుంటే తెలంగాణలో మాత్రం పరిస్థితులు మరింత దిగజారినుట్లు విమర్శలు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కార్పొరేషన్‌లో 145 మంద ఉద్యోగులండగా ప్రస్తుతం ఆ సంఖ్య 98కి దిగజారింది. ఉద్యోగుల ఇపిఎఫ్‌ను సంస్థ యాజమాన్యం చెల్లించక పోవడంతో రిటైర్మెంట్, వివిధ కారాణాల చేత చనిపోయిన దాదాపు 20 మందికి పైగా ఉద్యోగులు ఎలాంటి బెనిఫిట్స్ అందుకోలేక పోయారు. అటు ఇపిఎఫ్ డిపార్ట్‌మెంట్ నుండి రావాల్సి బెనిఫిట్స్ కానీ, ఇటు సంస్థ నుండి రావాల్సిన బెనిఫిట్స్ కానీ లభించడం లేదని, దీని వల్ల ఉద్యోగులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కోవలసి వస్తుందని కార్పొరేషన్ ఉద్యోగులు వాపోతున్నారు. ఈ విషయమై ఇప్పటికే పలు దఫాలుగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళినట్లు తెలంగాణ వికలాంగుల కోఆపరేటివ్ కార్పొరేషన్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎస్‌ఎన్ చారి, ఎస్. రాములు, ముఖ్య సలహాదారు జి.వెంకటరాములు తెలిపారు. ఇతర కార్పొరేషన్ ఉద్యోగులకు అన్ని విధాల బెనిఫిట్స్ లభిస్తుంటే వికలాంగుల కార్పొరేషన్ ఉద్యోగుల విషయంలోనే ఇలాంటి పరిస్థితి తలెత్తడం పట్ల వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గత తెలుగు దేశం ప్రభుత్వ హయాంలోనే వికలాంగుల కార్పొరేషన్‌ను మూసివేసేందుకు ప్రయత్నాలు జరిగాయని అప్పటి నుండి ప్రభుత్వాలు మారినా కార్పొరేషన్ పట్ల అధికారుల తీరు నిర్లక్షపూరితంగా ఉంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. గత 30 నెలల ఇపిఎఫ్ బకాయిలను వెంటనే ఉద్యోగుల ఇపిఎఫ్ ఖాతాల్లో జమ చేయాలని వారు యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని న్యాయం చేయాలని కోరారు. బకాయిలు చెల్లించని కారణంగా ఉద్యోగులు ఇపిఎఫ్ రుణాలు కూడా పొందలేక పోతున్నారన్నారు. ఇపిఎఫ్ బకాయిలు వసూలు చేయాల్సిన ఆ విభాగం అధికారులు కూడా పట్టించుకోక పోవడం వల్ల ఉద్యోగుల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు.