నిలిచిన వైద్య సేవలు.. ఇబ్బందులు పడ్డ రోగులు
మంత్రితో నెట్‌వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాల చర్చలు విఫలం
ప్రజాపక్షం/సిటీబ్యూరో: ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచాయి. దీంతో పేద రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ, ఉద్యోగులు, జర్నలిస్టులు, పెన్షనర్ (ఇజెహెచ్‌ఎస్)ల ఆరోగ్య పథకాల సేవలు నిలిపివేశారు. గురువారం అర్థరాత్రి నుంచి నెట్‌వర్క్ ఆసుపత్రుల యాజమన్యాలు సమ్మె బాట పట్టాయి. ప్రభుత్వం పూర్తి బకాయిలు చెల్లించేంత వరకు సమ్మెను విరమించడం లేదంటూ తేల్చి చెబుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 242 ప్రైవేట్ నెట్‌వర్క్ ఆసుపత్రులకు ఉన్న బకాయిలు దాదాపు రూ.1500 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించడం లేదంటూ నెట్‌వర్క్ ఆసుపత్రుల యాజమన్యాలు ఈ నెల 10న ధర్నాచౌక్‌లో నిరసన వ్యక్తం చేసి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించిన విషయం తెలిసిందే. శుక్రవారం ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో నెట్‌వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలతో జరిగిన చర్చలు విఫలమయ్యాయి.
ఇబ్బందులు పడ్డ రోగులు
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు మూతపడ్డాయి. దీంతో ఆరోగ్యశ్రీ కార్డుదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా డయాలసిస్ రోగులు పడరానిపాట్లు పడుతున్నారు. ఒక్కసారి డయాలసిస్ చేయించుకునేందుకు రూ.2వేలకు పైగా ఖర్చు అవుతుండటంతో వీటి సేవలు కూడా అందకపోవడంతో కిడ్నీ బాధితులు రోడ్డున పడుతున్నారు. ఆసుపత్రుల యాజమాన్యాలు సమ్మె నిర్వహిస్తున్నామని ముందస్తుగానే తెలిపినప్పటికీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై రోగులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రోగులకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
మంత్రితో చర్చలు విఫలం
గురువారం అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయడంతో శుక్రవారం మంత్రి ఈటల రాజేందర్ నెట్‌వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలతో చర్చలకు ఆహ్వానించారు. సాయంత్రం దాదాపు రెండు గంటల పాటు చర్చలు జరిగినప్పటికీ కొలిక్కి రాలేదు. త్వరలో బకాయిలు విడదులయ్యేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చినప్పటికీ, బకాయిలు చెల్లిస్తే తప్ప సేవలు ప్రారంభించమని మంత్రికి తేల్చి చెప్పినట్లు తెలంగాణ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రాకేష్ తెలిపారు. రూ.1500కోట్ల బకాయిలు ఉంటే అందులో కేవలం రూ.300కోట్లు విడుదల చేస్తామంటే ఎలా అన్నారు. గతంలో కూడా సమ్మెలు నిర్వహించిన సమయంలో ఇదే విధంగా ఎంతో కొంత చెల్లించి సేవలు ప్రారంభించాలని నేటికి కూడా చెల్లించలేదన్నారు. సమ్మె కొనసాగుతుందని ప్రకటించారు.