ఆలోచించి ఓటువేయండి
గతం కంటే వచ్చే ఎన్నికల్లో ఐదారు సీట్లు ఎక్కువే గెలుస్తాం
సూర్యాపేట ప్రగతి నివేదన సభలో సిఎం కెసిఆర్
ధరణి తీసేస్తే రైతుబంధు, రైతుబీమా ఎలా అందుతదని ప్రతిపక్షాలను ప్రశ్నించిన బిఆర్‌ఎస్ చీఫ్
పెన్షన్ల పెంపుపై త్వరలో ప్రకటన చేస్తానని వ్యాఖ్య
ప్రజాపక్షం/ సూర్యాపేట ప్రతినిధి అధికారం తిరిగి మాదేనని సిఎం కేసిఆర్ అన్నారు. గతం కంటే వచ్చే ఎన్నికల్లో ఐదు, ఆరు సీట్లు ఎక్కువనే గెలుస్తామన్నారు. ఎన్నికలు వస్తున్నాయి ప్రజలు ఆగమాగం కావొద్దని ఆలోచించి ఓట్లు వేయాలని పిలుపునిచ్చారు. ఆదివారం సూర్యాపేట కేంద్రంలో నిర్వహించిన సూర్యాపేట నియోజకవర్గం ప్రగతి నివేదన బహిరంగ సభలో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. నల్లగొండ ఉమ్మడి జిల్లాలోని 12 స్ధానాలకు కూడా తమ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. తమకు ఒక్కసారి అవకాశం ఇవ్వమని అడుతున్న బిజెపి, కాంగ్రెస్‌లకు ప్రజలు ఎన్నో అవకాశాలు ఇచ్చారన్నారు. కాంగ్రెస్‌కు 50 ఏళ్లు ప్రజలు అవకాశం ఇస్తే ఏమి చేసిందని ప్రశ్నించారు. అధికారంలోకి రావాలని ఆశ పడుతున్న బిజెపి వస్తే మోటర్లకు మీటర్లు బిగిస్తారని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సాగుకు 3గంటలే విద్యుత్‌ను ఇస్తాదని అన్నారు. ఈ మాటలు తాను చెప్పడం లేదని వారే చెప్పిన విషయాన్ని ప్రజలకు గుర్తు చేస్తున్నానని అన్నారు. కుల, మతాలకు అతీతంగా అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న ప్రభుత్వం తమదేనని అన్నారు. రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. నేడు పల్లెలు కలకలలాడుతున్నాయని దేశంలోనే తెలంగాణ రైతులకు ఎంతో గౌరవం దక్కిందన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడు కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి అవుతుందని ఉమ్మడి ఖమ్మంలోని సీతారామ ప్రాజెక్ట్, పాలమూరు ఎత్తిపోతుల పథకం ప్రారంభం అయితే 4 కోట్లు టన్ను ధాన్యం దిగుబడి అవుదాని అన్నారు. ఇప్పటికే రైతులు పండిచిన ధాన్యంలో కోటి టన్నుల ధాన్యాన్ని ఇతర రాష్ట్రాలకు అమ్ముతున్నామని చెప్పారు. సర్కార్ నడపడం సంసారం నడిపినంత పని అని చెప్పిన ఆయన రైతుల సంక్షేమమే లక్ష్యంగా పని చేయడం జరుగుతుందన్నారు. కరోనా మహామ్మారితో రైతులకు చేస్తా మన్న పంట రుణాలు కాస్త ఆలస్యమైందని అన్నారు. అయినా రైతులకు ఇచ్చిన మాటను ప్రభుత్వం నిలిపుకుందన్నారు. ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణితో భూ సమస్యలు తొలిగిపోయి ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. గతంలో విఆర్‌ఓ వ్యవస్ధ ఉండటంతో ఒక్కరిది ఒకరి పేరుపై పట్టాలు చేసి రైతులను ఇబ్బందులు పెట్టేవారని నేడు ఆ ఇబ్బంది పూర్తిగా తొలిగిపోయ్యిందన్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గతంలో 15 రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉండగా నేడు 80 ఉన్నాయన్నారు. 15 నిమిషాల లోపే రిజిస్ట్రేషన్ పూర్తి అవుతుందన్నారు. గతంలో రోజుల తరబడి అధికారులు చుట్టు తిరిగే వారని అన్నారు. ధరణి అంటే ఓ నమ్మకమని సిఎం కూడా దానిపై పవర్ లేదని రైతు బోటన వేలికే అధికారం ఉందని చెప్పారు. దీని వల్లే నేడు రైతులకు రైతుబంధు డబ్బులు ఏ ఇబ్బందులు లేకుండా అందుతున్నాయని చెప్పారు.కాంగ్రెస్ తిరిగి అధికారంలోకి వస్తే మునపటి కథే అవుతుందన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆపద్బాందవు పథకం గురించి అందరికి తెలిసిందేనన్నారు. నేడు రైతుల బ్యాంక్ ఖాతాలో టింగ్, టింగ్ అంటూ రైతుబంధు డబ్బు బ్యాంక్‌లో జమ అయినట్లు సెల్‌ఫోన్లకు మెసేజ్‌లు వస్తున్నాయని చెప్పారు. ఇటీవల కాంగ్రెస్‌లో ఓ కాంగ్రెస్ నేత ఉమ్మడి జిల్లాలో పాదయాత్ర చేపట్టి ఈ ప్రాంతానికి కాళేశ్వరం జలాలు రావడం లేదని చెప్పడం దిక్కుమలిన మాటలని అన్నారు. కాళేశ్వరం ద్వారా కాకుంటే ఎక్కడి నుండి వస్తున్నాయని ప్రశ్నించారు. సూర్యాపేట నియోజకవర్గంలోని రావి చెరువు వరకు నీళ్లు పరుతున్న విషయం కళ్లకు కనబడటం లేదా అన్నారు. కాంగ్రెస్ వారు చెప్పే దిక్కుమాలిన కట్టుకథలు, పిట్ట కథలలో ఏమాత్రం నిజం లేదన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలైన రైతుబంధు, రైతుభీమా, ఆడపడుచులకు కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్, రైతు రుణామాఫీ,దళితబంధు కళ్లకు కనబడటం లేదా అన్నారు. అర్హులైన పేదలకు గృహలక్ష్మీ పథకం ద్వారా ఇండ్ల మంజూరు, బిసి బంధు అందరికి అందుతుందని ఎవ్వరు కూడా ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. గత ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలు పెద్ద ఎత్తున వలసలు పోయ్యేవారని నేడు పోయిన వారంతా తిరిగి వస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, హోం, వ్యవసాయ, రోడ్డు భవనాల శాఖ మంత్రులు మహామూద్ అలీ, నిరంజన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా శాసనసభ్యులు గాదరి కిషోర్‌కుమార్, కంచర్లు భూపాల్‌రెడ్డి, రవీందర్‌నాయక్, గొంగిడి సునీత, ఫైళ్ళ శేఖర్‌రెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్, శానంపూడి సైదిరెడ్డి, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్యయాదవ్, ఎంఎల్‌సిలు కోటిరెడ్డి, తకెళ్ళపల్లి రవీందర్‌రావు, జడ్‌పి చైర్మన్లు ఎలిమినేటి సందీప్‌రెడ్డి, బండ నరేందర్‌రెడ్డి, గుజ్జ దీపికయుగంధర్‌రావుతో పాటు పలువురు పాల్గొన్నారు.
ఆగమాగం కావొద్దు
RELATED ARTICLES