జిల్లాల్లోనూ హైడ్రా తరహా వ్యవస్థ
ఏర్పాటుకు కలెక్టర్లకే పూర్తి అధికారం
ఆక్రమణదారులను ఉపేక్షించేది లేదు
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటన
ప్రజాపక్షం/వరంగల్ ప్రతినిధి
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోని చెరువుల ఆక్రమణలపై చాలా ఆరోపణలు వస్తున్నాయని, వాటన్నింటిపై చర్యలకు తీసుకునేందుకు ఆయా జిల్లాలలో హైడ్రా తరహా వ్యవస్థ తీసుకురానున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. మహబూబాబాద్‌లో వరద నష్టంపై మంగళవారం జరిగిన సమీక్షలో సిఎం మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లాలో వరద ఉదృతికి ఆక్రమణలే కారణమని, ఈ క్రమంలో ఆక్రమణల నివారణకు కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్‌కు ప్రత్యేకంగా పూర్తి అధికారం ఇస్తున్నట్లు సిఎం రేవంత్ తెలిపారు. ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపాలిటీ శాఖలతో ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ టీంలను తయారీ చేసి ఆక్రమణ దారులపై చర్యలకు సిద్ధం కావాలన్నారు. హైదరాబాద్‌లో హైడ్రాలాగానే రాష్ట్రమంతటా కావాలని ప్రజల నుండి డిమాండ్స్ వస్తున్నాయన్నారు. ఆక్రమణదారులతో ప్రకృతి వైపరిత్యాలు సంబవిస్తున్నాయని, ప్రకృతిపై దాడి చేస్తే మానుకోటలో వచ్చిన వర్ష భీభత్సంలాగానే వికృతాలు ఉంటాయని గుర్తు చేశారు. అన్ని ప్రాంతాలలో ఎఫ్‌టీఎల్, భఫర్‌జోన్‌లను గుర్తించాలన్నారు. ప్రతి జిల్లాలో హైదరాబాద్ హైడ్రాగానే కమిటీలను ఏర్పాటు చేస్తామని వివరించారు. చెరువుల ఆక్రమణలో ఎంతటి వారైన వదిలేదని స్పష్టం చేశారు. ఆక్రమణలపై ప్రభుత్వం వెనక్కిదిలేదని ఖరాఖండీగా చెప్పారు. నాలాలు, కాలువలు, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాల్వలు ఆక్రమించి నిర్మాణాలు చేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు నివేధిక తయారు చేయాలని సూచించారు. నివేధిక వచ్చిన తర్వాత సంబంధిత వ్యక్తులపై కొరఢా ఝులిపించాల్సిందేనని అధికారులకు వివరించారు. చెరువుల ఆక్రమణలకు సంబంధించి కోర్టుల్లో కేసులుంటే ప్రభుత్వమే ప్రత్యేక న్యాయవాదులను పెట్టి కేసుల పరిష్కారం కోసం కృషి చేస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటికి ఈ బాధ్యతలు అప్పగిస్తునట్లు తెలిపారు. చెరువుల ఆక్రమణదారులతో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు పేదోళ్ల ప్రాణాల మీదకు తెస్తున్నాయని ఆందోళన చెందారు. చెరువులను అక్రమంగా ఆక్రమించి నిర్మాణాలు చేస్తే వాటిని వెంటనే తొలగించాల్సిందేననని అధికారులను ఆదేశించారు.