HomeNewsTelanganaఆక్రమణకు గురైన భూములు వెనక్కి తీసుకోండి

ఆక్రమణకు గురైన భూములు వెనక్కి తీసుకోండి

గ్యారంటీలు ఐదారేళ్లు అమలు చేసేందుకు నిధులు సమకూరుతాయ్‌
భూ ఆక్రమణలపై కమిటీ వేయాలి
సిపిఐ శాసనసభా పక్ష నాయకులు కూనంనేని సాంబశివరావు
ప్రజాపక్షం/ హైదరాబాద్‌
హైదరాబాద్‌, చుట్ట పక్కల ప్రాంతాలలో ఆక్రమణకు గురైన వందల ఎకరాల భూములను వెనక్కి తీసుకుంటే, ఆరు గ్యారంటీలు ఐదారేళ్ళు అమలు చేసేందుకు అవసరమైన నిధులు సమకూరుతాయని సిపిఐ శాసనసభా పక్ష నాయకులు కూనంనేని సాంబశివరావు అన్నారు. అధికారులు, రాజకీయ నాయకులు, రియల్‌ ఎస్టేట్‌ మాఫియా చేతుల కలిపి వందల ఎకరాలు ఆక్రమణ చేశారని, వీటిపై కమిటీ వేయాలని ముఖ్యమంత్రిని డిమాండ్‌ చేశారు. పలువురు అధికారుల వద్ద అవినీతి డబ్బులు, భూములపై వార్తలు వస్తున్నాయని, వారందరి నుండి డబ్బు కక్కిస్తే ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నిజమైన హీరో అవుతారని అన్నారు. శాసనసభలో గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం మీద శుక్రవారం జరిగిన చర్చలో ఆయ న పాల్గొన్నారు. అనకొండను మించిన అవినీతిని చూస్తున్నామని, పలువురు ఉన్నతాధికారుల అవినీతిపై పత్రికల్లో రోజు వార్తలు వస్తున్నాయని అన్నారు. హైదరాబాద్‌, పరిసర ప్రాంతాలలో పని చేసిన ఐఎఎస్‌ అధికారులు వేల కోట్ల విలువ చేసే భూములను మింగేశారని, ఎవరి దగ్గర ఎంత భూమి ఉందే తేల్చేందుకు ఒక కమిటీ వేయాలని కోరారు. అనేక భూములకు సంబంధించి తమ వద్ద కూడా ఆధారాలు ఉన్నాయని చెప్పారు. కొంత మంది వంద ఎకరాలు మింగేస్తే ఏమి అనలేదని, పేదలు 60 గజాలలో గుడిసెలు వేసుకుంటే భూ కబ్జాదారడు అంటున్నారని, వారికి అండగా వెళ్ళిన తనపై కూడా అబ్దుల్లాపూర్‌ మెట్‌, చేవెళ్ళలో కేసులు పెట్టారని అన్నా. ధరణిలో, సాగునీటి ప్రాజెక్టులో, జెన్‌కోలో, సింగరేణిలో , మిషన్‌ భగీరథలో ఎక్కడ చూసినా అవినీతే కనిపిస్తుందన్నారు. ఒకప్పుడు మచ్చలేని సింగరేణి ఇప్పడు అవినీతి సింగరేణిగా మారిందని, మొన్నటివరకు తొమ్మిదేళ్ళు నిర్విగ్నంగా అధికారంలో ఉండి మహారాజులో అధికారి వెళ్ళిపోయారని, వారిపై ఏ చర్యలు తీసుకోకపోతే, వచ్చే అధికారులకు ఏమి సంకేతాలు వెళ్ళాయని ప్రశ్నించారు. అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని కూనంనేని డిమాండ్‌ చేశారు.
ఆకాంక్షలు ఉన్నాయి.. డబ్బులు లేవు..
కొత్త ప్రభుత్వ హామీలు ఇచ్చిందని, కాని అమలుకు నిధులు లేకపోవడం ఆందోళన కలిగిస్తుందని కూనంనేసి సాంబశివరావు అన్నారు. పదేళ్ళ కింద రూ.60వేల కోట్ల అప్పుడు , రూ.6లక్షల కోట్లకు చేరిందని, వాటిపై వడ్డీలు, బకాయిలు, దానికి తోడు కొత్త హామీలు ఉన్నాయని అన్నారు. ఒకవైపు డబ్బులు లేవని, మరో వైపు జనం ఆకాంక్షలు చాలా ఉన్నాయని, మిత్రపక్షంగా తనకే భయం వేస్తుందన్నారు.ఒకరు ఉద్యోగం వస్తుందని, ఒకరు ఇళ్లు వస్తుందని, ఇంకకొరు ఔట్‌ సోర్సింగ్‌ పర్మినెంట్‌ అవుతుందనే ఆశలతో ఉన్నారని అన్నారు. కాబట్టి ఆరు గ్యారెంటీలతో పాటు, ఇతర హామీల అమలుకు నిధుల సమీకరణకు ప్రణాళికను రూపొందించుకోవాలన్నారు. అయినప్పటికీ పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమి లేదని, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కచ్చితంగా సాధిస్తారని విశ్వాసం వ్యక్తంచేశారు. స్కాలర్‌ షిప్పుల బకాయిలు రూ. 6వేల కోట్లు, సర్పంచ్‌ల బకాయిలు రూ.8వేల కోట్లు, కాంట్రాక్టర్‌లకు చెల్లించాల్సిన బిల్లులు రూ.8వేల కోట్లు ఉన్నాయన్నారు. గవర్నర్‌ ప్రసంగంలో ఐటిఐలను రూ.2వేల కోట్లతో ఆధునీకరిస్తామనడం ముదావహం అన్నారు. ఇటీవల రూ.40వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయని ప్రభుత్వం చెబుతోందని, కేవలం హైదరాబాద్‌లోనే కేంద్రీకరణ కాకుండా జిల్లాలో కూడా వచ్చేలా చూడాలని కోరారు. నియోకవర్గ స్థాయిలో చిన్న తరహా పరిశ్రమలు, స్థానికంగా లభించే కనిజం ఆధారిత పరిశ్రమలు ఏర్పాటునుపరిశీలించాలన్నారు.
ప్రతిపక్షం కొత్త చిచ్చు పెట్టొద్దు
ఆరు గ్యారంటీలలో నాలుగు అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, వాటితో కుటుంబాల చేతిలో డబ్బులు కనపడుతున్నాయని కూనంనేని అన్నారు. దేశంలోనే ద్రవ్యోల్బణంలో నెంబర్‌ వన్‌ స్థానంలో ఉన్న తెలంగాణలో ఇది ఊరటనిచ్చే చర్య అని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు కారణంగా ఆటోలకు ఇబ్బంది అంటూ కొత్త పేచీ పెడుతోందని, ఆటో డ్రైవర్లపై కొత్త కొత్త ప్రేమలు పుట్టుకొస్త్తున్నాయని, పరస్పరం పోటీ పెట్టి ఘర్షణలు పెట్టడం న్యాయం కాదని బిఆర్‌ఎస్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఉచిత బస్సుతో గ్రామాలలో ఆటోలకు పెద్ద ఇబ్బంది ఉండబోదని, హైదరాబాద్‌లో ఒకవేళ ఉంటే చర్చించాలని, మెట్రో రైలుకు, కాలనీలకు ఎలక్ట్రానిక్‌ ఆటోల ద్వారా అనుసంధానించి ఆటో డ్రైవర్‌లకు ఊరటనిచ్చే పథకాలు తీసుకురావాలని సూచించారు. అలాగే వారికి ప్రభుత్వం ప్రకటించిన రూ.12వేలును మరింత మెరుగు పరచాలన్నారు.
ఆ రంగాలపై దృష్టి సారించండి
విద్య, వైద్య, వ్యవసాయ రంగాలపై దృష్టి సారించాలని కూనంనేని సూచించారు. విద్యారంగం కేటాయింపులు 11 శాతం నుండి 6 శాతానికి తగ్గాయని, అలాగే పలు చోట్ల పాఠశాలలో మౌలిక సదుపాయాలు, విద్యార్థి ఉపాధ్యాయుల సరిపడ నిష్పత్తి లేదన్నారు. వైద్య రంగంలో ప్రతి పిహెచ్‌సి, ఏరియా ఆసుపత్రిలో పూర్తి సౌకర్యాలు ఉండాలని సూచించారు. ప్రభుత్వం రూ.10 లక్షల వరకు వైద్యానికి ఎల్‌ఒసి ఇస్తామన ప్రకటించిందని, గతంలో కంటే ఎక్కువే ఇస్తున్నారని, అయితే రూ.5లక్షల ఖర్చుకు రూ.2.5లక్షల వరకే ఎల్‌ఒసి ఇస్తుండడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. వ్యవసాయ రంగాన్ని పరిశ్రమగా వ్యవహరించాలని, సరైన బీమా పథకం లేదన్నారు. వీటన్నిటి సరి చేయాలని , పంటకు గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. కాళేశ్వరం వంటి పెద్ద ప్రాజెక్టులపైనే ఫోకస్‌ చేశారని, అదిప్పుడు కూలిపోయే పరిస్థితి ఉందంటున్నారని చెప్పారు. అలా కాకుండా చిన్న నీటి పారుదలపై దృష్టి సారించాలని, స్థానికంగా ఉండే నీటి వనరులు ఉపయోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. కాళేశ్వరంతో రాష్ట్రమంతా నీళ్ళు వచ్చాయంటున్నారని, మరి గతంలో 16 లక్షల బోర్లు ఉంటే ఇప్పుడు 30 లక్షల బోర్లు పెరిగాయన్నారు. ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగులను క్రమంగా రెగ్యులరైజ్‌ చేయాలని, మినిమమ్‌ వేజెస్‌ను రూ.11వేలకు తగ్గిస్తూ జిఒ వచ్చిందని దానిపై దృష్టి సారించాలన్నారు. మధ్యాహ్న భోజనం, ఆశ వర్కర్స్‌, అంగన్‌వాడీ వర్కర్స్‌, ఎన్‌హెచ్‌ఎంల సమస్యలు పరిష్కరించాలన్నారు. కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు సంబంధించి జిఒ 46పై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. అంబేడ్కర్‌ ఓవర్సీస్‌ విద్యానిధి పథకం కింద వంద మంది లండన్‌లో ఉన్నారని, వారికి నిధుల విడుదల పై చర్యలు తీసుకోవాలని కోరారు. టూరిజం శాఖలో 26 ఏళ్ళు పని చేస్తున్నవారిని పర్మినెంట్‌ చేయాలని, హామీలకు సంక్షేమ బోర్డు వేయాలని కోరారు. జర్నలిస్టులకు సరైన విధానం తీసుకురావాలన్నారు. ఆర్‌టిసి కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసే చట్టం వచ్చినా, ఆప్రక్రియ పూర్తి కాలేదని, దానిని పూర్తిచేయాలన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments