రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు
భద్రాచలం వద్ద గోదావరి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
మూసీప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తివేత
హైదరాబాద్‌లో భారీగా ట్రాఫిక్ జామ్
ప్రజాపక్షం న్యూస్‌నెట్‌వర్క్ రాష్ట్రవ్యాప్తంగా ఆకాశానికి చిల్లు పడిందన్నట్లు.. ఎడతెరుపు లేకుండా వానలు కురుస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడే విధంగా ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలను పలు జిల్లాల్లో మోహరించారు. విద్యుత్ శాఖ ఇంజినీర్లకు సెలవులను కూడా రద్దు చేసింది. స్కూళ్లకు రాష్ట్ర ప్రభుత్వం గురు, శుక్రవారాల్లో సెలవులు ప్రకటించింది. భద్రాచలం వద్ద గోదావరి అంతకంతకూ పెరుగుతుండడంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. హైదరాబాద్‌లో ఆగకుండా పడుతున్న వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జాం అయింది. ఈ పరిస్థితులపై మంత్రి హరీశ్‌రావు, సిఎస్ శాంతికుమారి, విద్యుత్ శాఖ సిఎండి వేర్వేరుగా సమీక్షలు నిర్వహించారు. వర్షాల నేపథ్యంలో ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు అవసరం అయితే హెలికాప్టర్ వాడుతామని మంత్రి హరీష్ రావు ప్రకటించారు. హైదరాబాద్ నగరంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ట్రాఫిక్ అంతరాయం కలుగుతోంది. ఉదయం పనుల కోసం ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. రోడ్లపై నీరు నిలవడంతో.. వాహన దారులు, బాటసారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాలతో హైదరాబాద్‌లోని లింగంపల్లి రైల్వే అండర్‌పాస్ మొత్తం
నీట మునిగింది.
భద్రాచలం వద్ద 43 అడుగులు దాటి ప్రవహిస్తున్న గోదావరి
భద్రాచలం వద్ద గోదావరి ప్రమాదస్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో ఏజెన్సీ ప్రజానికం వరద తాకిడితో భయాందోళన చెందుతున్నారు. భద్రాచలం వద్ద గురువారం మధ్యాహ్నం 3 గంటలకు గోదావరి 43 అడుగులకు చేరుకోవడంతో అధికారులు మొదటి ప్రమాదహెచ్చరికను జారీ చేశారు. దీంతో జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా అధికారులను మరింత అప్రమత్తం చేశారు. తాలిపేరు, ఇంద్రావతి, ప్రాణహిత నదుల నుండి ఇన్‌ఫ్లో అధికంగా ఉండటంతో గోదావరికి వరద తాకిడి పెరిగింది. గోదావరి నుండి 9 లక్షల 32 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఉదయం 7 గం.లకు 39 అడుగుల వరకు చేరుకున్న గోదావరి 9 గం. వరకు 40 అడుగల వద్ద ప్రవహించింది. మధ్యాహ్నం 2 గం.లకు 42.8 అడుగులకు చేరుకుని 3 గం.లకు 43 అడుగులు దాటింది. శ్రీరాం సాగర్, కడెం, శ్రీపాద ఎల్లంపల్లి, కాళేశ్వరం, భద్రాచలం వద్ద వరద తాకిడి పెరుగుతోంది. ఇదిలా ఉండగా పేరూరు, ఏటూరినాగారం వద్ద నెమ్మదిగా గోదావరి తగ్గుముఖం పడుతోంది. రాగల 5 రోజుల పాటు వర్షాలు ఉండటంతో రెండో ప్రమాదహెచ్చరిక 48 అడుగులు, మూడో ప్రమాద హెచ్చరిక 53 అడుగుల వరకు చేరే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. ఏజెన్సీ వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. చర్ల మండలంలో కోరెగడ్డ భూములు నీటిలో మునిగిపోయాయి. దుమ్ముగూడెం మండలం పరిధిలోని సున్నంబట్టి, పర్ణశాల గ్రామాల్లోకి వరద నీరు చేరింది. భద్రాచలం పట్టణంలోని రాజుపేట ప్రథాన రహదారిపైకి నీళ్లు చేరాయి. కొత్తకాలనీ, అయ్యప్పకాలనీ, సుబాష్ నగర్, శాంతినగర్ కాలనీల సమీపంలోకి వరదనీరు చేరింది. విస్తా కాంప్లెక్స్ జలమయం అయ్యింది. రామాలయం అన్నదాన సత్రంలోనికి వరదనీరు చేరింది.
సింగరేణికి కోట్లల్లో నష్టం :
క్షణం ఆగకుండా కురుస్తున్న వర్షాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. పలు గనుల్లో ఓపెన్ కాస్ట్‌ల్లోకి వరదనీరు చేరడంతో.. బొగ్గు వెలికితీయడం కష్టసాధ్యమయ్యింది. రోడ్లు అన్ని బురదమయం కావడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇప్పటి వరకు సుమారు 12వేల టన్నుల బొగ్గు వెలికితీతకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. సింగరేణి అధికారులు మోటార్ల సహాయంతో నీటిని ఎప్పటికప్పుడు బయటకు తోడుతున్నారు. నిరంతరాయంగా వర్షం కురుస్తుండడంతో.. సింగరేణికి భారీ నష్టం జరిగిందని సింగరేణి అధికారులు తెలిపారు.
వరంగల్‌లో ఇళ్లకే పరిమితమైన ప్రజలు
మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కరుస్తున్న ముసురు కారణంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. మూడు రోజులుగా నిర్విరామంగా ముసురు పడటంతో వరంగల్ నగరంలోని కాలువలు, మొరీలు, లోతట్టు ప్రాంతాలు నీటిమయమయ్యాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా కలెక్టర్‌లు నిరంతరం వీడియో కాన్ఫరెన్స్, టెలికాన్ఫరెన్స్ ద్వారా సూచనలు ఇస్తూ అలర్ట్‌గా ఉండాలని అధికారులకు సూచించారు.
కాళేశ్వరం వద్ద పెరిగిన గోదావరి
జయశంకర్‌జిల్లా మహాదేవపూర్ మండలంలోని కాళేశ్వరం వద్ద గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాఫలకు గోదావరి నీటిమట్టం పెరిగింది. 1019 మీటర్లకు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో పాటు మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు ప్రాణహిత నది ఉప్పొంగి ప్రవహిస్తుండడం వల్ల గోదావరి వరద ప్రవాహం పెరిగి మేడిగడ్డ బ్యారేజీలోకి 5,65,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండడంతో 65 గేట్లను ఎత్తారు. అదే స్థాయిలో కూసెక్కుల నీటిని అధికారులు దిగువకు వదులుతున్నారు. బ్యారేజీ పూర్తి స్థాయి నీటి మట్టం 100 మీటర్లకు గాను 95.00 మీటర్ల వద్ద ఉంది. అన్నారం సరస్వతీ బ్యారేజిలోకి ఎగువ ప్రాంతాల నుండి భారీగా వరద ఉధృతి పెరగడంతో గురువారం ఉదయం బ్యారేజీ 15 గేట్లు ఎత్తి 18,900 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు గోదావరిలో విడుదల చేసిన అధికారులు మధ్యాహ్నం నుండి బ్యారేజిలోకి వరద ఉధృతి తగ్గుముఖం పట్టడంతో బ్యారేజిలో ఎత్తిన గేట్లు మూసి 2 గేట్ల ద్వారా 1023 క్యూసెక్కుల వరద నీటి తరలింపు కొనసాగుతోంది.అదే విధంగా మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజిలోకి ఎగువ నుండి 5,37,140 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండటంతో బ్యారేజీ 65 గేట్ల ద్వారా చేరిన వరద నీటికి సమానస్థాయిలో దిగువకు తరలింపు కొనసాగుతోంది.
సిద్దిపేటలో భారీ వరద :
ఎగువ నుంచి వస్తున్న వరదతో సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ మోయతుమ్మెద వాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. సిద్దిపేట ప్రధాన రహదారి పైనున్న వంతెన మీద నుంచి నీరు వెళుతుండటంతో.. పోలీసులు రహదారికి అడ్డుగా బారికేడ్లు పెట్టి.. రాకపోకలు నిలిపివేశారు. దాంతో బస్వాపూర్, పోరెడ్డిపల్లి, నాగసముద్రాల మీదుగా హనుమకొండకు.. వాహనాలను దారి మళ్లించారు. పెద్దపల్లి జిల్లా సిరిపురం వద్ద నిర్మించిన పార్వతిబ్యారేజ్ నిండుకుండలామారింది. భారీ వర్షాలు కురుస్తుండడం, 15 రోజులుగా సరస్వతి పంపుహౌస్ నుంచి.. నీటిని ఎత్తిపోస్తుండటంతో జలకళ సంతరించుకుంది. పార్వతీబ్యారేజ్ పూర్తిస్థాయిలో నిండుకుండలా మారడంతో. సరస్వతి పంపుహౌస్‌లో మోటార్లు నిలిపివేశారు. భారీ వర్షాలకు వర్ధన్నపేట మీదుగా ఉన్న ఆకేరు వాగులోకి వరద నీరు చేరి అలుగు పోస్తుంది. ఇల్లంద గ్రామంలోని సుభాష్ నగర్, శివనగర్‌లో వరద నీరు పోటెత్తింది. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మెదక్ జిల్లాలోని వనదుర్గ ప్రాజెక్టు పొంగిపొర్లుతుంది. ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు నిండటం వల్ల రెండు పంటలు పండుతాయని ఆ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మూసీ గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల
మూసీ ప్రాజెక్ట్‌కు గత రెండు రోజులుగా వరద నీరు పొటేత్తుంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో 3వేల క్యూసెక్కుల నీరు వస్తుంది. ప్రాజెక్ట్ పూర్తి స్ధాయి నీటి మట్టం 645 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 642కు చేరింది. రాగల రెండు రోజుల్లో భారీ వర్షాలు కురస్తాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో మూసీ అధికారులు ప్రాజెక్ట్‌లోని 3,4 గేట్టును పైకేత్తి దిగువకు 1800 క్యూసెక్కుల నీటిని కిందికి వదిలారు. నిజాంసాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల వలన ప్రాజెక్టులోకి 22,800ల క్యూసెక్కుల వరదనీరు ఇన్‌ఫ్లో వచ్చి చేరుతుందని నీటిపారుదల శాఖ ఏఈ శివ తెలిపారు. నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405.00 అడుగులు, 17.802 టీఎంసీలు కాగా ప్రస్థుతం ప్రాజెక్టులో 1390.62 అడుగులు 4.302 టీఎంసీల నీరు నిల్వ ఉందని ఏఈ వెళ్ళడించారు.
ఆకాశానికి చిల్లుపడినట్లు..
RELATED ARTICLES