HomeNewsLatest Newsఆకాశానికి చిల్లు..

ఆకాశానికి చిల్లు..

రాష్ట్రవ్యాప్తంగా కుండపోత

ఉధృతంగా ప్రవహిస్తున్న నదులు, వాగులు
జనజీవనం అస్తవ్యస్తం
ఖమ్మంను ముంచెత్తిన మున్నేరు
వర్షాలకు 9 మంది మృతి

ప్రజాపక్షం న్యూస్‌నెట్‌వర్క్‌
ఆకాశానికి చిల్లుపడింది. గత రెండు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో ఎక్కడికక్కడ వాగులు, వంకలు పొంగి పొర్లడంతో జనజీవనం అస్తవ్యస్తం అయింది. భారీ వర్షాలు, వరదల కారణంగా ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాష్ట్రంలో 9 మంది మృతి చెందారు. వరంగల్‌లో ఐదుగురు మృతి చెందగా, సూర్యాపేట జిల్లాలో ఇద్దరు, ఖమ్మం జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. భారీ వర్షాలకు మున్నేరు వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో ఖమ్మంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పలు ఆపార్ట్‌మెంట్లలోని సెల్లార్లు వరద నీటితో నిండాయి. రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. భారీగా ట్రాఫిక్‌ స్తంభించడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఎపి, తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాల నేపథ్యంలో సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
ఖమ్మంను ముంచెత్తిన మున్నేరు
ఉమ్మడి ఖమ్మంజిల్లా మునుపెన్నడు లేని రీతిలో జల దిగ్బంధంలో చిక్కుకుని విలవిలలాడుతుంది. జిల్లాలోని నదులు, ఉప నదులు,వాగులు, వంకలు పోటెత్తి ప్రవాహిస్తున్నాయి. పలు చోట్ల రహదారుల పైనుంచి ప్రవహించడంతో ఎక్కడికక్కడే రాకపోకలు నిలిచిపోయాయి. మధ్యతరహా ప్రాజెక్టులతో పాటు చెరువులు, కుంటలు అలుగులు పోస్తుండడంతో పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా పల్లపు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. కూసుమంచి మండలంలోని నాయకన్‌ గూడెంలో పాలేరు వాగులో దంపతులు వరదనీటిలో కొట్టుకుపోయి చనిపోయారు. నాలుగు లక్షల జనాభా కలిగిన ఖమ్మం నగరం వర్షానికి విలవిలలాడింది. గడిచిన 25 ఏళ్ల కాలంలో ఏనాడూ ఎప్పుడూ చవి చూడని వరదను ప్రజలు చవి చూశారు. కేవలం మున్నేరు పరివాహాక ప్రాంతంలోని ప్రజలు మాత్రమే ఎప్పుడూ ముంపు బారినపడేవారు. కానీ ఇప్పుడు గాంధీచౌక్‌తో పాటు కవిరాజ్‌నగర్‌, చైతన్యనగర్‌ ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మొదటి అంతస్తు వరకు నీరు రావడంతో ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. మున్నేరు ఎన్నడులేని రీతిలో ప్రవహించడంతో ఖమ్మం నగరానికి కిలో మీటర్‌ మేర మున్నేటి వరద వచ్చింది. తిరుమలాయపాలెం మండలంలో ఆకేరు నది ఉగ్ర రూపం దాల్చింది. గడిచిన 15 ఏళ్ల కాలంలో ఎన్నడు కురవని రీతిలో ఆరు గంటల్లో దాదాపు 20 సెంటీ మీటర్ల వర్షం కురవడంతో మధిర జల దిగ్బంధంలో చిక్కుకుని విలవిలలాడుతోంది. పక్కనే ఉన్న వైరా నది ఎగపోతకు మధిర మున్సిపాలిటీలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. మధిర నియోజక వర్గంలోని మధిర, ఎర్రుపాలెం, బోనకల్‌, చింతకాని మండలాల్లో శనివారం రాత్రి కురిసిన వర్షానికి పల్లె ల మధ్య రాకపోకలు తెగిపోయాయి. నాగులవంచ, పందిళ్లపల్లి వద్ద వాగుల వరద ఉధృతికి ఖమ్మం బోనకల్‌ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వైరా మున్సిపాలిటీలోని పలు పల్లపు ప్రాంతాలు జలమయమయ్యాయి. పెనుబల్లి, కల్లూరు, కూసుమంచి, ఖమ్మం రూరల్‌ మండలాల్లో భారీ వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల వరదల్లో చిక్కుకున్న బాధితులను కాపాడేందుకు అధికార యంత్రాంగం అన్ని ప్రయత్నాలు చేస్తుంది. మధిర మండలంలో పశువులు కాసేందుకు వెళ్లిన ఓ మహిళ మృతి చెందగా మర్రిపేడ మండలం వద్ద వాగులో కారు కొట్టుకుపోవడంతో తండ్రి, కూతురు మరణించారు. కారేపల్లి మండలంకు చెందిన యువ శాస్త్రవేత్త నునావత్‌ అనూష కొట్టుకుపోయి విగతజీవిగా మారారు. ఆమె తండ్రి మోతీలాల్‌ ఆచూకీ తెలియ రాలేదు. జిల్లా మొత్తం జల దిగ్బంధంలో చిక్కుకోగా నాగార్జున సాగర్‌ ఎడమ కాలువకు ఖమ్మంజిల్లా సరిహద్దు నడికుడి మండలంలో భారీ గండిపడింది.
సీతారామకు గండి
భద్రాది జిల్లాలో వర్షం భీభత్సాన్ని సృష్టించింది. శనివారం నుండి ఆదివారం వరకు జిల్లా వ్యాప్తంగా 3373 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. బూర్గంపాడు మండలలో అత్యధికంగా 287.8 మి.మీ, అత్యల్పంగ దమ్మపేట మండలంలో 57.4 మిమీటర్ల వర్షం కురిసింది. ములకలప్లి మండల పరిధిలోని వికే రామవరం సీతారామ ప్రాజెక్టు పంపుహౌస్‌ 2 ప్రధాన కాలువకు గండి పడింది. దీంతో నీరంతా దిగువకు కొట్టుకుపోయింది. ఈ ప్రాజెక్టుకు సిఎం రేవంత్‌ రెడ్డి ఆగస్టు 15వ తేదిన ప్రారంభించారు. అశ్వారావు పేట గుమ్మడి వల్లి ప్రాజెక్టు రింగుబండ్‌కు గండిపడింది. దీంతో నీరు పెద్ద ఎత్తున ప్రవహిస్తూ రోడ్లపైకి చేరింది. మండలంలోని వాగొడ్డుగూడెం నుండి అశ్వారావుపేటకు రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షం కారణంగా మణుగూరు జలమయం అయ్యింది. కుంకుడు చెట్ల గుంపు, సుందరయ్యనగర్‌, గాంధీనగర్‌, లెనిన్‌నగర్‌, ఆదర్శనగర్‌ నీటి ము నిగాయి. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో ఆ ప్రాంత ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు చేర్చారు.
ఉమ్మడి వరంగల్‌లో కుండపోత
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కుండపోత వర్షం కొనసాగుతోంది. శనివారం రాత్రి నుంచి మొదలైన వర్షం ఎడతెరపిలేకుండా కురుస్తుండటంతో ములుగు, మహబూబాబాద్‌, వరంగల్‌ జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మహబూబాబాద్‌, ములుగు జిల్లాల్లో వాగులు, వంకలు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో వందలాది గ్రామాలకు రవాణా వ్యవస్థ దెబ్బతింది. మరిపెడ మండలం పురుషోత్తమయగూడెం బ్రిడ్జి వద్ద వరద ఉధృతికి ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గంగారం తండాకు చెందిన తండ్రి కూతూర్లు నునావత్‌ మోతీలాల్‌, అశ్వినీలు కొట్టుకుపోయారు. మహబూబాబాద్‌ జిల్లాలోని గంగారం మండలం మినహా అన్ని మండలాల్లో 150.మి.మీ.కు పైగా వర్షపాతం నమోదు కావడం గమనార్హం. కొత్తగూడ 162.4, గంగారంలో 68.2, బయ్యారం 180.0, గార్ల 174.4, డోర్నకల్‌ 262.4, కురవి 354.2, మహబూబాబాద్‌ 374.8, గూడూరు 254.0, కేసముద్రం 377.2, నెల్లికుదురు 469.6, నర్సింహులపేట 405.6, చిన్నగూడూరు 450.6, మరిపెడ 352.4, దంతాలపల్లి 354.2, తొర్రూరు 262.4, పెద్దవంగర 245.4మి.మీ.రికార్డు వర్షపాతం నమోదైంది. జిల్లాలో మొత్తం 4747.3 మి.మీ నమోదు కాగా జిల్లా సగటు వర్షపాతం 296.7గా నమోదైంది. మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంతో పాటు గూడూరు, నెల్లికుదురు, కురవి, మరిపెడ మండలకేంద్రాలు నీట మునిగాయి. మహబూబాబాద్‌ జిల్లాలోని మున్నేరు, పాలేరు, ఆకేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పెద్దవంగర మండలంలోని విద్యుత్‌ స్తంభాలు విరిగిపడ్డాయి.
ములుగులో రికార్డు వర్షపాతం నమోదు..!
ములుగు జిల్లాలో మొత్తం 1021.6మి.మీ.వర్షపాతం నమోదు కాగా జిల్లా సగటు వర్షపాతం 113.5గా నమోదైంది. తాడ్వాయి మండలంలో రికార్డు స్థాయిలో 260.8మి.మీ.వర్షం కురిసింది. ఏటూరునాగారం మండలంలో 235.4, గోవిందరావుపేట మండలంలో 151.8 వర్షం నమోదైంది. ములుగు జిల్లాలోని ఏటూరునాగారం ఏజెన్సీలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఏటూరునాగారం జాతీయ రహదారి 163పై రాకపోకలు నిలిచిపోయాయి. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని దేవరాంపల్లి, శంకరంపల్లి, బొప్పారం, దామెరకుంట తదితర గ్రామాల్లో పత్తి పంటలు నీట మునిగాయి. జనగామ జిల్లా వ్యాప్తంగా 1286.4 మిల్లీ మీటర్ల వర్షాపాతం నమోదు కాగా ఆవరేజ్‌గా 107.2 మిల్టీ మీటర్లు నమోదైంది. భారీ వర్షం కురవడంతో పలు ప్రాంతాలకు వెల్లె రోడ్లకు గండ్లు పడ్డాయి. రోడ్డు డైవెర్షన్లు కొట్టుకుపోయాయి. ఇక జనగామ పట్టణం పూర్తిగా జలయమైంది. హన్మకొండ-హైదరాబాద్‌ జాతీయ రాహాదారిలో రఘునాథపల్లి బ్రిడ్జి వద్ద వర్షం నీరు భారీగా నిలిచిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇక జనగామ బస్టాండ్‌ నుండి కళ్లె కమాన్‌ వరకు పూర్తి సుమారు మీటర్‌ ఎత్తులో నీరు ప్రవహించింది. దీనితో బాలాజీనగర్‌, గీతానగర్‌ పూర్తిగా నీట మునిగాయి.
ఏడుపాయల ఆలయం చుట్టూ ఉప్పొంగుతున్న మంజీరా
మెదక్‌ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గ భవాని ఆలయం చుట్టూ మంజీరా ఉప్పొంగడంతో ఆలయం మూసివేశారు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఘనపుర ఆనకట్ట నిండడంతో పాటు ఎగువన ఉన్న మహారాష్ట్ర నుంచి వరద వస్తుండడంతో వనదుర్గా ప్రాజెక్టు పూర్తిగా నిండి పొర్లుతోంది. పటాన్‌ చెరువు సమీపంలోని నక్క వాగు నీరు కూడా చేరడంతో మంజీరాలో వరద ప్రవాహం మరింత పెరిగింది. దీంతో వనదుర్గ ప్రాజెక్టు పూర్తిగా నిండి 13000 క్యూసెక్కుల నీరు దిగువకు ప్రవహిస్తుంది. ప్రాజెక్టు పైనుంచి గంగమ్మ పరవళ్ళు తొక్కుతూ వనదుర్గామాత ఆలయం చుట్టూ మంజీరా ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో వనదుర్గామాత ప్రధాన ఆలయం చుట్టూ మంజీరా నీరు చేరింది.
కడెం ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తివేత
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో నిర్మల్‌ జిల్లాలోని వాగులు వంకలు నిండుకుండలుగా మారి పొంది ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలకు కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టురకు భారీగా వరద నీరు చేరడంతో ఆదివారం ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తినీటిని విడుదల చేస్తున్నారు.ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 7.195 క్యూసెక్కుల,700 అడుగులు కాగా ప్రస్తుతం డ్యాంలో 7.603 టీఎంసీ లు ఉండగా ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో ప్రాజెక్టులోకి వరద భారీగా చేరుతుంది.ఇన్‌ ప్లో 61,001 క్యూసెక్కులుగా నమోదవుతోంది.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments