బువ్వ కోసం అలమటిస్తున్న విద్యార్థులు
ఇంటి నుంచి తెచ్చుకొని స్కూల్‌లో తింటున్న వైనం
ప్రజాపక్షం/రాయపర్తి కరోనా కారణంగా మూతపటిన పాఠశాలలు ఇప్పుడిప్పుడే తెరుచుకున్నాయి. అయితే చదువుకోవాలనే ఆశలతో పాఠశాలల్లో అడుగుపెట్టిన పేద విద్యార్థులు ఆకలికి అలమటిస్తున్నారు. పిల్లలకు పోషకాలతో కూడిన ఆహారం అందించాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజన పథకం… విద్యార్థుల ఆకలిని తీర్చేలేకపోతోంది. దీంతో ఆకలితో అలమటిస్తున్నారు. వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలం కొండాపురం హైస్కూల్, ప్రాథమిక పాఠశాల విద్యార్థులు గత నెల రోజులుగా అరకొర ఆహారంతోనే చదువులను సాగిస్తున్నారు. వంటలు వండే నిర్వాహకులు తమకు రోజు కూలీ అయినా రావడం లేదని, సరైన సమయంలో బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ గత నెల రోజులుగా వంటలు చేయడానికి నిరాకరిస్తున్నారు. కొన్ని రోజులుగా స్థానిక సర్పంచ్ కోదాటి దయాకర్ రావు చొరవ చూపి తమ గ్రామపంచాయతీ కార్మికులతో వంటలు వండించి విద్యార్థుల పిల్లల ఆకలి తీర్చారు. అయితే గ్రామ పంచాయతీ పనులకు ఇబ్బంది కావడంతో ఆ బాధ్యతలు నుంచి ఆయన తప్పుకున్నారు. గురువారం మధ్యాహ్నం భోజన సమయం దాటినా వంటలు వండకపోవడంతో సోమవారం, అన్నారం గ్రామాల విద్యార్థులు తమ గ్రామాలకు నడిచి వెళ్లి అన్నం తిని వచ్చామని విద్యార్థులు తెలిపారు. శుక్రవారం సెలవు దినం కావడం.. శనివారం కొంతమంది విద్యార్థులు వారి ఇంట్లో నుండి టిఫిన్ బాక్స్‌లు తెచ్చుకుని తిన్నారు. అయితే మళ్ళీ గ్రామపంచాయతీ కార్మికులే మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో అన్నం వండి పిల్లలకు పెట్టారు. తమకు సమయానుకూలంగా భోజనం పెట్టకపోవడంతో చదువుపై దృష్టి సారించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, రెండు రోజుల క్రితం భోజనం వండకపోవడం వల్ల ఇంటికి వెళ్ళి తిని వచ్చే పరిస్థితి ఏర్పడిందని విద్యార్థులు వాపోయారు. అధికారుల ఉదాసీనత వైఖరి వల్ల విద్యార్థుల్లో నిరాసక్తత కలిగే పరిస్థితి నెలకొంది. ఈ విషయమై హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ నిర్వాహకులు గత సంవత్సరం భోజనం బిల్లులు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, వచ్చే కమిషన్ వల్ల తమకు కూలీ గిట్టడం లేదని, బిల్లులు సకాలంలో వస్తే ఎలాగోలా నెట్టుకు వచ్చే పరిస్థితి ఉండేదని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుని మధ్యాహ్నం భోజనం అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
ఆకలి కేకలు
RELATED ARTICLES