ఆరుగురు అసోం పోలీసులు మృతి
ఐజ్వాల్: అసోం, మిజోరం రాష్ట్రా ల సరిహద్దు వివాదం హింసాత్మకంగా మారింది. సోమవారం ఇరు రాష్ట్రాల సరిహద్దు ప్రజల మధ్య జరిగిన ఘర్షణల్లో ఆరుగురు అసోం పోలీసులు మృతి చెందడం సంచలనం సృష్టించిం ది. ఈ వ్యవహారంపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర హోం బంత్రి అమిత్ షా జోక్యాన్ని కోరడం విశేషం. అసోం, మిజోరం రాష్ట్రాల మధ్య 164 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. శని, ఆది వారాల్లో సరిహద్దుల్లోని రైతులు, పౌరులు పరస్పరం దాడులకు ఉపక్రమించారు. అసోం నుంచి వచ్చిన వారు ఎనిమిది వ్యవసాయ క్షేత్రాలను తగలబెట్టినట్టు మిజోరం రైతులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం అసోం సరిహద్దులో తీవ్రస్థాయిలో ఘర్షణ చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. కారణాలు ఏవైనప్పటికీ, సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా, మి జోరం వైపు నుంచి గుర్తుతెలియని వారు జరిపిన కాల్పుల్లో అసోంకు చెందిన ఆరుగురు పోలీసులు మృతి చెందగా పలువురు గాయపడ్డారని ఆ రాష్ట్ర అధికారులు ప్రకటించారు. కాగా, హింసాత్మక సంఘటనకు సంబందించిన ఒక వీడియోను మిజోరం ముఖ్యమంత్రి జోరమ్ తంగా ట్వీట్ చేయడం సమస్యను మరింత తీవ్రతరం చేసింది. అసోం నుంచే తమకు ప్రమాదం ముంచుకొస్తున్నదని పేర్కొంటూ, దీనిని అడ్డుకోవాల్సిందిగా ఆయన అమిత్ షాను కోరారు. దీనిపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఘాటుగా స్పందించారు. మిజోరం ప్రజలు కర్రలు, ఇతర ఆయుధాలు పట్టుకొని ఉన్నట్టు వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నదని వ్యాఖ్యానించారు. దీనిని ఎందుకు అడ్డుకోలేదని జోరమ్ తంగాను నిలదీశారు. ఒకవైపు ఇరు రాష్ట్రాల మంత్రులు సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు చేసుకుంటుండగా, మరోవైపు సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఏ విధంగా ఈ సమస్యను పరిష్కరిస్తారన్నది ఇప్పుడు ఆసక్తిగా రేపుతున్నది.