గవర్నర్ నరసింహన్‌కు అఖిలపక్ష నేతల వినతి
ప్రజాపక్షం/హైదరాబాద్: సచివాలయం, అసెంబ్లీ భవనాలను కూల్చొద్దని, వాటిని ప్రస్తుతం ఉన్న భవనాలలోనే కొనసాగించాలని అఖిలపక్ష నేతలు గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌కు విజ్ఞప్తి చేశారు. నూతన భవనాల పేరుతో ప్రజాధనాన్ని వృథా చేయకుం డా ప్రస్తుత సచివాలయం, శాసససభ భవనాలను యథావిధిగానే కొనసాగించాలని, ప్రస్తుత సచివాలయం, ఎర్రమంజిల్‌లోని హెరిటేజ్ భవననాలను కూల్చకుండా చూ డాలని కోరారు. నూతన భవనాల నిర్మాణానికి అవుతున్న ఖర్చులపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ఈ మేరకు సోమవారం రాజభవన్‌కు వెళ్ళిన అఖిలపక్ష బృందం గవర్నర్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. మాజీ ఎంపి వివేక్ వెంకటస్వామి, చాడ వెంకట్‌రెడ్డి (సిపిఐ), కె.జానారెడ్డి, షబ్బీర్‌అలీ, ఎ.రేవంత్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ (కాంగ్రెస్), ప్రొఫెసర్ ఎం. కోదండరామ్, ప్రొఫెసర్ పి.ఎల్.విశ్వేశ్వర్‌రావు(టిజెఎస్), డి.కె.అరుణ, రాంచంద్రారెడ్డి (బిజెపి), ఎల్. రమణ, రావు ల చంద్రశేఖర్‌రెడ్డి (టిడిపి), సి.రామచంద్రయ్య, సంధ్య (ప్రజాసంఘాలు) తదితరుల బృందం గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం అఖిలపక్ష నేతలు మీడియాతో మాట్లాడారు. వివేక్ మాట్లాడుతూ ప్రభుత్వ భవనాలను కూల్చి ప్రజలపై భారం మోపకూడదన్నారు. పురాతన కట్టడాలను పరిరక్షించాలని గవర్నర్‌ను కోరినట్లు వివరించారు. త్వరలోనే రాష్ట్రపతి, కేంద్ర హోంశాఖ మంత్రిని కూడా కలుస్తామని, లోయర్ ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు. చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ సిఎం కెసిఆర్ ఒక తుగ్లక్‌గా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రజాధనం వృథా చేస్తున్నారని, కొత్త భవనాల నిర్మాణాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పారు. కోదండరామ్ మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా భవనాలను కూల్చేందుకు కుట్ర జరుగుతోందన్నారు. సెక్షన్ 8 ప్రకారం గవర్నర్ నిర్ణయం తీసుకోవాలని కోరారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వచ్చే వారం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. శంషాబాద్‌లో తన బినామీ భూములను కాపాడేందుకు కెసిఆర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. డి.కె.అరుణ మాట్లాడుతూ కెసిఆర్‌కు మానసిక రోగం పట్టిందని, అందుకే అంతా నాది, తానే అన్నట్టు వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇంకా చాలా మందికి రైతుబంధు, పెన్షన్ కూడా ఇవ్వలేదని విమర్శించారు.