అందుకు సభ్యులు సహకరించాలి
నూతన స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి
ప్రజాపక్షం / హైదరాబాద్ : దేశంలోనే తెలంగాణ అనేక విషయాలలో నెంబర్‌వన్‌గా ఉన్నదని, శాసనసభా వ్యవహారాల్లో కూడా నెంబర్‌వన్‌గా ఉండేలా సభ్యులు సహకరించాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శాసనసభ నిరవధికంగా వాయిదా పడిన అనంతరం అసెంబ్లీ కమిటీ హాల్‌లో శాసనసభ కార్యదర్శి డాక్టర్ వేదాంతం నరసింహాచార్యులుతో కలిసి ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్పీకర్ మాట్లాడారు. తమకు పదవులు వారసత్వంగా రాలేదని, ప్రజల విశ్వాసంతో వచ్చాయన్నారు. ప్రజల ఆశలకు అనుగుణంగా సభ్యులు సభలో చక్కగా వ్యవహరించాలన్నారు. గత శాసనసభలో మంత్రిగా ఉన్న తాను రెండవ శాసనసభలో స్పీకర్‌గా ఉన్నాననని, తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్న సిఎం కెసిఆర్‌తో పాటు, అన్ని పార్టీల ఎంఎల్‌ఏలకు కృతజ్ఞతలు తెలిపారు. రెండోసారి ప్రభుత్వం ఏర్పడిందని, ఎవరికీ అహంభావం లేదని, గురుతరమైన బాధ్యత ఉన్నదని చెప్పారు. ప్రజల అభ్యున్నతి, రైతుల శ్రేయస్సు కోసం శాసనసభలో ఫలప్రదమైన చర్చలు జరపడం అందరి కర్తవ్యమని పేర్కొన్నారు. అన్ని పక్షాల తరుపున అనుభవజ్ఞులే ఉన్నారని, తప్పనిసరిగా సభ గౌరవాన్ని కాపాడేందుకు సహకరిస్తారని ఆశిస్తున్నానని తెలిపారు. తనకు మంత్రి పదవైనా, స్పీకర్ పదవైనా భారంకాదని, నిబంధనల ప్రకారం నడుచుకునే వారికి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు.