చక్కెర భవన్ గేట్ ముందే స్థలాన్ని కాజేసేందుకు యత్నం
నిర్మాణ పనులు జరుగుతున్నా చోద్యం చుస్తున్నారు
అధికారుల తీరుపై అనుమానాలు
పట్టించుకొని బల్దియా
ప్రజాపక్షం/సిటీబ్యూరో: శాసనసభకు సమీపంలో ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతున్నా సంబంధిత అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ నగరం నడిబొడ్డులో చక్కెర భవన్‌కు చెందిన ప్రభుత్వ స్థలాన్ని కబ్జాదారులు కాజేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాలను సంబంధిత చక్కెర శాఖతో పాటు జిహెచ్‌ఎంసి అధికారులు చర్యలు చేపట్టకపోవడంతో సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. శాసనసభకు ఫర్లాంగు దూరం లో… సచివాలయానికి కూతవేటులో… బల్దియా కార్యాలయాలకు సమీపంలో ఉన్న ఈ స్థలాన్ని సంరక్షించేందుకు చర్యలు తీసుకోవడంలో ప్రభు త్వ శాఖలు విఫలమవుతున్నాయి. పర్యవసనంగా అధికారులు మారినప్పుడుల్లా ఈ స్థలాన్ని కబ్జా చేసేందుకు అక్రమార్కులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. శాసనసభకు ముందువైపు హిల్‌పోర్ట్ రోడ్డులో చక్కెరభవన్ ఉంది. ఈ చక్కెరభవన్‌కు బషీర్‌బాగ్ రోడ్డువైపు, హిల్‌పోర్ట్ రోడ్డు వైపు రెండు గేట్లు ఉన్నాయి. ప్రస్తుతం బషీర్‌బాగ్ వైపు ఉన్న గేట్‌ను వినియోగిస్తున్నారు. హిల్‌పోర్ట్ రోడ్డు వైపు ఉన్న గేట్‌ను వినియోగించడం లేదు. ఈ గేట్ ముందు ఉన్న ఖాళీ స్థలాన్ని స్వాహా చేసేందుకు కొంతమంది అక్రమార్కులు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా చక్కెరభవన్ గేట్ కనిపించకుండా ముందు పెద్ద గోడ కట్టేశారు. ఖాళీ స్థలంలో భవనాన్ని నిర్మించేందుకు ఇటుకలు, ఇతర సామగ్రి అక్కడ వేశారు. స్థలం చుట్టూ ప్రహ రీ గోడ నిర్మాణపనులు ప్రారంభించారు. ఇంత జరుగుతున్న సంబంధిత చక్కెరభవన్ ఉన్నతాధికారులు స్పందించకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎక్కడ ఇటుకలు, ఇసుక పడిన వాలిపోయే బల్దియా క్షేత్రస్థాయి సిబ్బంది ప్రభుత్వ స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుం డా నిర్మాణం చేపట్టిన పట్టించుకోకపోవడం గమనార్హం. కబ్జాదారులతో చక్కెరభవన్ ఉన్నతాధికారులు కొంతమంది కుమ్మక్కయ్యారనే అనుమానాలను స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. చక్కెర భవన్ వెనకాల ఉన్న గేటు ద్వారా సిబ్బంది, అధికారులు రాకపోకలు సాగించేవారు. అయితే కాలక్రమంలో ఆ గేటును పెద్దగా ఉపయోగించడం లేదు. దీంతో ఆ గేటును మూసివేస్తే దాని ముందుఉన్న కొంత స్థలాన్ని ఉపయోగించుకునేందుకు అవకాశం ఉంటుందని భావించి ఆ గేటును మూసివేసేందుకు కొన్ని సంవత్సరాలుగా అనేక ప్రయత్నాలు జరిగాయి. కాగా 2013 సంవత్సరంలోనే దీనిని గేటును ముసివేసే ప్రయత్నాలు జరుగగా అప్పటి చక్కెర శాఖ కమిషనర్ బెనూర్ ఎక్కా నాటి జిహెచ్‌ఎంసి కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన జిహెచ్‌ఎంసి ఆ నిర్మాణాలను కూల్చివేసింది. ఆ తర్వాత కొద్ది రోజులకు మరోసారి నిర్మాణ ప్రయత్నాలు జరుగగా మరో ఉన్నతాధికారి జిహెచ్‌ఎంసి అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో మరోసారి ఆ ప్రయత్నాలు ఆగిపోయాయి. ఆ తర్వాత 2016 సంవత్సరాలలో కూడా ఈ స్థలాన్ని కబ్జా చేసే ప్రయత్నాలు జరిగినా అది సాధ్యం కాలేదు. కాగా గతంలో పనిచేసిన ఉన్నతాధికారులు బదిలీ కావడంతో పట్టువదలని విక్రమార్కుని వలే మరోసారి కబ్జాదారులు స్థలాన్ని కాజేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.