కాళేశ్వరం ద్వారా ప్రాజెక్టులన్నీ నేడు నీటితో కలకలలాడుతున్నాయి
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రైతులకు పంట సబ్సిడీ ఇవ్వలేదు
టిఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుబంధుతో రైతులను ఆదుకుంటుంది
అభివృద్ధికి, పేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుంది… ప్రజలే తమ ఎజెండా.. అంతిమంగా మేము ‘ప్రజాపక్షం’
ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు
సాగునీటి ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ హయాంలో నిర్మించినవే..
కాళేశ్వరం మినహా టిఆర్‌ఎస్ కొత్తగా ఒక్క ప్రాజెక్టు కట్టలేదు
ఖజానా కిస్‌కా జాగీర్ నహీ.. కిస్ కా బాప్‌కా బీ నహీ
ప్రభుత్వం చేసే తప్పులను సరిదిద్దేందుకే తమను గెలిపించి ఇక్కడికి పంపారు
సిఎల్‌పి నేత భట్టి విక్రమార్క
హైదరాబాద్ : శాసనసభలో బడ్జెట్‌పై సాధారణ చర్చకు ఆర్ధి క శాఖ మంత్రి హరీశ్‌రావు, సిఎల్‌పి నేత మల్లు భట్టివిక్రమార్క మధ్య వాద సంవాదం, విమర్శలు, ప్రతివిమర్శలు చోటుచేసుకున్నాయి. బడ్జెట్‌పై మంత్రి హరీశ్‌రావు సమాధానమిస్తూ 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వివిధ రంగాలకు ఖర్చు చేసిన నిధులతో టిఆర్‌ఎస్ ఐదున్నరేళ్ల పాలనలో చేసిన ఖర్చును పోల్చుతూ ఉమ్మడి ఎపిలోని 23 జిల్లాలకు ఖర్చు కంటే 10 జిల్లాల తెలంగాణలో టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎక్కువ నిధులను ఖర్చు చేసిందని కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. పదేళ్ల కాంగ్రెస్ హయాంలో చేసిందేమీ లేదని విమర్శించారు. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలను కూడా కాంగ్రెస్ అమలు చేయలేదని, టిఆర్‌ఎస్ మ్యానిఫెస్టోలో హామీ ఇవ్వకపోయినా రైతుబంధు లాంటి పలు సంక్షేమ కార్యక్రమాలను కూడా అమలు చేసిందన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులను కాంగ్రెస్ పట్టించుకోవలేదని, టిఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ద్వారా తెలంగాణ ప్రాజెక్టులన్నీ నేడు నీటితో కలకలలాడుతున్నాయన్నారు. ఇందుకు భట్టి విక్రమార్క తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ కాళేశ్వరం మినహా నీరు పారుతున్న శ్రీపాద, ఎస్‌ఆర్‌ఎస్‌పి, మిడ్ మానేరు తదితర సాగునీటి ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ హాయాంలోనే నిర్మించినవని, కొత్తగా టిఆర్‌ఎస్ ఒక్క ప్రాజెక్టు కట్టలేదన్నారు. ఇందుకు మంత్రి హరీశ్ రావు స్పందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం శంఖుస్థాపనలు చేసిన ప్రాజెక్టుల్లో తుమ్మలు మొలిచాయని, మిడ్ మానేరు లాంటి ప్రాజెక్టుల్లో కాంగ్రెస్ 30 శాతం పనులు కూడా చేయలేదని, టిఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.1000 కోట్లు ఖర్చు చేసి పూర్తి చేస్తే నేడు నీరు పారుతున్నదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నీలం తుఫాన్ వస్తే ఆంధ్ర ప్రాంతం రైతులకు పంట సబ్సిడీని, పరిహారాన్ని ఇచ్చి తెలంగాణ రైతులకు పంట సబ్సిడీ ఇవ్వలేదని, తెలంగాణ ఏర్పడిన అనంతరం రైతులను ఆదుకునేందుకు రుణాలను రద్దు చేయడమే కాకుండా ‘రైతుబంధు’ పేరుతో పంట పెట్టుబడిని కూడా ఇస్తున్నామని మంత్రి చెప్పారు. ఇందుకు భట్టివిక్రమార్క స్పందిస్తూ రైతు బంధు లాంటి పథకాలకు రాష్ట్ర ఖజానా నుంచి ఖర్చు చేస్తూ సొంత సొమ్ము ఇస్తున్నట్లు మాట్లాడుతున్నారని, ఖజానా కిస్‌కా జాగీర్ నహీ.. కిస్ కా బాప్‌కా బీ నహీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఖజానాలో ప్రజలందరికీ భాగముందనే విషయం మర్చిపోవద్దన్నారు. ఖజానా ప్రజల సొమ్ము అయితే కాంగ్రెస్ హాయాంలో రైతుబంధు ఎందుకు ఇవ్వలేదని, కాంగ్రెస్‌కు ఎందుకు సోయి లేదని మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ హాయాంలో కరెంట్ కోతలమయంగా ఉండేదని, టిఆర్‌ఎస్ ప్రభుత్వం నిరంతర విద్యుత్ సరఫరా చేస్తుందని మంత్రి చెప్పారు. ‘కరెంటు బందు ప్రభుత్వం కాంగ్రెస్‌ది కాగా రైతు బంధు ప్రభుత్వం టిఆర్‌ఎస్‌ది’ అని మంత్రి వ్యాఖ్యానించారు. ఇందుకు భట్టివిక్రమార్క అభ్యంతరం వ్యక్తం చేస్తూ టిఆర్‌ఎస్ ప్రభుత్వ హాయాంలో చేపట్టిన యాదాద్రి, భద్రాద్రి, ఛత్తీస్‌ఘడ్ ప్రాజెక్టులు పూర్తే కాలేదని, కాంగ్రెస్ హాయాంలో చేపట్టిన విద్యుత్ ప్రాజెక్టులలో నేడు ఉత్పత్తి ప్రారంభం కావడం వల్లనే కరెంట్ ఉత్పత్తి స్థాయి పెరింగిందన్నారు. సాగునీటి, విద్యుత్ ప్రాజెక్టులు, సంక్షేమ శాఖలకు నిధుల కేటాయింపుపై ప్రభుత్వాన్ని భట్టి నిలదీశారు. ఎవరి సొంత డబ్బు ఖర్చు పెట్టడం లేదని విమర్శించారు. సాంఘిక, గిరిజన, బిసి సంక్షేమ శాఖల కేటాయింపులలో, విద్యార్థులకిచ్చే ఉపకార వేతనాల్లో భారీగా కోతలు విధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనాభాలో సగం ఉన్న బిసిల సంక్షేమంపై ప్రభుత్వం మాటలు చెబుతోంది తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. ప్రభుత్వం చేసే తప్పులను సరిదిద్దేందుకే తమను కూడా గెలిపించి ఇక్కడికి పంపించారని భట్టి అన్నారు. ఇందుకు మంత్రి హరీష్‌రావు సమాధానమిస్తూ “సంపద పెంచాలి. ప్రజలకు పంచాలి అనేది తమ నినాదం కాదు. తమ విధానం. ఆర్థిక ఇబ్బందులు వచ్చినా రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం ఆగదు. ప్రతి పని పేదల సంక్షేమం కోసం చేస్తాం. బడ్జెట్‌లో ప్రతిదీ పేదల అభివృద్ధికి, సంక్షేమానికే. ప్రజలే తమ ఎజెండా. అంతిమంగా తాము ‘ప్రజాపక్షం’ అని అన్నారు.