న్యూఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో 50 శాతం వివిపాట్ల లెక్కించాలని ప్రతిపక్షాలు చేసుకున్న అభ్యర్థనపై సుప్రీంకోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకటికి బదులు 5 వివిపాట్లలోని స్లిప్పులను ఇవిఎంలతో సరిపోల్చాలని పేర్కొంది. అలాగే లోక్‌సభ నియోజకవర్గాల్లో అయితే 35 వివిపాట్ల స్లిప్పులను లెక్కపెట్టాలని తెలిపింది. కాగా ఈ విషయంలో ఇసి అభ్యర్థనను దేశ అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఇప్పటి వరకు ఎన్నికల సంఘం నియోజకవర్గానికి కేవలం ఒక్క వివిపాట్ రశీదునే లెక్కపెడుతున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు నేతృత్వంలో 21ప్రతిపక్షాలు ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో ఇవిఎంలతో 50 శాతం వివిపాట్ రశీదులను లెక్కించాలన్న డిమాండును మాత్రం సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించలేదు. అలా చేయాలంటే అత్యధిక సిబ్బంది అవసరమవుతారని తెలిపింది. ‘ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒకటి, అలాగే ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో ఐదు వివిపాట్లను లెక్కించ డం సరిపోగలదని మేము భావిస్తున్నాం’ అని ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్, న్యాయమూర్తులు దీపక్ గుప్తా, సంజీ వ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. ఎన్నికల సంఘం తరఫున సీనియర సిఎ సుందరం వాదనలు వినిపించారు. కాగా ప్రతిపక్షాల తరఫున సీనియర్ న్యాయవాది ఎంఎం సింఘ్వీ వాదనలు వినిపించారు. దీనికి ముందు ఎన్నికల ఫలితాలు ఆలస్యమైనా 50 శాతం వివి పాట్ల రశీదులను లెక్కించాల్సిందేనని ప్రతిపక్ష పార్టీలు కోరాయి. దేశంలోని 13.5 లక్షల ఇవిఎంలకు చెందిన సగం వివి పాట్ల రశీదులను లెక్కించడం వల్ల ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయంగా జరిగాయన్న నమ్మకం కలుగుతుందని పేర్కొన్నాయి. 50శాతం వివిపాట్ల రశీదులను లెక్కిస్తే ఫలితాల వెల్లడి ఆరు రోజులు ఆసల్యమవుతుందని ఎన్నికల కమిషన్ (ఇసి) దాఖలు చేసిన అఫిడవిట్‌పై విపక్షాలు సుప్రీం కోర్టుకు తమ స్పందన తెలియజేశాయి. దేశవ్యాప్తంగా ఆరు వారాల పాటు 543 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతాయని,ఇంత పెద్ద ప్రక్రియను సరిచూసేందుకు 479 వివి పాట్లను పరిశీలిస్తే చాలదని ప్రతిపక్షాలు స్పష్టం చేశాయి.
అసెంబ్లీకి 5 వివిపాట్ స్లిప్పులు లెక్కించండి!
RELATED ARTICLES