సిపిఐ తెలంగాణ రాష్ట్ర నిర్మాణ మహాసభలో డి.రాజా విమర్శ
సిఎఎకు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీ తీర్మానిస్తే స్వాగతిస్తాం!
ప్రజాస్వామిక నిరసనలను అనుమతించని కెసిఆర్ వైఖరికి ఖండన
కామ్రేడ్ గుర్రం యాదగిరిరెడ్డి ప్రాంగణం(మంచిర్యాల): దేశ సమగ్రత, ఐక్యతపై దాడి చేస్తున్నమోడీ, అమిత్ షా ద్వయమే అసలైన టుక్డే టుక్డే గ్యాంగ్ అని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా విమర్శించారు. పౌరసత్వ సవరణ చట్టం(సిఎఎ)కు వ్యతిరేకంగా నిజంగానే తెలంగాణ శాసనసభలో తీర్మానం చేసినట్లయితే స్వాగతిస్తానని, అందుకు సిఎం కెసిఆర్‌ను, శాసనసభను అభినందిస్తానని తెలిపారు. అయితే తెలంగాణలో రాజకీయ పార్టీలు, ప్రజల ప్రజాస్వామిక హక్కులను కాలరాచేలా నిరసనలను ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నించారు. మంచిర్యాలలోని కామ్రేడ్ యాదగిరిరెడ్డి ప్రాంగణం(పద్మనాయక కళ్యాణమండపం)లోని కామ్రేడ్ సి.రాఘవాచారి హాల్‌లో మూడు రోజుల పాటు జరిగే సిపిఐ రాష్ట్ర నిర్మాణ మహాసభలు శనివారం ప్రారంభమయ్యాయి. మహాసభలకు ముఖ్య అతిథిగా డి.రాజా హాజరయ్యారు. ప్రారంభ సభలో సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, కార్యవర్గ సభ్యులు సయ్యద్ అజీజ్ పాషా, రాష్ట్ర సహాయ కార్యదర్శులు పల్లా వెంకటరెడ్డి, కూనంనేని సాంబశివరావు, సీనియర్ కమ్యూనిస్టు నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు, కందిమళ్ళప్రతాప్‌రెడ్డి , గుండా మల్లేశ్, కార్యవర్గ సభ్యులు వేదికపై ఆసీనులయ్యారు. తొలుత మహాసభ ఆహ్వాన సంఘం అధ్యక్షుడు కలవేణి శంకర్ స్వాగతోపన్యాసం చేశారు. అనంతరం డి.రాజా మహాసభలను ప్రారంభించారు. “మీరు అందరికీ చాలా నమస్కారాలు” అంటూ తెలుగులో ప్రసంగాన్ని మొదలు పెట్టారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నదని, ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్‌షాలు విభజన రాజకీయాలు చేస్తూ, భారతదేశాన్ని హిందూత్వ, మతతత్వ ఫాసిస్టు రాజ్యం గా మార్చాలనే ఆర్‌ఎస్‌ఎస్ కుటిల పన్నాగాన్ని దూకుడు గా అమలు చేస్తున్నారని రాజా విమర్శించారు. ప్రజాస్వామ్యం, అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం, లౌకికవాదం పై సవాలు విసురుతున్నారని పేర్కొన్నారు. అచ్చేదిన్ అంటూ అధికారంలోకి వచ్చిన ప్రధాని మోడీ తొలి విడతలో అచ్చే దిన్‌ను తీసుకురాలేదని, ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేసి, కుప్పకూలే పరిస్థితికి తీసుకువచ్చారన్నా రు. సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్ అంటున్నారని, కానీ వాస్తవానికి కార్పొరేట్ కంపెనీలు, బడా వ్యాపారస్తులు, అదానీ, అంబానీ, బిర్లా వంటి కార్పొరేట్ మాఫియాకే మోడీ మద్దతుదారురని ఘాటు విమర్శలు చేశారు. వారి చర్యలను వ్యతిరేకించే వ్యక్తులను దేశ ద్రే హులని, ప్రభుత్వ విధానాలను ప్రశ్నించేవారిని అర్బన్ నక్సల్స్, అర్బన్ మావోయిస్టులని ముద్రవేసి జైళ్ళో వేస్తున్నారని, ప్రజాస్వామ్య, కమ్యూనిస్టు శక్తులను టుక్డే టుక్డే గ్యాంగ్ అని అంటున్నారని చెప్పారు. అసలు దేశంలో టుక్డే టుక్డే గ్యాంగ్‌లు ఉన్నాయా? అని ఇటీవల పార్లమెంటులో ప్రశ్న అడిగితే, అలాంటి సమాచారం లేదన్నారని, కానీ బయట మాత్రం ఆ పదాన్ని వాడుతున్నారని వివరించారు. ప్రజల మధ్య విభజన తీసుకొచ్చి లబ్ధ్ది పొం దేందుకే జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370 రద్దు చేసిందని, అయోధ్య విషయంలో వివక్షత చూపుతోందని, పౌరసత్వ చట్ట సవరణ తీసుకువచ్చిందని రాజా తెలిపారు. ముస్లింలను లక్ష్యంగా చేసుకొని సిఎఎను తీసుకువచ్చారని, దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రాంతాలు, మతాలకు అతీతంగా లక్షలాది మంది వీధుల్లోకి వస్తున్నారని, అయినా మోడీ, షా ద్వయానికి అర్థం కావడం లేదన్నారు. తాము ఇప్పటికే నిరంకుశ సిఎఎను వెనక్కి తీసుకోవాలని రాష్ట్రపతికి విజ్ఞ ప్తి చేశామని రాజా తెలిపారు. సిఎఎకు వ్యతిరేకంగా తీర్మానం చేసిన తొలి రాష్ట్రం కేరళ అని, అక్కడ సిపిఐ భాగస్వామిగా వామపక్ష ప్రజాతంత్ర సంఘటన అధికారంలో ఉన్నదన్నారు. సిఎఎకు వ్యతిరేకంగా శాసనసభ లో తీర్మానం చేయాలనే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నానని, అదే సమయంలో ప్రజలు, పార్టీ ప్ర జాస్వామిక హక్కులను, నిరసనలను అనుమతించాలని రాజా సూచించారు. భారతదేశం ప్రజాస్వామ్య దేశమ ని, అసమ్మతి, నిరసన అనేది ప్రజాస్వామ్యంలో భాగమని చెప్పారు. తెలంగాణలో ఎందుకు నిరసనలకు అనుమతించడం లేదని ప్రజలు వీధుల్లోకి వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నారు.
ట్రంప్ పర్యటనకు వ్యతిరేకంగా నిరసనలు : ఈనెల 24, 25 తేదీల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత దేశ పర్యటనకు విచ్చేస్తున్న నేపథ్యంలో ఆయన పర్యటనకు వ్యతిరేకంగా వామపక్షాల ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు రాజా తెలిపారు. అమెరికా రాజకీయ, ఆర్థిక సంక్షోభం లో ఉన్నదని, ఆ భారాన్ని ఇతర దేశాలపై నెట్టేందుకు ప్రయత్నిస్తుందని, భారత్‌పై కూడా మోపుతుంటే ప్రధాని మోడీ అంగీకరిస్తున్నారని, అందుకు తాము నిరసన తెలుపుతున్నామన్నారు.
ఇది వీర తెలంగాణ : ఆర్‌ఎస్‌ఎస్, బిజెపి అవలంబిస్తు న్న మతతత్వ, విభజన రాజకీయాలను సైద్ధాంతిక రాజకీయాలతోనే ఎదుర్కోవాలని, రాజ్యాంగం, ప్రజాస్వా మ్యం, లౌకికవాదంపై బిజెపి విసురుతున్న సవాళ్ళను సిపిఐ, వామపక్ష, ప్రజాతంత్ర పార్టీలు, శక్తులు ఐక్యంగా తిప్పికొట్టాలని రాజా పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 21 నుం డి మారి 23 వరకు సైద్ధాంతిక రాజకీయ ప్రచారానికి సిపిఐ పిలుపునిచ్చిందన్నారు. మతోన్మాద, విభజనవాద వ్యతిరేక పోరాటానికి సైద్ధాంతికంగా కార్యకర్తలను బలోపేతం చేసుకోవడం, పార్టీని పటిష్టపరిచేందుకు సిపిఐ రాష్ట్ర నిర్మాణ మహాసభలు దిక్చూచి కావాలన్నారు. తా ను నిజాం వ్యతిరేక సాయుధ పోరాటం చేసిన అసలైన దేశభక్తులకు జన్మనిచ్చిన తెలంగాణ గడ్డపై మాట్లాడడం గర్వంగా ఉన్నదని చెప్పారు. రాజా ప్రసంగాన్ని కూనంనేని సాంబశివరావు అనువాదం చేశారు.
పతాకావిష్కరణ :
మంచిర్యాలలో మూడు రోజుల పాటు జరిగే సిపిఐ రాష్ట్ర నిర్మాణ మహాసభలు శనివారం ఉత్సాహపూరిత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. మహాసభలు జరుగుతున్న కామ్రేడ్ గుర్రం యాదగిరిరెడ్డి ప్రాంగణం ( పద్మనాయక కళ్యాణ మండపం) ఉదయం నుంచి ప్రతినిధులు పెద్దఎత్తున చేరుకున్నారు. ఎర్రచొక్కాలు ధరించిన ప్రతినిధులతో ప్రాంగణం ఎరుపెక్కింది. సరిగ్గా మధ్యాహ్నం మూడు గంటలకు సభల ప్రారంభ సూచికగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, సిపిఐ మాజీ శాసనసభా పక్ష నాయకుడు గుండా మల్లేష్ అరు ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ‘లాంగ్ లివ్ సోషలిజం, మార్కిజం సిపిఐ జిందాబాద్’ అని పెద్దపెట్టున ప్రతినిధులు నినాదాలు చేశారు. ‘ఓ అరుణ పతాకమా గై కొనుమా రెడ్ సెల్యూట్’ అని ప్రజానాట్యమండలి బృందం పాడిన పాట ఉత్తేజపరిచింది. ఈ సం దర్భంగా సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా, రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ, కార్యవర్గ సభ్యులు సయ్యద్ అజీజ్ పాషా, సీనియర్ నాయకులు పువ్వాడ నాగేశ్వర్‌రావు, కందిమళ్ల ప్రతాప్‌రెడ్డి, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శు లు కూనంనేని సాంబశివరావు, పల్లా వెంకట్‌రెడ్డి, కార్యదర్శివర్గ సభ్యులు పశ్యపద్మ, టి.శ్రీనివాసరావు, ఎన్. బాలమల్లేష్, మహాసభ ఆహ్వాన సంఘం అధ్యక్షులు కళవేణి శంకర్ అరుణపతాకానికి సెల్యూట్ చేశారు.
అమరవీరులకు నివాళి : మహాసభ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపాన్ని తెలంగాణ స్వాతంత్య్ర సమరయోధులు కందిమళ్ళ ప్రతాపరెడ్డి ఆవిష్కరించారు. అసువులు బాసిన పోరాట యోధులకు కమ్యూనిస్టు పార్టీ నేతలు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా అమరవీరులకు జోహార్ అని ప్రతినిధులు నినాదాలు చేశారు. ఒక్కొక్కరుగా అందరు అమరవీరుల స్థూపం వద్ద పూలు వేసి నివాళులు అర్పించారు.
సంతాప తీర్మానం : గత మహాసభల నుంచి ఇప్పటివర కు మరణించిన ప్రముఖులు, పార్టీ నాయకులకు సిపిఐ రాష్ట్ర నిర్మాణ మహాసభ సంతాపం తెలియచేసింది. ఈ మేరకు సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టిన సంతాప తీర్మానాన్ని మహాసభ ఆమోదించింది. ప్రముఖ ట్రేడ్ యూనియన్ నాయకులు, సిపిఐ సీనియర్ నాయకులు గురుదాస్ దాస్‌గుప్తా, న్యూఏజ్ ఎడిటర్ షమీమ్‌ఫైజీ, మాజీ ప్రధా ని అటల్‌బిహారీ వాజ్‌పాయ్, మాజీ ఎంఎల్‌ఎ గుర్రం యాదగిరిరెడ్డి, విశాలాంధ్ర మాజీ ఎడిటర్ సి.రాఘవాచారి తదితరులకు మహాసభ సంతాపం తెలియచేసింది.
వివిధ కమిటీల ఎన్నిక :
సిపిఐ రాష్ట్ర నిర్మాణ మహాసభల నిర్వహణకు పలు కమిటీలను ఎన్నుకున్నారు. ఈ మేరకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ప్రతినిధుల సభ ముందుంచిన వివిధ కమిటీల సభ్యుల పేర్ల ప్రతిపాదనలను ప్రతినిధులు ఏకగ్రీవంగా ఆమోదించారు.
కమిటీల వివరాలు :
అధ్యక్షవర్గం : కూనంనేని సాంబశివరావు, కలవేణి శంకర్, విఎస్.బోస్, ఎన్.జ్యోతి, కె.భూమయ్య, అశోక్ స్టాలిన్, ఇందనూరు బషీర్ అహ్మద్
సారథ్యసంఘం : సిపిఐ రాష్ట్ర కార్యవర్గం
తీర్మానాల కమిటీ : పశ్యపద్మ(కన్వీనర్), సాబీర్‌పాషా, ఇ.టి.నర్సింహా, పల్లా నర్సింహారెడ్డి, మంద పవన్.
మీడియా కమిటీ : పల్లా వెంకట్‌రెడ్డి, గుండా మల్లేష్, ఎన్.బాలమల్లేష్.
అర్హతల కమిటీ : టి.శ్రీనివాసరావు, వి.సృజన, ఎం. అనిల్ కుమార్, వలీవుల్లా ఖాద్రి, ఆర్.శివరామకృష్ణ మినిట్స్ కమిటీ: కెవిఎల్ (కన్వీనర్), ఆర్.పాండురంగాచారి, బిక్షపతి, ఎల్.శ్రావణ్ కుమార్
అసలైన విచ్ఛిన్న శక్తులు మోడీ, షా
RELATED ARTICLES