సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వాటిపై అడ్డుకట్ట వేయాలి
హైదరాబాద్ సిపికి వైసిపి నేత షర్మిళ ఫిర్యాదు
ప్రభాస్‌తో పరిచయం లేదు: ఫోన్‌లో సంభాషించిన దాఖలాలు లేవు
రాజకీయంగా తమ కుటుంబాన్ని ఎదుర్కోలేకే తప్పుడు వ్యాఖ్యలు
ప్రజాపక్షం/ సిటీబ్యూరో
సోషల్ మీడియా వేదికగా తనపై జరుగుతున్న అసత్య ప్రచారాలకు అడ్డుకట్ట వేయాలని వైఎస్‌ఆర్‌సిపి నాయకురాలు షర్మిళ సోమవారం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్‌ను కోరారు. పార్టీ సీనియర్ నాయకులతో కలిసి బషీర్‌బాగ్‌లోని కమిషనర్ కార్యాలయానికి చేరుకున్న షర్మిళ కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు లేఖను అందజేశారు. సినీనటుడు ప్రభాస్‌తో తనకు సంబంధం అంటకడుతూ పలువురు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2014 ఎన్నికల ముందు ఇలాగే ప్రచారా లు చేసి తన వ్యక్తిగత ప్రతిష్టకు, కుటుంబ గౌరవానికి భంగం వాటిల్లేలా వ్యవహరించారని, ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండటంతో మళ్లీ అవే అసత్య ప్రచారాలను వైరల్ చేస్తున్నారని కమిషనర్‌కు వివరించారు. సామాజిక మాధ్యమాల్లో మహిళలపై ఇలాంటి దాడులు పెరిగిపోయాయని, వాటిని అరికట్టాలని కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. అసలు తనకు ప్రభాస్ అనే వ్యక్తితో ముఖ పరిచయం కూడా లేదని, ఇంత వరకూ ఫోన్‌లో సంభాషించిన దాఖలాలు కూడా లేవని వాపోయారు. రాజకీయంగా తమ కుటుంబాన్ని ఎదుర్కోలేక కొందరు ఇలాంటి ప్రచారాలకు ఒడికడుతున్నారని ఆరోపించారు. ఈ ప్రచారాలు చేస్తున్నవారు ఎవరో కనిపెట్టి వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. తక్షణం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇలాంటి పోస్టులను తీసివేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులపై తనకు నమ్మకం లేకే తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేశానని షర్మిళ మీడియాకు తెలిపారు. కమిషనర్‌ను కలిసిన వారిలో షర్మిళ భర్త అనీల్‌కుమార్, వైఎస్‌ఆర్‌సిపి సీనియర్ నాయకులు వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వాసిరెడ్డి పద్మ ఉన్నారు.