రెండవ సారి అధికారానికి మూడేళ్లు
కెసిఆర్ పట్ల తగ్గుతున్న విశ్వసనీయత?
ఏడేళ్ల తర్వాత రాష్ట్ర ప్రజల ఆలోచనలో మార్పు
ప్రజాపక్షం ప్రత్యేక ప్రతినిధి ‘కెసిఆర్ ఏం చెప్పినా చేసి చూపిస్తారు’ అన్న ఆలోచనను వీడి తెలంగాణ ప్రజలు మరో ఆలోచన చేస్తున్నారు. ప్రజల ఆలోచన మారుతుందన్న దానిపై కొందరికి సందేహాలు ఉన్నా ఇది వాస్తవం. తెలంగాణ రాష్ట్ర సమితి రెండవ సారి అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తి చేసుకుంది. మొదటి నాలుగున్నర ఏళ్లలో కొత్త రాష్ట్రం సర్దుకోవడానికి అవకాశం ఇవ్వాలి అనుకున్న ప్రజ లు… ఇప్పుడు కెసిఆర్ మాటల్లో నిజాయితీని వెతుక్కుంటున్నారు. రెండవ సారి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన కెసిఆర్ హామీ ఇచ్చి ప్రవేశ పెట్టిన పథకాలు ఎక్కువ శాతం అసంపూర్తిగానే మిగిలిపోయాయి. 2018 ఎన్నికల సం దర్భంగా రైతు రుణమాఫీ ఇంత వరకు పూర్తిగా అమలు కాలేదు. రూ. 25 వేలు, రూ. 50వేలు అంటూ ప్రభుత్వం కాలయాపన చేస్తోంది. రుణమాఫీ జరగక, బ్యాంకులు పెట్టుబడికి వ్యవసాయ రుణాలు ఇవ్వకపోవడంతో ప్రైవేటు వ్యక్తులను ఆశ్రయించాల్సి వస్తుంది. ఇక బ్యాంకుల్లో ఉన్న అప్పులకు వడ్డీలకు వడ్డీలు పెరిగిపోతున్నాయి. రైతుబంధు మినహా ఈ మూడేళ్ల కాలంలో తెలంగాణ రైతులకు ప్రభుత్వపరంగా చేసింది ఏమీ లేదని చెప్పవచ్చు. దగా పడిన తెలంగాణను సరిదిద్దే అవకాశం టిఆర్‌ఎస్‌కె ఇవ్వాలని 2014లో ప్రజలు భావించారు. కాంగ్రెస్, తెలుగుదేశం పాలనను చూసిన ప్రజలు టిఆర్‌ఎస్ మాత్రమే సరైంది అని భావించారు. రెండవ సారి 2018లో సమయం సరిపోలేదనుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం తెలంగాణ యువకులు పాలన విఫలమైందని భావిస్తున్నారు. ముఖ్యంగా నిరుద్యోగ యువత ఆలోచనలో పెద్దమార్పు వచ్చింది. ఎన్నికల వాగ్దానమైన నిరుద్యోగ భృతి ఊసెత్తకపోవడం యువతను బాధించింది. బాధల నుంచి ఇప్పుడు ఆవేశం పుట్టుకొస్తుంది. మన ప్రభుత్వం మనల్ని దగా చేస్తుందన్న ఆలోచన యువతలో రాజుకుంటోంది. గతంలో రకరకాల పథకాలతో మహిళలకు ఆర్థిక లబ్ధి జరిగేది, ఇప్పుడు పరిస్థితి ఇందుకు పూర్తిగా భిన్నంగా జరుగుతుంది. మహిళలకు కెసిఆర్ పట్ల విశ్వాసం సన్నగిల్లింది. తెలంగాణ వస్తే కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఉండరన్న కెసిఆర్ మాట అబద్ధమైంది. ప్రభుత్వ కొలువులు లేక… ఉన్న ప్రైవేటు ఉద్యోగాలు పోయి ఉపాధి కోసం యువత ధీనంగా వెతుకులాడుతోంది. ఉద్యోగ వర్గాలు తెలంగాణ ప్రభుత్వానికి దన్నుగా నిలిచాయి. గత చరిత్రలో ఏ ప్రభుత్వానికి ఇవ్వని రీతిలో ఉద్యోగులు మద్దతుగా నిలిచారు. ఇదిగో అదిగో అంటూ సమస్యలను పరిష్కరించకపోవడంతో ఇప్పుడు ఉద్యోగ సంఘాల నాయకులు మద్దతుగా నిలువగా మొత్తం క్షేత్రస్థాయిలో ఉద్యోగులంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారారు. ‘మీరు టిఆర్‌ఎస్ పార్టీకి ఓటేయండి. నేను కుర్చీ వేసుకుని కుర్చుని పోడు భూముల సమస్యను పరిష్కరిస్తా’ అని చెప్పిన కెసిఆర్, రెండవ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయం మరచిపోయారు. అంతేకాదు గత ప్రభుత్వాల కంటే కెసిఆర్ ప్రభుత్వమే పోడు రైతులను ఎక్కువగా ఇబ్బందులు పెట్టింది. రెండవ దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్టర్లకు, అది ఆంధ్రా వలస కాంట్రాక్టర్లకు, సంపన్న వర్గాలకు మినహా సామాన్య ప్రజలకు అంతగా ప్రయోజనం సమకూర్చిన పథకాలు లేవని చెప్పవచ్చు. అనవసర వాగ్దానాలు టిఆర్‌ఎస్‌కు చేటు తెచ్చిపెట్టాయి. గతంలో చెప్పిన దళితులకు మూడెకరాల భూమి అటకెక్కినట్లే ‘దళితబంధు’ కూడా అదే బాటలో పయనిస్తుందన్న ప్రచారం జోరందుకుంది. పథకాలు, వాగ్దానాలు, హామీల సంగతి అటుంచితే నిన్న మొన్నటి వరకు కెసిఆర్ మాట తెలంగాణ ప్రజల మాటగా చెల్లుబాటైంది. కాళేశ్వరం గురించి చెప్పినా, కోటి ఎకరాల మాగాణ అన్నా… ఇంకా ఏదన్నా అదంతా మనకోసమేనని ప్రజలు భావించారు. కెసిఆర్ తనదైన శైలిలో చేసే విమర్శలను ప్రజలు స్వాగతించారు. తెలంగాణలో టిఆర్‌ఎస్ మినహా మిగిలిన రాజకీయ పార్టీలను ప్రజలు కనీసం విశ్వాసంలోకి తీసుకోలేదు. ఇప్పుడు తెలంగాణలో ఆ పరిస్థితి లేదు. కెసిఆర్, కెటిఆర్ మినహాయిస్తే టిఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు ఎవ్వరు ప్రజల దృష్టిలో ప్రజాప్రతినిధులుగా కాకుండా కెసిఆర్ పనిమనుషులుగానే గోచరిస్తున్నారు. ఆహా.. ఓహో.. అనడం మినహా క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకోవడంలో విఫలమవుతున్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలోని విపక్ష నేతల విమర్శలను ప్రజలు పట్టించుకుంటున్నారు. నిజనిజాలను అంచనా వేసే పనిలో ఉన్నారు. ఇది పెద్ద మార్పు. ధాన్యం కొనుగోలు విషయంలో మొన్నటి వరకు కెసిఆర్ ఏం చెప్పినా నమ్మారు. ఇప్పుడు రైతాంగం టిఆర్‌ఎస్, బిజెపి రెండింటిని దోషులుగానే చూస్తోంది. ముఖ్యంగా టిఆర్‌ఎస్ నేతల ఆస్తుల వ్యవహారం జనంలో చర్చనీయాంశమైంది. హుజురాబాద్ ఫలితం ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక మార్పును తీసుకు వచ్చింది. దీనిలో బిజెపి గెలుపు కంటే టిఆర్‌ఎస్‌పై వ్యతిరేకతను చూడాల్సి ఉంది. ఉద్యమకారులనే కాదు తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని భావన తెలంగాణ ప్రజల మదికెక్కింది. మూడేళ్ల పాలనలో పదునైన విమర్శలు తప్ప పారదర్శక పాలన లేకపోవడం టిఆర్‌ఎస్‌కు నష్టం చేకూర్చింది. షాదీముబారక్, కళ్యాణలక్ష్మీ, రైతు బంధు మినహా చెప్పుకోవడానికి ఏమీ లేదు.
అసంపూర్తి పథకాలు… అనవసర వాగ్దానాలు
RELATED ARTICLES