చట్టాలను నిర్వీర్యం చేస్తున్న మోడీ ప్రభుత్వంపై తిరగబడాలి
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
ప్రజాపక్షం/కొత్తగూడెం పోరాడి సాధించుకున్న చట్టాలను నిర్వీర్యం చేస్తున్న మోడీ ప్రభుత్వంపై సంఘటిత, అసంఘటిత కార్మికులు తిరగబడాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. సిపిఐ 24వ జాతీయ మహాసభల సందర్భంగా హమాలీ కార్మికులు ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను నిర్యీం చేస్తోందని, యాజమాన్యాలు, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా చట్టాలను మారుస్తుందని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అసంఘటిత కార్మికుల సమస్యలను పట్టించుకునే పరిస్థితిలో లేవన్నారు. భవన నిర్మాణ సంక్షేమ చట్టం తరహాలో సంక్షేమ చట్టం రూపొందించాలని అనాదిగా అసంఘటిత కార్మికులు పోరాడుతున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కరోనా లాక్‌డౌన్ కాలంలో రెక్కాడితేగానీ డొక్కాడని అసంఘటిత కార్మికులను గోసపెట్టించారని విమర్శించారు. పాలకుల నుంచి ఎలాంటి తోడ్పాటు లేకపోవడంతో పస్తులు ఉండాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్, పెట్టుబడిదారులకు కారుచౌకగా అమ్మివేస్తున్నారని, కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో లక్షలాది మంది కార్మికులు, ఉద్యోగులు రోడ్డు పాలవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ నెల 14 నుంచి ఐదు రోజులపాటు విజయవాడ నగరంలో జరగనున్న సిపిఐ జాతీయ మహాసభల్లో సంఘటిత, అసంఘటిత రంగ కార్మికుల సమస్యలపై చర్చించి పలు తీర్మానాలు చేస్తామని తెలిపారు. మహాసభల ప్రారంభం సందర్భంగా 14న విజయవాడలో జరిగే ర్యాలీ, బహిరంగ సభకు యూనియన్లకు అతీతంగా కార్మికవర్గం పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో సిపిఐ కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్‌కె.సాబీర్ పాషా, జిల్లా కార్యవర్గ సభ్యుడు వై.శ్రీనివాసరెడ్డి, వార్డు కౌన్సిలర్ బోయిన విజయ్‌కుమార్, యూనియన్ నాయకులు రమణయ్య, కొమరయ్య, సారయ్య తదితరులు పాల్గొన్నారు.
అసంఘటిత కార్మికుల గోడు పట్టని కేంద్రం
RELATED ARTICLES