HomeNewsBreaking Newsఅవినీతి జలగలు

అవినీతి జలగలు

ప్రభుత్వ ఉద్యోగుల్లో పెచ్చుమీరుతున్న అవినీతి, అక్రమాలు
వరుసగా ఎసిబి దాడులు, షోకాజ్‌ నోటీసులు, సస్పెన్షన్లు
అయినా మారని పనితీరు
ప్రజాపక్షం/రంగారెడ్డి
రంగారెడ్డి జిల్లా ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ, పారిశ్రామిక, రియల్‌ ఎస్టేట్‌ రంగాల్లోనే కాకుండా అవినీతి, అక్రమాలలో కూడా అగ్రస్థానంలో నిలుస్తున్నది. జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగు లు తరచూ అక్రమ వసూళ్లకు పాల్పడుతూ, ఆదాయానికి మించి ఆస్తులు కూడబెడుతూ, ఒకరి తర్వాత మరొకరు అవినీతి నిరోధక శాఖ (ఏసిబి)కు పట్టుబడుడుండడం ఇందుకు నిదర్శనం. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై ఇటీవల జల్‌పల్లి మున్సిపల్‌ కమిషనర్‌ జి.పి.కుమార్‌ నివాసాలపై ఎసిబి అధికారులు ఏక కాలంలో దాడులు నిర్వహించారు. ఈ అంశాన్ని జిల్లా ప్రజలు మరిచిపోక ముందే తాజాగా మరో పంచాయితీరాజ్‌శాఖ ఆడిటర్‌ ఎసిబికి చిక్కడంపై జిల్లాలోని ఉద్యోగుల పనితీరు పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. అయినా జిల్లా ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల పనితీరులో ఏ మాత్రం మార్పు రావడం సరికదా నిత్యం ఏదో ఒక శాఖలో అవినీతి ఆరోపణలు వినబడుతూనే ఉన్నాయి.
పంచాయితీరాజ్‌శాఖలో…
మహేశ్వరం మండలం అమీర్‌పేట్‌ గ్రామ పంచాయితీ కార్యదర్శి చక్రధర్‌ గౌడ్‌ నుంచి జిల్లా సీనియర్‌ ఆడిటర్‌ శైలిందర్‌ సింగ్‌ రూ.11 వేలు లంచం తీసుకుంటూ ముడు రోజుల క్రితం ఎసిబికి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. గ్రామ పంచాయితీ నిధులు, ఖర్చు వివరాలను ఆడిట్‌ చేసే అంశంపై ఆయన డబ్బులు డిమాండ్‌ చేయడంతో ఆ కార్యదర్శి ఎసిబిని ఆశ్రయించినట్లు సమాచారం. మెయినాబాద్‌ మండలం 111 జిఓ పరిధిలో నిర్మాణాలపై నిషేధం ఉండగా, జిల్లా పంచాయితీ అధికారుల సంఘం అధ్యక్షుడు, శంషాబాద్‌ మాజీ ఎంపిఓ సురేందర్‌రెడ్డి అక్కడ నిర్మాణాలకు వాటికి అనుమతిచ్చిన విషయంలో నాలుగు నెలల కింద సస్పెండ్‌ అయ్యాడు. తిరిగి పోస్టింగ్‌ పొందిన రోజే అవినీతి నిరోధకశాఖకు అడ్డంగా దొరికిపోగా రూ.2.31 కోట్ల అక్రమ ఆస్తులను గుర్తించి ఆయనను అరెస్ట్‌ చేశారు. ఎక్సైజ్‌, పోలీసుశాఖలలో… శంషాబాద్‌ ఎక్సైజ్‌ పోలీసు సూపరింటిండెంట్‌ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారింది. గతంలో ఇక్కడ పని చేసిన ఇద్దరు సిఐల తోపాటు ఒక సూపరింటిండెంట్‌ పై నకిలీ ఈవెంట్ల పర్మిట్‌ దందా ఆరోపణలు వెల్లువెత్తాయి.ఈ కేసులో ప్రమేయం ఉన్న ముగ్గురు ఉద్యోగులపై ఇప్పటికే వేటు వేశారు. కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది. భు కబ్జాదారుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడి, ఇద్దరు రియల్టర్ల హత్యకు పరోక్షంగా కారణమయ్యారనే ఆరోపణలపై ఇబ్రహీంపట్నం ఎసిపి బాలకృష్ణారెడ్డిపై కూడా ఇటీవల వేటు పడిన విషయం తెలిసిందే. రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ శాఖలో… ఫరూఖ్‌నగర్‌ మండలం వెలిజర్ల పంచాయితీ శివారులో సాయిరెడ్డి అనే వ్యక్తి అనుమతి లేకుండా ఇల్లు నిర్మించుకునేందుకు కార్యదర్శి రమేష్‌ రూ.3 లక్షలు డిమాండ్‌చేసినట్లు నిర్ధారణ అయింది. పదిహేను రోజుల కింద జిల్లా కలెక్టర్‌ ఆ కార్యదర్శిని సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా కడ్తాల్‌ మండలంలో ప్రభుత్వ భూమిలో ఎలాంటి అనుమతి లేకుండా ఇంటి నిర్మాణం చేపట్టిన నర్సంపల్లి సర్పంచ్‌ ని సైతం జిల్లా కలెక్టర్‌ సస్పెండ్‌ చేశారు. నందిగామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్‌ 112 లోని ఓ కుంటలో పెట్రోల్‌ బంక్‌ ఏర్పాటుకు ప్రొసిడింగ్స్‌ జారీ చేయడాన్ని జిల్లా కలెక్టర్‌ తీవ్రంగా పరిగణించి సంబంధిత రెవెన్యూ అధికారులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. మాదాపూర్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు శంషాబాద్‌ మండలం పెద్దషాపూర్‌ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్‌ 275, 288 లలో 24 ఎకరాలు కొనుగోలు చేసి రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌ చేశారు. వీరిలో ఒకరు స్థానిక రిజిస్ట్రార్‌తో కుమ్మక్కై భాగస్వామికి తెలియకుండా 12 ప్లాట్లు విక్రయించారు. ఆ బాధితుడు వ్యాపార భాగస్వామితో పాటు రిజిస్ట్రార్‌పై కూడా పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు ఆ ఇద్దరిపై కేసు నమోదు చేయడం గమనార్హం.
విద్యుత్‌శాఖలో… మాదాపూర్‌ సాయినగర్‌కు చెందిన నాగజ్యోతి విద్యుత్‌ కనెక్షన్‌ కోసం దరఖాస్తు చేసుకోగా, క్షేత్రస్థాయి ఉద్యోగులు ఆమెను రూ.10 వేలు డిమాండ్‌ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టంలేని బాధితురాలు ఎసిబిని ఆశ్రయించగా, మాదాపూర్‌ సబ్‌స్టేషన్‌ లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రభాకర్‌రావు, జూనియర్‌ లైన్‌మెన్‌ సతీష్‌ కుమార్‌లను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మెదక్‌ సర్కిల్‌లో మంజూరైన 160 కెవి ట్రాన్స్‌ఫార్మర్‌ సహా 11 మీటర్లను కొండాపూర్‌ డివిజన్‌ అల్లాపూర్‌ సెక్షన్‌ పరిధిలో బిగించినట్లు విజిలెన్స్‌ తనిఖీల్లో స్పష్టమైంది. ఈ కేసులో మెయినాబాద్‌ సహా మరో ఇద్దరు ఎఈలు, లైన్‌మెన్‌, లైన్‌ ఇన్‌స్పెక్టర్‌పై వేటు వేశారు. రాజేంద్రనగర్‌ సర్కిల్‌ పరిధిలోని కందుకూరు ఈఆర్‌ఓ కేంద్రంలో వినియోగదారులు చెల్లించిన నెలవారి విద్యుత్‌ బిల్లులను సంస్థ బ్యాంకు ఖాతాలో జమ చేయకుండా సొంత ఖాతాలో వేసుకున్న అసిస్టెంట్‌ అకౌంట్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్‌, జూనియర్‌ అకౌంట్‌ ఆఫీసర్‌ బాలరాజు, ఎల్‌డిసి రమేష్‌లపై ఉన్నతాధికారులు వేటు విధించారు.
అటవిశాఖలో…. కొత్వాల్‌గూడలో టింబర్‌ డిపో ఏర్పాటు కోసం వెంకటేష్‌ అనే కట్టెల వ్యాపారి ఇటీవల రాజేంద్రనగర్‌ సర్కిల్‌ మైలార్‌దేవులపల్లి డివిజన్‌ గగన్‌పహాడ్‌లోని శంషాబాద్‌ ఫారెస్ట్‌ రేంజ్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. లైసెన్స్‌ కోసం రేంజ్‌ అధికారి శ్యామ్‌కుమార్‌, సెక్షన్‌ అధికారి హీర్యా నాయక్‌లు రూ.80 వేలు డిమాండ్‌ చేశారు. బాధితుడు అవినీతి నిరోధకశాఖకు ఫిర్యాదు చేయగా, వారు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. జిల్లాలో పలు శాఖలలో అవినీతి ఆరోపణలపై పలువురిపై వేటు పడుతున్నా క్షేత్రస్థాయి ఉద్యోగుల్లో మార్చు రావడంలేదు. ఇప్పటికీ యధేచ్ఛగా అక్రమ వసూళ్లకు పాల్పడుతూనే ఉన్నారని జిల్లా ప్రజలు విమర్శిస్తున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments