రోజుకొకరు ఎసిబికి పట్టుబడుతున్న వైనం
తహసీల్దార్ల ఉదాసీన వైఖరి
వెలుగులోకి రాని వేలాది మంది బాధితులు
హైదరాబాద్ : గ్రామ ప్రజలకు ప్రభుత్వ సేవలు అందించాల్సిన తహసీల్దారు కార్యాలయ అధికారులు కొందరు అవినీతే విద్యుక్త ధర్మంగా మార్చుకున్నారు. ఈ ఏడాది అవినీతి నిరోధక శాఖ (ఎసిబి)కు పట్టుబడిన ఆయా ప్రభుత్వ శాఖల పరంగా పరిశీలిస్తే వారిలో తహసీల్దార్ కార్యాలయ అధికారులే ఎక్కువగా ఉన్నారు. వీరిలో విలేజీ రెవెన్యూ అఫీసర్ (విఆర్‌ఒ), మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఎంఆర్‌ఐ), మండల సర్వేయర్లు ఉన్నారు. కొన్ని చోట్ల ఏకంగా తహసీల్దార్ కూడా ఎసిబికి పట్టుబడిన ఉదంతాలు ఉన్నాయి. తహసీల్దార్ కార్యాలయాలలో లంచం తీసుకుంటూ పట్టుబడిన వారి లో ఎక్కువ మంది విఆర్‌ఒలే ఉన్నారు. రాష్ట్రంలోని ఆయా తహసీల్దార్ కార్యాలయాలలో తర చూ ఎసిబికి అధికారులు పట్టుబడుతున్నా వారి లో మార్పు రావడం లేదు. తహసీల్దార్ కార్యాలయంలో తరచు ఉద్యోగులు, అధికారులు అవినీతి కేసులో పట్టుబడుతున్నా సంబంధిత తహసీల్దార్లు మాత్రం ఉదాసీనంగా వ్యవహరించడమే ఇందు కు కారణమంటున్నారు. తహసీల్దార్ కార్యాల యం చుట్టూ తిరుగుతున్న బాధితులను ఏనాడూ పట్టించుకున్న పాపానపోకపోవడం వల్ల కింది స్థాయిలో అవినీతి పెచ్చుమీరిపోయిందనే అరోపణలు వినిపిస్తున్నాయి. ఫలితంగా ఎక్కడో అక్కడ బాధితులు ధైర్యం చేసి వారిని ఎసిబి అధికారులకు పట్టిస్తున్న ఉదంతాలు వెలుగు చూస్తున్నాయి. అయితే లంచం డబ్బులు ఇచ్చి పనులు చేయించుకునే బాధితుల జాబిత వేలకుపైగానే ఉంటాయి. మనకెందుకులే అని వారు ఎసిబిని ఆశ్రయించడం లేదు. తహసీల్దార్ కార్యాలయ ఉద్యోగులు, అధికారులు బాధిత రైతు నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడుతున్న ఉదంతాలు తరచు వెలుగులోకి వస్తున్నా మిగతా ఉద్యోగుల్లో కొందరు అదే బాట పడుతూ జైలు పాలవుతున్నారు. తాజాగా మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం మద్దివన్చా గ్రామ విలేజి రెవెన్యూ ఆఫీసర్ శ్రీరామ్ శివరావులు బుధవారం ఎసిబి అధికారులకు పట్టుబడ్డాడు.
పర్యవేక్షన లోపం : తహసిల్దార్ పర్యవేక్షణ లోపం వల్లనే కార్యాలయాల్లో అవినీతి పెరిగిపోతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. తన కింద విధులు నిర్వహించే డిప్యూటీ తహసీల్దార్, మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, విలేజి రెవెన్యూ ఆఫీసర్లు, సర్వేయర్ల పని విధానంపై తహసీల్దార్లు దృష్టి సారించకపోవడం వల్లనే అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొంత మంది తహశీల్దార్లు కింది స్థాయి అధికారులతో కుమ్మకవుతున్నారనే సమాచారం. వారి కనుసన్నల్లోనే బాధితుల నుంచి లంచం తీసుకుంటున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. తహసీల్దార్లకు తెలియకుండానే కింది స్థాయి ఉద్యోగులు, అధికారులు అక్రమాలకు పాల్పడుతున్న వైనాలు కూడా ఉన్నాయి. ఒక్కో తహసీల్దార్ కార్యాలయం పరిధిలో 40 నుంచి 50కిపైగా గ్రామాలు ఉంటాయి. ప్రతి గ్రామం నుంచి తహసీల్దార్ కార్యాలయంలో కులం, ఆధాయం,నివాస ధృవపత్రాల కోసం, ఖరీదు చేసిన వ్యవసాయ భూమి మోటేషన్ కోసం, వ్యవసాయ భూమిని నాలాగా మార్పు కోసం, తదితర సమస్యలపై తహసీల్దార్ కార్యాలయానికి బాధితులు క్యూ కడుతుంటారు. తహసీల్దార్ కార్యాలయానికి వస్తున్న ఆయా ఫిర్యాదులు, దరఖాస్తులపై తహసీల్దార్ల నిఘా కొరవడింది. దీంతో బాధితులను కిందిస్థాయి అధికారులు పదుల సార్లు కార్యాలయం చుట్ట్టూ తిప్పించుకుంటున్నారు. ఇలా తిరగడం కంటే లంచం ఇచ్చుకోవడం మేలని కొందరు బాధితులు నిర్ణయానికి వస్తున్నారు. వీరిలో కొందరు ఎసిబి అధికారులను ఆశ్రయించడంతో అవినీతి అధికారుల బండారం బట్టబయలవుతుంది. మరికొందరు ఎసిబికి ఫిర్యాదు చేయకపోవడంతో మరికొన్ని ఉదంతాలు వెలుగులోకి రావడం లేదనే వాదన ఉంది. ఇప్పటికైనా సంబంధిత తహసిల్దార్లు తమ కార్యాలయానికి వచ్చే బాధితులపై ఓ కంట కనిపెడితే అవినీతికి చెక్ పెట్టవచ్చని ప్రజలు భావిస్తున్నారు.
ఈ ఏడాది ఎసిబికి చిక్కిన అధికారులు….
ఫిబ్రవరి 11న ఖమ్మం జిల్లా నెలకొండపల్లి మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ గుర్రం జ్యోతి ఖరీదు చేసిన వ్యవసాయ భూమి వివరాలను ధరణి ఆన్‌లైన్‌లో పెట్టేందుకు రైతు నెల్లూరి రామకృష్ణ నుంచి రూ.3000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.
ఫిబ్రవరి 19న జోగుళాంబ గద్వాల జిల్లా ఐజ మండలం చినతాండ్రపాడు గ్రామ రెవెన్యూ అధి కారి (విఆర్‌ఒ) సి.హెచ్.మద్దిలేటి పట్టాదారు పాస్ పుస్తకంలో పేరు సరిచేసేందుకు వ్యాపారి తాటిపల్లి తిక్కయ్య అనే వ్యక్తి నుంచి రూ.10,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు.
మార్చి 2న వరంగల్ రూరల్ జిల్లా నడికుడి మండలం మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ మాడ సంపత్ కళ్యాణ లక్ష్మీ పథకం కింద డబ్బులు మంజూరు చేసేందుకు రైతు చెల్లుమల్ల సురేందర్‌రెడ్డి నుంచి రూ.5000 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డారు.
మార్చి 11న జనగాం జిల్లా పాలకుర్తి మండలం డిప్యూటీ మండల సర్వేయర్ నాపంల్లి శ్రీనివాస్ వ్యవసాయ పొలం హద్దులు నిర్ణయించేందుకు రైతు సి.వెంకటయ్య నుంచి రూ.10,000 లంచం తీసు కుంటూ జైలు పాలయ్యాడు.
మార్చి 25న నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం మారెడు మందినీ గ్రామ అసిస్టెంట్ విలేజ్ రెవెన్యూ అధికారి సండు శ్రీధర్ పట్టాపాస్ పుస్తకం మంజూరి కోసం రైతు సోప్పరి నర్సింహ నుంచి రూ.5,000 లంచం తీసుకుంటూ చిక్కాడు.
ఎప్రిల్ 8న కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట తహసి ల్దార్ కనకాల రవి రాజ కుమార్‌రావు మొటేషన్ కోసం రైతు కొత్తూరి సమ్మిరెడ్డి నుంచి రూ.2,00,000 లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు పట్టుబడ్డాడు.
జోగుళాంబ గద్వాల జిల్లా మల్డకల్ మండలం వెల్కూరి గ్రామ అసిస్టెంట్ విలేజి రెవెన్యూ అధికారి పాపగారి చిన్నయ్య పట్టాదారు పాస్‌పుస్తకం మంజూరీకై రైతు వై.తిమ్మన్నగారి రాముడు నుంచి రూ.15,000 లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కాడు.
మే 20న బద్రాద్రి కొత్తగూడెం జిల్లా మండల పరి షత్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (ఎంపిడిఒ) అంబాల శ్రీనివాస్‌రావు బాత్‌రూమ్‌లు నిర్మించిన తాలుకు బిల్లులు చెల్లించేందుకు కాంట్రాక్టర్ భాస్కరిణి వీర మ్‌రావు నుంచి రూ.50,000 లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కాడు.
మే 25న సంగారెడ్డి జిల్లా మెఖ్దామ్‌పల్లి మండలం ఖాన్ జమాల్‌పూర్ గ్రామ విలేజి రెవెన్యూ అధికారి (విఆర్‌ఒ) అయూబ్ అబ్దుల్ పాస్‌పుస్తకాల జారీ కోసం రైతు అశోక్‌రెడ్డి నుంచి రూ.15,000 లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కాడు.—–
ఎసిబికి చిక్కిన మద్దివన్చా విఆర్‌ఒ…
హైదరాబాద్ : మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం మద్దివన్చా గ్రామ విఆర్‌ఒ శ్రీ రామ్ శివరావు వ్యవసాయ భూమి మొటేషన్ చేసేందుకు రైతు పిల్లి భద్రయ్య నుంచి రూ.1,44,000 లం చం తీసుకుంటూ బుధవారం ఎసిబి అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. భద్రయ్యకు ఉన్న తన వ్యవసాయ భూముని తన కుటుంబ సభ్యులకు సమాన వాటాలు పంచాడు. అందుకు కావాల్సిన మొటేషన్ కోసం విఆర్‌ఒను ఆశ్రయించగా లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితులు ఎసిబి అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం వెలుగు చూసింది. నిందితుడు విఆర్‌ఒను నాంపల్లిలోని ఎసిబి ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపర్చగా మెజిస్ట్రేట్ 14 రోజుల కస్టడీ విధించారు. దీంతో అతన్ని ఎసిబి అధికారులు చంచల్‌గూడ జైలుకు తరలించారు.
అవినీతి చేపలు @ తహసీల్దార్ ఆఫీస్
RELATED ARTICLES