బిల్లులు రాబట్టుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూపు
రామగుండం బల్దియాలో కదులుతున్న అవినీతి ఫైళ్లు?
ప్రజాపక్షం/గోదావరిఖని : రామగుండం బల్దియాలో అవినీతి యజ్ఞాన్ని నిరాటంకంగా కొనసాగించేందుకు అధికారులు, ప్రజా ప్రతినిధులు చేసిన ప్రయత్నాల్లో భాగంగా రావాల్సిన బిల్లులును రాబట్టుకునేందుకు ప్రత్యామ్నా య మార్గాల వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. పట్ట ణ ప్రగతి, హరితహారం, కరోనా వ్యాక్సినేషన్ క్యాంపు పనుల్లో చేపట్టిన నామినేషన్ పనులకు సంబంధించి బిల్లులు రాబట్టుకునేందుకు చేయని ప్రయత్నం లేదంటే అతిశయోక్తి కాదు. మొన్నటికి మొన్న నామినేషన్ పనులకు సంబంధించి ఎంబి లు రాయనందుకు ఓ ప్రజాప్రతినిధి అధికారిణి జీతం ఆపేస్తానని బెదిరించడంతో ‘ప్రజాపక్షం’ కథనాలతో కొంత మేర వెనక్కి తగ్గినా మరో మార్గం నుంచైనా బిల్లులు రాబట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు బల్దియా వర్గాల భోగట్టా.
ప్రత్యామ్నయ మార్గం సుగమమేనా?
నామినేషన్ పనులతో అందినకాడికి దండుకోవడానికి అనుకూలమైన గుత్తేదారులను ఎంపిక చేసుకుని ఇంజినీరింగ్ విభాగం నుండి కాకుండా శానిటేషన్ విభాగం నుండి ఇబ్బడిముబ్బడిగా, ఇష్టానుసారంగా పనులు దక్కించుకుని డబ్బులు దండుకునే మార్గాన్ని ఎంచుకున్నట్లు చర్చలు కొనసాగుతున్నాయి. వీటికి సంబంధించి బిల్లులు చెల్లించేందుకు ఇంజినీరింగ్ విభాగం నుండి పనుల ఫార్మాలిటీస్ పూర్తి చేయాలనే నిబంధన ఉన్నందున ఏ ఒక్క అధికారి కూడా ముందుకు రాకుండా ఉండడంతో ఆ పని స్తంభించిపోతుంది. అయితే ఈ బిల్లులు ఎలాగైనా రాబట్టేందుకు పాలకులు, గుత్తేదార్లు, సంబంధిత అధికారులు విక్రమార్కుల్లా పట్టువదలకుండా ప్రత్యామ్నయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు సమాచారం.
కెటిఆర్‌కు ఫిర్యాదు చేసే యత్నంలో ప్రజా ప్రతినిధులు
అయితే వీటిపై పలువురు స్వపక్ష, విపక్ష ప్రజా ప్రతినిధులతో పాటు ప్రజా, స్వచ్ఛంద సంఘాల వారు కూడా లోతుగా పరిశీలన చేస్తున్నట్లు సమాచారం. బిల్లులు మంజూరు అయిన నేపథ్యంలో అవినీతి శాఖకే కాకుండా ఏకంగా రాష్ట్ర మున్సిపల్ శాఖ మ్రంతి కెటిఆర్‌కే ఫిర్యాదు చేసేందుకు, ఇక్కడ జరుగుతున్న పరిణామాలపై ఇప్పటికే లేఖ ద్వారా ఫిర్యాదు చేసిన ఆధారాలతో ఫిర్యాదు చేసేందుకు వారంతా సిద్ధమైనట్లు సమాచారం. ఇప్పటికే వారు ఏఏ పనులను ఎంతమేర పూర్తి చేశారు, ఎవరెవరికి వాటా ఎంత అనే విషయాన్ని సేకరించినట్లు తెలిసింది.
ఎంఎల్‌ఎ గుర్రు..
రామగుండం బల్దియాలో జరుగుతున్న తంతంగంతో బల్దియా, నియోజకవర్గంతో పాటు పార్టీ ప్రతిష్టకు భంగం వాటిల్లుతుందని, పార్టీ ప్రతిష్టకు అపకీర్తి వస్తుందని స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్ బల్దియా ప్రజా ప్రతినినిధులపై అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. అంతే కాకుండా ఇటీవల డివిజన్లలో అభివృద్ధి లోపం వల్ల సొంత కార్పొరేటర్ల నుండే నిరసన సెగలు వస్తుండడంతో డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు సముదాయించడంతో గొడవ సద్దుమణిగింది. జరుగుతున్న పరిణామాలపై పార్టీ హైకమాండ్ డేగకన్నుతో గమనిస్తున్నట్లు, నియోజకవర్గ టిఆర్‌ఎస్ పార్టీ నేతలు అయోమయానికి గురి కావడం జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఏదీ ఏమైనా రామగుండం బల్దియా అవినీతి యజ్ఞం ఆగేనా, అభివృద్ధి పనులు పట్టాలు ఎక్కేనా అనే అనుమానాలు ప్రజల నుండి వ్యక్తమవుతున్నాయి.