కార్మికులు, యంత్రాలను నాలుగురెట్లు పెంచండి
ప్రాజెక్టు పనులు మాత్రం వేగవంతం గావాలె
నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు
కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పరిశీలనలో సిఎం కెసిఆర్
ప్రజాపక్షం / హైదరాబాద్ : తెలంగాణలో కోటి ఎకరాలు సాగులోకి తీసుకురావాలన్న సంకల్పంతో ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు పెడుతున్నదని దానికి అనుగుణంగా అధికారులు, వర్క్ ఏజెన్సీలు నిర్లక్ష్యం వహించకుండా పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. మూడు షిఫ్టుల్లో నాలుగు రెట్లు కార్మికులను, యంత్రాలను పెంచి వేగంగా ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని సిఎం సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పరిశీలనలో భాగం గా రెండవ రోజు బుధవారం ముఖ్యమంత్రి కన్నెపల్లి పంప్‌హౌస్ నుండి అన్నారం బ్యారేజీ వరకు నీటిని తరలించే కాలువ పనులను పరిశీలించారు. కన్నెపల్లి పంప్‌హౌస్ నుండి సుమా రు 15 కిలోమీటర్లు అన్నారం బ్యారేజీ వరకు రోడ్డు కాలువ వెంబడి ప్రయాణిస్తూ అనేక చోట్ల ఆగి క్షుణ్ణంగా పరిశీలించారు. ఏ పని ఏ స్టేజీలో ఉంది? ఎంత మేరకు పూర్తయ్యింది? ఇంకా ఎంత పని జరగాల్సి ఉంది? అని అధికారులను, వర్క్ ఏజెన్సీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అని ఆరా తీశారు. కొన్ని చోట్ల కాలు వ సైడ్ స్లోప్స్ కూలిపోతున్నాయని, అటువంటి రీచేస్‌లో కాంక్రీట్ గైడ్‌వాల్స్ కడితే క్షేమంగా ఉంటుందని అధికారులు సూచించారు. ముఖ్యమంత్రి వాటిని చూసి వెంటనే గైడ్ వాల్స్ నిర్మించడానికి ఏర్పాటు చేసుకోవాలని ఇంజినీర్ ఇన్ చీఫ్‌ని ఆదేశించారు. వర్క్ ఏజెన్సీలకు బిల్లులు చెల్లించే విషయంలో జాప్యం జరగొద్దని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని సెక్రెటరీ స్మితా సభర్వాల్‌ను ఆదేశించారు. అన్నారం బ్యారేజీ నుండి పుంప్‌హౌస్ వరకు ఉన్న కాలువ లైనింగ్ పనులు ఇంకా నాలుగు రెట్లు పని పెరగాలని, లేబర్‌ను కూడా అవసరానికి అనుగుణంగా పెంచుకోవాలని సిఎం సూ చించారు. పనుల నాణ్యత విషయంలో రాజీ పడవద్దని చెప్పారు. మార్చి నెలాఖరుకు కాలువ పనులు పూర్తి అయ్యేలాగా ప్లాన్ చేసుకోవాలని సి ఎం ఆదేశించారు. అనంతరం అన్నారం బ్యారేజీ వద్ద పనులని పరిశీలించి పనులపై అఫ్స్‌కాన్ కంపెనీ ప్రతినిధులతో, ఇంజినీర్లతో సమీక్షించారు. అన్నారం బ్యారేజీ పనులు మొత్తం ఫిబ్రవరి నెలాఖరుకు పూర్తి చేస్తామని కంపెనీ ప్రతినిధులు సిఎంకు హామీ ఇచ్చారు. అన్నారం బ్యారేజీ పనులపై సిఎం సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం సుందిళ్ళ బ్యారేజీ, అన్నారం పంపహౌస్ , సుందిళ్ళ పంప హౌస్ పనులని కూడా సిఎం పరిశీలించారు. సుందిళ్ళ బ్యారేజీ పనులు మందకొడిగా సాగుతున్నాయని, ఎట్టిపరిస్థితుల్లో బ్యారేజి పనులు, ఫ్లడ్ బ్యాంక్ పనులు, రివేట్ మెంట్ పనులు మార్చ్ నెలాఖరుకు పూర్తి కావాలని ఆదేశించినారు.