యుకె నుండి వచ్చిన మరో 14మందికి కరోనా స్ట్రెయిన్
మొత్తం 20కి చేరిన కేసులు
భారత్-యుకె మధ్య జనవరి 7 దాకా విమానాల రద్దు పొడిగింపు
న్యూఢిల్లీ : యుకె నుండి దేశానికి వచ్చిన మరో పద్నాలుగు మందికి టెస్ట్ పాజిటివ్ వచ్చింది. వారిలో సరికొత్త కరోనా స్ట్రెయిన్ లక్షణాలున్నట్టు గుర్తించామని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ బుధవారంనాడు తెలిపింది. ఈ పధ్నాలుగు మందిలోనూ సరికొత్త యుకె వేరియంట్ జీనోమ్‌కు చెందిన సార్స్-సిఓవి-2 ఉన్నట్లు గుర్తించారు. తొలుత మంగళవారంనాడు యుకె నుండి భారత్‌కు వచ్చిన ఆరుగురికి కొత్త వైరస్ స్ట్రెయిన్ లక్షణాలున్నట్లు గుర్తించారు. దీంతో మొత్తం ఈ కేసుల సంఖ్య 20 కి చేరుకుంది. జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం (ఎన్‌సిడిసి)లో జరిపిన ఎనిమిది శాంపిల్స్ పరీక్షలతోపాటు, కోల్‌కత సమీపంలోని కల్యాణిలో ఉన్న జాతీయ బయోమెడికల్ జెనోమిక్స్ ఇనిస్టిట్యూట్ (ఎన్‌ఐబిఎంజి)లో ఒకరికి, పుణెలోని జాతీయ వైరాలజీ ఇనిస్టిట్యూట్ (ఎన్‌ఐవి)లో ఒకరికి, బెంగళూరులోని జాతీయ మెంటల్ హెల్త్-న్యూరో-సైన్సెస్ హాస్పిటల్‌లో ఏడుగురికి, హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులర్-మాలిక్యులర్ బయాలజీ (సిసిఎంబి)లో ఇద్దరికి, ఢిల్లీలోని జీనోమిక్స్-ఇంటిగ్రేటివ్ బయాలజీ (జిఐబి)లో ఒకరికి చేసిన నమూనా పరీక్షల్లో యుకె స్ట్రెయిన్ లక్షణాలున్నట్టు తేలిందని మంత్రిత్వశాఖ తెలిపింది. వీరందరినీ ఎవరికి వారిని వేరువేరు గదుల్లో ఉంచారనీ, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వారికి నిర్దేశిత ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు
సమకూరుస్తున్నాయని, క్యారంటైన్‌లో ఉన్నవారితో సంబంధాలు కొనసాగిస్తున్నామనీ తెలిపింది.
భారత్-యుకె మధ్య జనవరి 7 దాకా విమానాల రద్దు పొడిగింపు
భారత్ – యూకె మధ్య విమానాల రాకపోకల రద్దును జనవరి ఏడవ తేదీ వరకు పొడిగించారు. బ్రిటన్‌లో వెలుగు చూసిన కొత్త తరహా కరోనా స్ట్రెయిన్ భారత్‌కు కూడా వ్యాపించి కలకలం రేపుతూ ఉండటంతో, ఈ రెండు దేశాల మధ్య విమానాల రాకపోకల రద్దును మరో వారం రోజులకు పొడిగించారు. యూరప్ దేశాల నుండి భారత్‌కువచ్చే అన్ని రకాల విమానాలను డిసెంబరు 23 నుంచి డిసెంబరు 31వరకు రద్దు చేస్తూ పౌర విమానయాన మంత్రిత్వశాఖ తొలుత నిర్ణయం తీసుకుంది. యూకె కరోనా స్ట్రెయిన్ ఇక్కడ కూడా వ్యాపించడంతో రాకపోకలపై నిషేధాన్ని మరో వారం పొడిగించింది.
అంతర్జాతీయ విమానాలు జనవరి 31 వరకు నిలిపివేత
కరోనా కారణంగా అంతర్జాతీయ ప్రయాణికుల విమానాల తాత్కాలిక రద్దును జనవరి 31వరకు పొడగిస్తున్నట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) బుధవారం వెల్లడించింది. అయితే అంతర్జాతీయ షెడ్యూల్డ్ విమానాలను ప్రత్యేక మార్గాల్లో అనుమతిస్తున్నట్లు తెలిపింది. మహమ్మారి కారణంగా మార్చి 23 నుంచి అంతర్జాతీయ ప్రయాణికుల విమాన సేవలను రద్దుచేశారు. అయితే మే నుంచి వందే భారత్ మిషన్ కింద ప్రత్యేక అంతర్జాతీయ విమానాలను నడుపుతున్నారు. ఇక జులై నుంచి ద్వైపాక్షిక “ఎయిర్ బబుల్” ఏర్పాట్లతో ఎంపిక చేసిన దేశాలకు సేవలను కొనసాగిస్తున్నారు. అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కెన్యా, భూటాన్, ఫ్రాన్స్‌తో కలుపుకొని మొత్తం 24 దేశాలతో భారత్ ఎయిర్ బబుల్ ఒప్పందాలు చేసుకుంది. ఎయిర్ బబుల్ ఒప్పందం కింద రెండు దేశాల మధ్య ప్రత్యేక అంతర్జాతీయ విమానాల రాకపోకలు కొనసాగుతాయి. తాజా ఆదేశం అంతర్జాతీయ సరకు రవాణా(కార్గో), ప్రత్యేకంగా అనుమతించిన విమానాలకు వర్తించదని డిజిసిఎ తెలిపింది.
అలెర్ట్!
RELATED ARTICLES