HomeNewsBreaking Newsఅర్ధరాత్రి వచ్చింది.. ఆగం చేసింది…

అర్ధరాత్రి వచ్చింది.. ఆగం చేసింది…

హైదరాబాద్‌ నగరాన్ని వణికిస్తున్న వానలు
జలదిగ్బంధంలో పలు కాలనీలు
హిమాయత్‌ సాగర్‌, ఉస్మాన్‌ సాగర్‌ల గేట్లు ఎత్తివేత
ప్రజాపక్షం/హైదరాబాద్‌
హైదరాబాద్‌ నగరాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. అర్ధరాత్రి వేళ ఊహించని విధంగా కురిసిన వాన నగర ప్రజలను అతలాకుతలం చేసింది. మహానగరంలో ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పాతబస్తీ, నారాయణగూడ, దిల్‌సుఖ్‌ నగర్‌, ఎల్‌.బి.నగర్‌, వనస్థలిపురం, నాంపల్లి ప్రాంతాల్లో లోతట్టు కాలనీలు నీటమునిగాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హిమాయత్‌ సాగర్‌, ఉస్మాన్‌ సాగర్‌ల గేట్‌లు ఎత్తివేయడంతో మూసీలోకి వరద నీరు భారీగా విడుదలవుతుంది. దీనితో మూసారంబాగ్‌ వంతెన పైనుంచి వరదనీరు ప్రవహిస్తుంది. గోల్నాక వైపు కాసేపు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. మలక్‌పేట వంతెన కింద భారీగా వర్షపు నీటితో ట్రాఫిక్‌ నిలిచి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దిల్‌సుఖ్‌నగర్‌ ప్రాంతంలోని అనేక కాలనీలు వరదనీటిలోనే మగ్గుతున్నాయి. సరూర్‌నగర్‌ చెరువుకు దిగువన ఉన్న కోదండరాంనగర్‌, సీసల బస్తీ, పిఅండ్‌టి కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. ఈ కాలనీల్లో జనజీవనం స్తంభించింది. ఇళ్లలో నుంచి ప్రజలెవరూ బయటికి రాలేకపోతున్నారు. గతంలోనే సరూర్‌ నగర్‌ చెరువు ఈ కాలనీలను ముంచెత్తింది. మళ్లీ వానలతో ఎప్పుడేం జరుగుతోందనని కాలనీల వాసులు భయం గుప్పిట్లో కాలం వెళ్లదీస్తున్నారు. గాజులరామారంలోని ఓక్షిత్‌ ఎన్‌ క్లేవ్‌ను మరో సారి వరదనీరు ముంచెత్తింది. ఎగువన ఉన్న పెద్దచెరువు నిండిపోయింది. దిగువకు నీరు చేరుతుండటంతో కాలనీ జలమయమైంది. మోకాళ్ల లోతు నీరు చేరుతుండటంతో కాలనీలో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నాంపల్లిలోని కాలనీల్లోకి వరద నీరు చేరింది. పటేల్‌ నగర్‌లో సాయికృప అపార్ట్‌మెంట్‌ చెరువును తలపిస్తోంది. పలు వాహనాలు నీటిలో మునిగిపోయాయి. సురారం తెలుగుతల్లి నగర్‌లో మోకాళ్లలోతు నీరు చేరింది. డ్రైనేజిలు వర్షపునీటితో పొంగిపొర్లడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హయత్‌నగర్‌ డివిజన్‌ పరిధిలోని బి.డి.ఎల్‌.కాలనీ జలమయమైంది. పలు చెట్లు నేలకొరిగాయి. హయత్‌నగర్‌ కార్పొరేటర్‌ కళ్లెం నవజీవన్‌ రెడ్డి, ఎఇతో కలిసి కాలనీలను సందర్శించారు. డిఆర్‌ఎఫ్‌ బృందాన్ని పిలిపించి.. సహాయక చర్యలు ప్రారంభించారు. పెద్ద అంబర్‌పేట్‌ మున్సిపాలిటీ పరిధిలోని కళానగర్‌లోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. ఇటీవల ఎడతెరపిలేకుండా కురిసిన వర్షాలకు నగరంలో చెరువులన్నీ నిండుకుండల్లా మారాయి. అర్ధరాత్రి వేళ మరోసారి భారీగా కురిసిన వానలకు చెరువుల్లోకి ప్రవాహం పెరిగింది. దీంతో నగరంలోని చెరువుల పక్కన ఉన్న లోతట్టు ప్రాంతాల కాలనీలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నాయి.
జంట జలాశయాలకు భారీగా చేరుతున్న వరద
జంట జలాశాలయాలకు భారీగా వరద నీరు చేరుతుంది. వికారాబాద్‌, చేవెళ్లలో భారీ వర్షంతో జలాశయాలకు చేరుతున్న వరద వస్తుంది. దీనితో ఉస్మాన్‌ సాగర్‌, హిమాయత్‌ సాగర్‌లు నిండుకుండలను తలపిస్తున్నాయి. దీనితో రెండు జలాశయాలకు చెందిన గేట్‌లను జలమండలి అధికారులు ఎత్తివేశారు. మూసీలోకి భారీగా వరద నీరు విడుదల చేస్తున్నారు. మూసీనది పరివాహక ప్రాంతాల ప్రజలను అధికార యంత్రాంగం అప్రమత్తం చేసింది. ఉస్మాన్‌ సాగర్‌ ఇన్‌ఫ్లో 2,400 క్యూసెక్కులుకాగా, ఔట్‌ప్లో 3,256 క్యూసెక్కులు. ప్రాజెక్టు 8 గేట్లు ఎత్తి మూసీలోకి నీరు విడుదలచేశారు. ఉస్మాన్‌ సాగర్‌ ప్రస్తుత నీటిమట్టం 1787.20 అడుగులు కాగా, పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులు. అదే విధంగా హిమాయత్‌ సాగర్‌ ఇన్‌ఫ్లో 3200 క్యూసెక్కులు కాగా, 4 గేట్ల ద్వారా 1320 క్యూసెక్కులు విడుదల నీటని విడుదల చేస్తున్నారు. ప్రస్తుత నీటిమట్టం 1760.90 అడుగులు ఉండగా, పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు.
జిల్లాల్లోనూ మళ్లీ ఉప్పొంగుతున్న వాగులు
వరుణుడి ప్రతాపానికి వికారాబాద్‌ జిల్లాలో వాగులు ఉప్పొంగుతున్నాయి. గ్రామాలు, పట్టణాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తాండూర్‌, వికారాబాద్‌, పరిగి, కొడంగల్‌ ప్రాంతాల్లో చెరువులు అలుగులు పారుతున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగి.. రాకపోకలు నిలిచిపోయాయి. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో రాత్రి కురిసిన వర్షాలకు వాగులు, వంకల్లో వరద ఉధృతి పెరిగింది. చెరువులు అలుగు పారుతున్నాయి. చెర్యాలలోని ఆకునూరు వాగు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. లెనిన్‌నగర్‌లో చాలా ఇళ్లు జలమయమయ్యాయి. సంగారెడ్డి జిల్లాలో అతిపెద్దదైన మల్కాపూర్‌ చెరువు అలుగు పారుతుండటంతో.. దిగువన వందల ఎకరాల పంటలు వర్షార్పణమయ్యాయి. తెర్పోల్‌, కొండాపూర్‌ వాగులు కలిసిపోయి పారుతున్నాయి. నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. నిర్మల్‌ జిల్లా బాసరలో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. నిర్మల్‌ జిల్లాలో అర్థరాత్రి నుండి కుండపోత వర్షం పడడంతో ఎగువ ప్రాంతం నుండి వస్తున్న వరదకు ప్రాజెక్టులు పరవళ్లు తొక్కుతున్నాయి. భైంసాలోని గడ్డెన్నవాగు, నిర్మల్‌ జిల్లాలోని కడెం ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు పలు ప్రాజెక్టు గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. సాత్నాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 286.50 మీటర్లు కాగా ప్రస్తుతం 284.70 మీటర్ల వరకు నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులోకి 46000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండడంతో రెండు గేట్లు ఎత్తి అధికారులు నీటిని బయటకు వదులుతున్నారు. మత్తడి ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 277.50 మీటర్లు కాగా ప్రస్తుతం 276.60 మీటర్ల మేర నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టుల మూడు గేట్లను ఎత్తి అధికారులు 9228 క్యూసెక్కుల నీటిని బయటకు వదులుతున్నారు. బాసర రైల్వే స్టేషన్‌ పరిసరప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి.

మూడు రోజులు అతి భారీ వర్షాలు
రాష్ట్రంలో మరో మూడురోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ద్రోణి ప్రభావంతో భారీ వానలు పడతాయని వెల్లడించింది. బుధవారం రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. గురువారం తేలిక పాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దన్నారు. ఇప్పటికే సోమవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments