నిగమ్ బోథ్ శ్మశానవాటికలో నేడు అంత్యక్రియలు
న్యూఢిల్లీ : మాజీ ఆర్థిక మంత్రి, బిజెపి కీలక వ్యూహకర్త, పార్టీ ముఖ్య ట్రబుల్ షూటర్ అరుణ్ జైట్లీ (66) కన్నుమూశారు. గత కొంతకాలంగా మూత్రపిండాలు, అంతుబట్ట ని క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం 12.07 గంటలకు మృతి చెందారు. కొద్దిరోజులుగా వెంటిలేటర్‌పై ఉన్న ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించడంతో తుదిశ్వాస విడిచారు. అరుణ్ జైట్లీకి భార్య సంగీత, కుమార్తె సొనాలి జైట్లీభక్షి, కుమారుడు రోహన్ జైట్లీ ఉన్నారు. అంత్యక్రియలు ఆదివారం మధ్యాహ్నం జరగనున్నాయి. ఈ మేరకు బిజెపి కార్యనిర్వాహక అధ్యక్షుడు జెపి నడ్డా వెల్లడించారు. జైట్లీ భౌతికకాయాన్ని ఎయిమ్స్ నుంచి ఆయన నివాసానికి తరలించారు. జైట్లీ పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం రాత్రి కైలాశ్ కాలనీలోని ఆయన నివాసంలోనే ఉంచనున్నారు. అనంతరం ఆదివారం ఉదయం 11 గంటల కు బిజెపి కేంద్ర కార్యాలయానికి తరలించనున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తల సందర్శనా ర్థం మధ్యాహ్నం 1.30గంటల వరకు అక్కడే ఉంచనున్నారు. ఆ తరువాత అంతిమ యాత్రగా బయల్దేరి మధ్యాహ్నం 2.30 గంటలకు నిగమ్ బోథ్ శ్మశానవాటిలో జైట్లీ అంతిమ సంస్కారాలు అధికార లాంఛనాలతో నిర్వహించనున్నట్టు నడ్డా తెలిపారు. కాగా, 2014 మే నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న జైట్లీ.. మోడీ ప్రభుత్వంలో ఆర్థికశాఖ, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిగా పని చేశారు. 2017లో అప్పటి రక్షణ మంత్రి మనోహర్ పారికర్ గోవా ముఖ్యమంత్రిగా వెళ్లడంతో ఆ శాఖ బాధ్యతలు కూడా నిర్వర్తించారు. 2016లో సమాచార ప్రసారశాఖ అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. ఈ ఏడాది కేంద్రంలో మళ్లీ బిజెపి విజయం సాధించినా ఆరోగ్య పరిస్థితి కారణంగా కేంద్ర మంత్రివర్గంలో ఆయన చేరలేదు. అమెరికా వెళ్లి చికిత్స తీసుకున్న అనంతరం ఆయన కొత్త ప్రభుత్వంలో బాధ్యతలు తీసుకొనేందుకు నిరాకరించారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతూనే ఇంటికే పరిమితమయ్యారు. అయితే, ఇటీవల జైట్లీ ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆయ న్ను ఈ నెల 9న హుటాహుటిన ఎయిమ్స్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శనివారం తుది శ్వాసవిడిచారు. ఈ నెల 10నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటెన్ విడుదల చేయని వైద్యులు శనివారం మధ్యాహ్నం ఆయన మృతిచెందినట్టు ఓ ప్రకటన విడుదల చేశారు.
ఢిల్లీలో విద్యాభ్యాసం : అరుణ్‌జైట్లీ విద్యాభ్యాసం 1960 మధ్య సెయింట్ జెవియర్స్ పాఠశాల (ఢిల్లీ)లో సాగింది. 1973లో కామర్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు. 1974 లో విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1977లో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకున్నారు. ఇదే సమయంలో ఎబివిపి ఉద్యమకారుడిగా పనిచేశారు. 1982 మే 24న సంగీత డోగ్రీని పెళ్లి చేసుకున్నారు. న్యాయ విద్య పూర్తయ్యాక 1977 నుంచి జైట్లీ సుప్రీంకోర్టు, కొన్ని హైకోర్టుల్లో లా ప్రాక్టీస్ చేశారు. 1989లో అదనపు సొలిసిటర్ జనరల్‌గా ఎంపికయ్యారు. 1990లో ఢిల్లీ హైకోర్టులో సీనియర్ అడ్వకేట్ హోదా లభించింది. 1991 నుంచి బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఉన్నారు. 1998లో ఐక్యరాజ్య సమితి సాధారణ సభకు భారత ప్రతినిధిగా వెళ్లారు. 1999 అక్టోబరు 13న వాజ్‌పేయీ ప్రభుత్వంలో సమాచా ర ప్రసారశాఖ సహాయ మంత్రిగా (స్వతంత్ర హోదా) పనిచేశారు. 2000 జులై 23న సామాజిక, న్యాయశాఖ సహా య మంత్రిగా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. 2009 జూన్ 3న రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు.
జైట్లీ మృతి బాధాకరం : సిపిఐ
అరుణ్‌జైట్లీ మృతి పట్ల సిపిఐ సంతాపం వ్యక్తంచేసింది. ఈ మేరకు పార్టీ జాతీయ కార్యదర్శివర్గం ఒక ప్రకటన విడు దల చేసింది. గౌరవించదగ్గ రాజకీయ నాయకులు, ఉత్తమ పార్లమెంటేరియన్లలో ఒకరైన అరుణ్ జైట్లీ మృతి బాధా కరమని సిపిఐ పేర్కొంది.విద్యార్థి నాయకునిగా రాజకీయ జీవితం ప్రారంభించిన జైట్లీ న్యాయవాదిగా మంచి పేరు గడించారని, నైపుణ్యం, విజ్ఞానంతో మంత్ర ముగ్థుల్ని చేస్తూ రాజ్యసభలో మంచి వక్తగా గుర్తుండి పోతారని తెలిపింది. జైట్లీ కుటుంబానికి సానుభూతిని తెలిపింది.
పలువురి సంతాపం
హైదరాబాద్ : కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. దేశ వ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన రాజకీయ , సామాజిక, సినీ ప్రముఖులతో పాటు రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కెసిఆర్ తదితరులు సంతాపం తెలిపిన వారిలో ఉన్నారు. అరుణ్ జైట్లీ మరణవార్త తనకు బాధ కల్గించిందని గవర్నర్ నరసింహన్ తన సంతాప సందేశంలో వెల్లడించారు. తెలివైన న్యాయవాది, అనుభవజ్ఞుడైన పార్లమెంటేరియన్‌ను కోల్పోయామన్నారు. దేశ నిర్మాణానికి అరుణ్ జైట్లీ ఎంతో కృషి చేశారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
సిఎం కెసిఆర్ దిగ్భ్రాంతి : బిజెపి సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ మృతి పట్ల సిఎం కెసిఆర్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. జైట్లీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. దేశానికి ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా కెసిఆర్ స్మరించుకున్నారు. జైట్లీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించినట్లు కెసిఆర్ పేర్కొన్నారు. కాగా, అరుణ్ జైట్లీ మృతి పట్ల తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, హిందూపురం ఎంఎల్‌ఎ నందమూరి బాలకృష్ణ, టిడిపి టిఎస్ అధ్యక్షులు ఎల్.రమణ, పొలిట్‌బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి అరవింద్ కుమార్ గౌడ్‌లు సంతాపాన్ని తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు వారు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.–
అరుణ్‌జైట్లీ అస్తమయం
RELATED ARTICLES