ఉత్తరప్రదేశ్‌లోకి ప్రవేశించిన ప్రేరేపిత ఉగ్రవాదులు
కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరిక
న్యూఢిల్లీ: అయోధ్యలో రామజన్మభూమి, బాబ్రీ మసీదు భూవివాదంపై సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు అలజడులు సృష్టించేందుకు కుట్ర పన్నారని కేంద్ర ఇంటలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఏడుగురు నేపాల్ దేశం మీదుగా మన దేశంలోకి చొరబడి అల్లర్లు సృష్టించేందుకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించారని ఇంటెలిజెన్స్ వెల్లడించింది. పాక్ నుంచి వచ్చిన ఏడుగురు ఉగ్రవాదుల్లో ఐదుగురిని ఇప్పటికే భారత ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయని సమాచారం. యుపిలోని అయోధ్య, గోరఖ్‌పూర్ నగరాల్లో పాక్ ఉగ్రవాదులు మహమ్మద్ యాకూబ్, అబూహంజా, ముహమ్మద్ షాబాజ్, నిస్సార్ అహ్మద్, మహమ్మద్ క్వామీ చైదరిలు దాక్కున్నారని ఇంటలిజెన్స్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు సమాచారం అందించింది. కాగా, ఇప్పటికే అయోధ్యలో భారీ పోలీసు బలగాలను మోహరించారు. ఇంటలిజెన్స్ తాజాగా చేసిన హెచ్చరికలతో అయోధ్యలో హైఅలర్ట్ ప్రకటించామని యుపి డిజిపి ఒపి సింగ్ చెప్పారు. అయోధ్యలో శాంతిభద్రతల పరిరక్షించేందుకు వీలుగా అవసరమైతే జాతీయ భద్రతా చట్టాన్ని ప్రయోగిస్తామని వెల్లడించారు. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొని ఉగ్రవాదులను అణచివేస్తామని డిజిపి వివరించారు.
యుపికి 4000 మంది కేంద్ర బలగాలు
అయోధ్య తీర్పు వెలువడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే ఆ రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లా కేంద్రాలు, ప్రధాన నగరాల్లో భారీ ఎత్తున బలగాలను మోహరించింది. వాటికి అదనంగా కేంద్రం మంగళవారం 4000 మంది కేంద్ర సాయుధ బలగాలను ఉత్తరప్రదేశ్‌కు పంపింది. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాల్ని మోహరిస్తున్నారు. బిఎస్‌ఎఫ్, ఆర్‌ఎఎఫ్, సిఐఎస్‌ఎఫ్, ఐటిబిపి, ఎస్‌ఎస్‌బికి చెందిన 15 కంపెనీల బలగాలను యుపికి తరలించారు. నవంబరు 11న కేంద్ర సాయుధ పోలీసు బలగాలకు చెందిన మరో 15 కంపెనీలను పంపాలని నిర్ణయించారు. ఈ మేరకు సోమవారం జరిగిన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్ర బలగాలు నవంబర్ 18 వరకు రాష్ట్రంలో ఉండనున్నాయి. ఈ బలగాల్ని రాష్ట్రంలోని 12 సమస్యాత్మక జిల్లాల్లో మోహరించాలని హోంశాఖ నిర్ణియించింది. అయోధ్య తీర్పు వెలువడక ముందు, వెలువడిన తర్వాత రాష్ట్రంలో శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండానే ఈ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అయోధ్యలో రామజన్మభూమి భూవివాదం కేసుపై సుదీర్ఘంగా విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. తీర్పును రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుత ప్రధాన న్యాయమూ ర్తి జస్టిస్ రంజన్ గొగొయి ఈ నెల 17న పదవీ విరమణ చేయనున్నారు. ఆలోపే తీర్పు వెలువడే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
అయోధ్య తీర్పుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయోద్దు
యుపిలో పార్టీ శ్రేణులకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక ఆదేశం
న్యూఢిల్లీ : అయోధ్యలో రామజన్మభూమి భూవివాదంపై సుప్రీంకోర్టు ఇవ్వనున్న తీర్పుపై ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యొద్దని కాంగ్రెస్ శ్రేణులను పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ ఆదేశించారు. తీర్పుపై పార్టీ వైఖరికి అనుగుణంగా నడుచుకోవాలని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ వర్గాలకు సూచించారు. పార్టీ వైఖరి ప్రకటించే వరకూ ఎలాంటి బహిరంగ ప్రకటనలు చెయ్యొద్దన్నారు. ప్రతి ఒక్కరూ అధిష్ఠానం తీసుకునే నిర్ణయానికే కట్టుబడి ఉండాలన్నారు. ఇటు యుపితో పాటు అటు దేశ రాజకీయాల్లో అయోధ్య తీర్పు కీలక పాత్ర పోషించే అవకాశం ఉన్నందున పార్టీ శ్రేణులు ఆచితూచి వ్యవహరించాలని ప్రియాంక కోరినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు సమయంలో పార్టీ వైఖరికి విరుద్ధంగా నాయకులు పలు రకాల వ్యాఖ్యలు చేశారు. కొంత మంది కేంద్రం నిర్ణయాన్ని సమర్థించారు. అలాంటి గందరగోళ వైఖరి మరోసారి తలెత్తకుండా చూసేందుకే ముందస్తుగా పార్టీ వర్గాలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. యుపిలో సోమవారం జరిగిన కాంగ్రెస్ సలహా మండలి సమావేశంలో ఆమె ఈ సూచనలు చేశారు. సుదీర్ఘ కాలం పాటు విచారణ కొనసాగిన అయోధ్య భూవివాదంలో.. సుప్రీంకోర్టు తీర్పుని రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే.
అయోధ్య తీర్పు నేపథ్యంలో యుపిలో హై అలర్ట్
RELATED ARTICLES