ప్రతిపక్షాల వ్యాఖ్యలను ప్రసారం చేయవద్దు
ఆకాశవాణి కేంద్రాలకు ప్రసారభారతి ఆదేశాలు
నిర్మలా సీతారామన్ లోక్‌సభ ప్రసంగంపై ఎఐఆర్ డిజి నిర్వాకం
కలకలం సృష్టించిన ‘ది వైర్’ ప్రత్యేక కథనం
న్యూఢిల్లీ : ప్రభుత్వ, స్వతంత్ర సంస్థలను మోడీ సర్కారు తన జేబు సంస్థలుగా మార్చుకుంటున్నదని చెప్పడానికి తాజా ఉదాహరణ యిది. రాఫెల్ ఒప్పందంపై పార్లమెంటులో తమ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంలో రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ విఫలమయ్యారని కాంగ్రెస్ ఆరోపించిన కొన్ని గంటలకే ప్రభుత్వ ప్రసార సంస్థ ప్రసారభారతి చేసిన ఒక నిర్వాకం వెలుగులోకి వచ్చిం ది. మంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగాన్ని మక్కీకిమక్కీ అనువాదం చేసి ప్రసారం చేయడానికి నానా తంటాలు పడిన ప్రసారభారతి అదే సమయంలో ప్రతిపక్షాల ఎంపీలు సంధించిన ప్రశ్నలు, వ్యాఖ్యలను మాత్రం నిస్సిగ్గుగా వదిలిపారేసింది. అయితే అందుకు కారణాలు లేకపోలేదు. ఆకాశవాణి (ఎఐఆర్) డైరెక్టర్ జనరల్ జనవరి 5వ తేదీన స్వయంగా ఒక ఉత్తర్వు జారీ చేశారు. సీతారామన్ ప్రసంగాన్ని అనువాదం చేసి మరీ ప్రసారం చేయాలని గౌహతి, హైదరాబాద్, కోల్‌కతా, చండీగఢ్, శ్రీనగర్, చెన్నై, బెంగుళూరు, తిరువనంతపురం ఆకాశవాణి ప్రోగ్రామింగ్ డిపార్ట్‌మెంట్లకు ఆయన అర్థరాత్రి అధికారిక ఈమెయిల్ ద్వారా సీతారామన్ ప్రసంగం పూర్తి పాఠాన్ని పంపించారు. అనువాదం చేసిన ప్రతులను మరుసటి రోజు ఉదయం 11 గంటలకల్లా ఢిల్లీకి చేరాలని కూడా సదరు ఎఐఆర్ డిజి ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు. ఆకాశవాణి కేంద్రాలన్నీ తూచ తప్పకుండా ఆ ఆదేశాలను పాటించాయి. పైగా ప్రధానమంత్రి ‘మన్ కీ బాత్’ కార్యక్రమానికి చెందిన ఈమెయిల్ ఐడికి ఈ అనువాద ప్రతులు చేరినట్లు మార్క్ చేసి వుంది. మంత్రి ప్రసంగం మాత్రమే అవసరమని, ఇతర సభ్యుల ప్రశ్నలు, వ్యాఖ్యలు, స్పీకర్ వాదనలను సైతం తర్జుమా చేయాల్సిన అవసరం లేదని సమాచార ప్రసార శాఖ మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. ‘దివైర్’ వెబ్‌సైట్‌లో ప్రచురితమైన ఈ ప్రత్యేక కథనం సోమవారంనాడు వైరల్‌గా మారింది. జనవరి 8వ తేదీ తర్వాత ప్రసారభారతి విధానంలో కూడా మార్పులు రానున్నాయి. ఆకాశవాణి వార్తలను ప్రైవేటు ఎఫ్‌ఎం బ్రాడ్‌కాస్టర్ల ద్వారా దేశవ్యాప్తంగా ప్రసారం కానున్నాయి. సరిగా ఒక రోజు ముందు ప్రసారభారతి ఈ తరహా అడ్డగోలు వ్యవహారానికి పూనుకోవడం విమర్శలకు తావిస్తున్నది.