ప్రజా చైతన్యమే లక్ష్యంగా సిపిఐ కార్యాచరణ
పోడు భూములకు తక్షణమే పట్టాలివ్వాలి
ప్రజాపోరు యాత్రలో కూనంనేని
ప్రజాపక్షం/ ఖమ్మం/ కారేపల్లి అమ్మకాల నరేంద్రమోడీని అధికారం నుంచి సాగనంపాలని లేకుంటే దేశ భవిష్యత్తే ప్రశ్నార్థకమవుతుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రైవేటు సంస్థలకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. శనివారం ఖమ్మంజిల్లా సిపిఐ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజాపోరు యాత్ర ఏన్కూరు, కారేపల్లి, కామేపల్లి మండలాల్లో జరిగింది. కారేపల్లి మండలం చీమలపాడులో యాత్రకు ఘన స్వాగతం లభించింది. గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం దివంగత సిపిఐ నాయకులు బాగం నారాయణ స్థూపం వద్ద పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి నివాళులర్పించారు. ఈ సందర్బంగా జరిగిన సభలో కూనంనేని మాట్లాడుతూ మోడీ నియంతగా వ్యవహరిస్తున్నారని, ఆయన గోముఖ వ్యాఘ్రమని సాంబశివరావు అభివర్ణించారు. సాధువుగా తిరుగుతూనే రాక్షస కార్యక్రమాలకు తెరలేపారన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీ ర్యం చేయడం ద్వారా ఉద్యోగ, ఉపాధి రంగాలను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్నారని, భవిష్యత్తులో ప్రభుత్వ రంగం లో ఉద్యోగ, ఉపాధి రంగాలు ఉండే అవకాశమే లేదన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ మోడీ పాలనలో చిన్నాభిన్నమైందని సాంబశివరావు తెలిపారు. ఆర్థిక అంతరాలు పెరిగి సంపన్నులు మరింత సంపన్నులుగా మారుతున్నారని, పెరుగుతున్న ఆర్థిక అంతరాలు భవిష్యత్తులో వర్గ పోరాటాలకు దారి తీస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. మతపరమైన విషయాలను రాజకీయాల్లోకి తీసుకు వచ్చి లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తుందన్నారు. బిజెపిని గద్దె దించడమే లక్ష్యంగా వామపక్ష, ప్రజాతంత్ర, లౌకిక శక్తుల ఐక్యతకు సిపిఐ కృషి చేస్తుందన్నారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని అంగీకరించేందుకు ససేమిరా అన్న ఆర్‌ఎస్‌ఎస్, జనసంఘ్ మూలాలు కలిగిన బిజెపి… ఇప్పుడు రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఆర్‌ఎస్‌ఎస్ ఏనాడూ జాతీయ జెండాను గౌరవించ లేదని, బిజెపి గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా రాజ్యాంగాన్ని మార్చేందుకు ప్రయత్నం చేసిందని, అప్పుడు మెజారిటీ లేకపోవడంతో ఉపసంహరించుకుందని రెండ దఫా గెలిచిన తర్వాత ఇప్పుడు రాజ్యాంగ వ్యవస్థకు తూట్లు పొడుస్తుందని సాంబశివరావు ఆరోపించారు. దేశంలోని బిజెపి పాలన వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేసిన తర్వాతే కమ్యూనిస్టు పార్టీ ‘బిజెపి హఠావో… దేశ్‌కో బచావో’ అనే నినాదంతో ప్రజలను చైతన్యపరిచేందుకు పూనుకుందన్నారు. ప్రజలను కార్యోన్ముఖులను చేసేందుకు ఈనెల 14 నుంచి నెల రోజుల పాటు దేశ వ్యాప్తంగా ఈ యాత్రను చేపడుతున్నామన్నారు. తెలంగాణ ప్రభుత్వం సైతం పోడు భూములు, రుణమాఫీ తదితర విషయాలలో నిర్లక్ష్య ధోరణిని అవలంబిస్తుందని ప్రభుత్వ లెక్కల ప్రకారమే సుమారు నాలుగు లక్షల మంది పోడు రైతులకు చెందిన 11.50 లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని సాంబశివరావు డిమాండ్ చేశారు. రుణమాఫీని ఏకకాలంలో అమలు చేయాలని, ఉద్యోగ, ఉపాధి రంగాలపై దృష్టి సారించడంతో పాటు లీకులకు సంబంధించి పూర్తి విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సభలో సిపిఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, సిపిఐ నాయకులు మహ్మద్ మౌలానా, జమ్ముల జితేందర్‌రెడ్డి, యర్రా బాబు, కొండపర్తి గోవిందరావు, ఏపూరి లతాదేవి, సిద్దినేని కర్ణకుమార్ తదితరులు పాల్గొన్నారు.
చీమలపాడు మృతుల కుటుంబాలకు కూనంనేని పరామర్శ
బిఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనం సందర్భంగా జరిగిన దురదృష్టకర ఘటనలో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని, రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆ కుటుంబాలను ఆదుకోవాలని ఆయన కోరారు. శనివారం కారేపల్లి మండలం చీమలపాడు ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలను ఆయన పరామర్శించారు. ప్రతి కుటుంబానికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. ఘటన అత్యంత దురదృష్టకరమైందని, నలుగురు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమైన విషయమన్నారు. ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వం అలసత్వానికి తావులేకుండా వ్యవహరించాలన్నారు. కుటుంబాల స్థితిగతులను చూస్తుంటే అంతా పేద, గిరిజన కుటుంబాలకు చెందిన వారేనని సాంబశివరావు తెలిపారు. ఘటన తీరు హృదయవిదారకంగా ఉందన్నారు. మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి సిపిఐ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, కారేపల్లి మండల కార్యదర్శి బోళ్ల రామస్వామి, నాయకులు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
అమ్మకాల మోడీనిసాగనంపాల్సిందే
RELATED ARTICLES