HomeNewsLatest Newsఅమెరికా చరిత్రలో తొలిసారి జాతీయ విపత్తు

అమెరికా చరిత్రలో తొలిసారి జాతీయ విపత్తు

డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక నిర్ణయం
అగ్రరాజ్యంలో 20 వేలు దాటిన కరోనా మరణాలు

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది.  ఈ వైరస్‌ వల్ల అమెరికాలో ఇప్పటికే 20వేలపైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. మహమ్మారి విజృంభణను దేశవ్యాప్త విపత్తుగా గుర్తించారు. దేశంలోని 50 రాష్ట్రాల్లో మహా విపత్తు పరిస్థితులు నెలకొన్నట్లు ప్రకటించారు. అమెరికా చరిత్రలో ఇలా చేయడం ఇదే మొదటిసారి. తొలి కేసు నమోదైనప్పటి నుంచి తీవ్రతను బట్టి ఒక్కో రాష్ట్రంలో విపత్తును ప్రకటిస్తూ వచ్చిన శ్వేతసౌధం చిట్టచివరిగా శనివారం వ్యోమింగ్‌కూ దాన్ని వర్తింపజేసింది. దీంతో అన్ని రాష్ట్రాలు మహా విపత్తును ఎదుర్కొంటున్నట్లుగా గుర్తించిట్లైంది. దీనివల్ల ఫెడరల్‌ ప్రభుత్వ నిధుల్ని రాష్ట్రాలు వినియోగించే వెసులుబాటు కలుగుతుంది. అలాగే కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు నేరుగా శ్వేతసౌధం నుంచే నిధులు అందుతాయి. ఇతర అత్యవసర సేవల్ని కూడా  ఫెడరల్‌ ప్రభుత్వమే పర్యవేక్షిస్తుంది. ఇప్పటివరకు తీవ్రత ఎక్కువగా ఉన్న ఇటలీని దాటేసి మరణాల సంఖ్యలో శనివారానికి అగ్రరాజ్యం  మొదటిస్థానానికి చేరింది. శనివారం కొత్తగా 1912 మంది ప్రాణాలు కోల్పోవడంతో దేశంలో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 20,597కు చేరింది. న్యూయార్క్‌, న్యూజెర్సీలో విలయతాండవం కొనసాగిస్తూనే తాజాగా షికాగో సహా మరిన్ని మధ్య, పశ్చిమ ప్రాంతాలకు తన కోరల్ని చాస్తోంది ఈ మహమ్మారి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 5,33,259 మందికి వైరస్‌ సోకినట్లు గుర్తించారు. వైరస్‌ను ఓడించి వ్యాధిగ్రస్తుల్ని రక్షించేందుకు నిర్విరామంగా కృషి చేస్తున్న వైద్యులు, ఇతర ఆరోగ్య సిబ్బంది ప్రాణాలు కోల్పోతుండడం ఇప్పుడు అందరినీ కలచివేస్తోంది. ఇండియానాలోని ఓ నర్సింగ్‌ హోంలో 24 మంది, ఐఒడబ్ల్యుఎలోని మరో ఆసుపత్రిలో 14 మంది మృత్యువాతపడ్డారు. షికాగో కూక్‌ కౌంటీలోని ఓ నర్సింగ్‌ హోంలో గుర్తు తెలియని శవాలను భద్రపరచడానికి 2000 సామర్థ్యంగల ఓ శవాగారాన్నే ఏర్పాటు చేశారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. వైరస్‌ కట్టడిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు షికాగో నగర మేయరే వీధుల్లో తిరుగుతూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఇక న్యూయార్క్‌ నగరంలో శనివారం 783 మంది మృతిచెందినప్పటికీ.. మరణాల రేటు క్రమంగా తగ్గుతోందని గవర్నర్‌ ఆండ్రూ క్యుమో తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 8,627 మంది మృత్యువాతపడ్డారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments