ఒక్కరోజే 1973 మరణాలు
ప్రపంచవ్యాప్తంగా 15,36,094కి పెరిగిన కేసులు
వాషింగ్టన్: అమెరికాలో కరోనా వైరస్ మరణమృదంగం కొనసాగుతోంది. మరణాల సంఖ్య రోజురోజుకు రికార్డు స్థాయిలో పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా బుధవారం ఒక్కరోజే అత్యధికంగా 1973మరణాలు సంభవించాయి. అంతకుముందు రోజు కూడా 1939మంది మృత్యువాతపడ్డారు. దీంతో దేశంలో కొవిడ్ బారినపడి మరణించినవారి సంఖ్య 14,695కి చేరింది. అమెరికాలో మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య 4,35,128కి చేరింది. దీంతో ప్రపంచంలోనే కరోనా తీవ్రత అధికంగా ఉన్న దేశంగా అమెరికా నిలిచింది. ఇక్కడ కరోనా మరణాల సంఖ్య స్పెయిన్‌ను దాటేసింది. కరోనా కాటుకు స్పెయిన్‌లో ఇప్పటివరకు 14,673మంది ప్రాణాలు కోల్పోయారు. కేసుల సంఖ్య లక్షా 48వేలు దాటింది. ఇక ప్రపంచంలో కొవిడ్ మరణాలు అత్యధికంగా ఇటలీలో చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఇటలీలో 17,669మంది మరణించారని జాన్ హాప్ కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది. ఇదిలావుండగా, ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్య 15,36,094కి పెరిగింది. అందులో 89,877 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒకటి రెండు రోజుల్లో మరణాల సంఖ్య లక్ష దాటే అవకాశాలు కన్పిస్తున్నాయి. స్పెయిన్‌లో మరణాలు 15,238కాగా, ఇటలీలో 17,669 మంది మరణించారు.
11మంది భారతీయులు మృతి
కరోనా కారణంగా అమెరికాలో భారతీయులు మృతిచెందడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు ఈ వైరస్ సోకి 11మంది భారతీయులు మరణించినట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. మరో 16మందికి కరోనా నిర్ధారణ కాగా ఆసుత్రిలో చికిత్స పొందుతున్నారు. వైరస్ సోకిన భారతీయుల్లో న్యూయార్క్, న్యూజెర్సీకి చెందినవారే ఉన్నారు. తాజాగా న్యూయార్క్ రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య ఆరువేలు దాటగా బాధితుల సంఖ్య లక్షా నలభైవేలకు చేరింది. న్యూజెర్సీలోనూ ఈ వైరస్ సోకి 1500మంది మరణించారు.
న్యూయార్క్‌లో వణుకు
కరోనా మహమ్మారి న్యూయార్క్ వణికిస్తోంది. తాజాగా ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రంగా న్యూయార్క్ నిలిచింది. అమెరికాలో మొత్తం 4,35,000 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా కేవలం ఒక్క న్యూయార్క్ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 1,50,000 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య స్పెయిన్, ఇటలీ దేశాల్లో నమోదైన మొత్తం కేసులను దాటిపోవడం అక్కడ వైరస్ తీవ్రతకు అద్దం పడుతోంది. ఇక న్యూయార్క్‌లో కరోనా వైరస్‌తో మరణించేవారి సంఖ్య వాస్తవానికన్నా ఎక్కువే ఉండొచ్చనే వాదన కూడా ఉంది. ఇప్పటికే న్యూయార్క్‌లో కొవిడ్-19 సోకి 6 వేల మంది మృత్యువాతపడ్డారని న్యూయార్క్ గవర్నర్ ఆండ్య్రూ క్యూమో ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో మరణాల సంఖ్య ఎక్కువగానే ఉన్నప్పటికీ కొత్తగా ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య తగ్గిందని వెల్లడించారు. మరికొన్నిరోజులపాటు ఈ మరణాల పరంపర కొనసాగే అవకాశం ఉందని..అనంతరం తగ్గుముఖం పట్టే అవకాశముందని భావిస్తున్నట్టు గవర్నర్ క్యూమో తెలిపారు. అయితే, ఈ విపత్కర సమయంలో కరోనా సోకి ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతూ మృతి చెందిన వారి సంఖ్యను మాత్రమే ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తోంది. వైరస్ బారిన పడి ఇంటివద్దే చనిపోతున్న వారి వివరాలను వెల్లడించడంలేదనే వాదన ఉంది. ఇలా ఒక్క న్యూయార్క్ నగరంలోనే రోజూ 200మంది చనిపోతున్నట్లు సమాచారం. కాగా, అమెరికా వ్యాప్తంగా గడచిన 48గంటల్లో దాదాపు 4వేల మంది మృత్యువాత పడటం ఆందోళన కలిగిస్తోంది.