భారత్ X ఆస్ట్రేలియా ఆఖరి వన్డే నేడే
మెల్‌బోర్న్ : భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య ఆఖరి వన్డే పోరుకు రంగం సిద్ధమైంది. ఇరుజట్లూ అమీతుమీ తేల్చుకోనున్నారు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇరుజట్ల మధ్య మూడవ, ఆఖరి వన్డే మ్యాచ్ మెల్‌బోర్న్‌లోని ఎంసిసి స్టేడియంలో శుక్రవారంనాడు జరుగుతుంది. తొలి రెండు వన్డేల్లో చెరొక విజయాన్ని సాధించిన ఇరుజట్లు సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచాయి. సిడ్నీలో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 34 పరుగుల తేడాతో అద్భుతమైన విజయం సాధించగా, అడిలైడ్‌లో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో తిరుగులేని విజయం నమోదు చేసింది. దీంతో ఇరుజట్లు సమఉజ్జీలుగా నిలిచాయి. ఇప్పుడు మెల్‌బోర్న్‌లో జరిగే ఆఖరి వన్డే నిర్ణయాత్మకంగా మారింది. ఈ మ్యాచ్‌లో ఏ జట్టు విజయం సాధిస్తుందో ఆ జట్టే విజేతగా నిలుస్తుంది. పైగా ఈ వన్డే సిరీస్ వచ్చే న్యూజిలాండ్ సిరీస్‌పై కూడా ప్రభావం చూపనుంది. కివీస్ సిరీస్‌కు జట్టు తుది ఎంపికపై కూడా ఈ మ్యాచ్ ఫలితం ప్రభావం వుంటుంది. ఎన్ని విధాలా చూసుకున్నా ఈ మూడో వన్డే ఇరుజట్లకు అగ్నిపరీక్షగా నిలవనుంది. మూడు టి20ల సిరీస్ 1-1తో సమం కాగా, నాలుగు టెస్టుల సిరీస్‌ను 2-1తో టీమిండియా గెలుచుకుంది. ఇక మిగిలింది ఈ వన్డే సిరీస్ మాత్రమే.
టీమిండియా చరిత్ర సృష్టిస్తుందా?
టీమిండియా మరో చరిత్ర సృష్టించే అవకాశాలు మెండుగా కన్పిస్తున్నాయి. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌ను వారి గడ్డపై గెలిచి కొత్త చరిత్ర తిరగరాసిన కోహ్లీసేన ఇప్పుడు మరో రికార్డుపై దృష్టిపెట్టింది. ఈ చివరి వన్డేలో టీమిండియా గెలిస్తే కొత్త అధ్యాయాన్ని లిఖిస్తుంది. ఇప్పటివరకూ ఆస్ట్రేలియా గడ్డపై ఒక ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ను గెలిచిన చరిత్ర భారతజట్టుకు అస్సలు లేదు. గతంలో రెండు సందర్భాల్లో ఆస్ట్రేలియా గడ్డపై వన్డే ఫార్మాట్లో సిరీస్‌లు సాధించినప్పటికీ, అవి ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లు కావు. ఒకటి 1985లో జరిగిన వరల్డ్ చాంపియన్ షిప్ ఆఫ్ క్రికెట్ టైటిల్ కాగా, రెండోది మూడు దేశాలు పాల్గొన్న సిబి సిరీస్. అందువల్ల ఒక ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లో తొలిసారి ఆస్ట్రేలియాను వారి దేశంలో ఓడించే అవకాశం భారతజట్టు ముంగిట ఉంది. ఈ మేరకు కసరత్తులు చేస్తున్న కోహ్లీసేన ఆసీస్ పర్యటనకు ఘనమైన ముగింపు ఇచ్చే యోచనలో ఉంది. భారత కాలమాన ప్రకారం ఉదయం 7.50 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిచిన పక్షంలో ఆస్ట్రేలియా పర్యటనలో సిరీస్‌ను కోల్పోకుండా ముగించినట్లు అవుతుంది.
సిరాజ్‌కు ఉద్వాసన!
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో ఆడటం ద్వారా ఈ ఫార్మాట్లో అరంగేట్రం చేసిన హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ ఘోరంగా నిరాశపరిచాడు. అడిలైడ్ వన్డేలో 10 ఓవర్లలో 76 పరుగులిచ్చిన అతను ఒక్క వికెట్ కూడా తీయలేదు. భారత్ తరఫున కర్సన్ ఘావ్రీ (0/83) తర్వాత అరంగేట్రంలో అతి చెత్త ప్రదర్శన సిరాజ్‌దే కావడం గమనార్హం. దాంతో సిరాజ్‌పై వేటు తప్పేలా కనబడటం లేదు. అతని స్థానంలో ఖలీల్ అహ్మద్ తిరిగి జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. ఈ ఒక్క మార్పు తప్పితే భారత జట్టులో మార్పులు ఉండకపోవచ్చు. సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్లో కేదార్ జాదవ్‌ను జట్టులో చోటు దక్కడం కష్టంగానే ఉంది. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా స్థానంలో కానీ, కుల్దీప్ యాదవ్ స్థానంలో కానీ కేదర్ జాదవ్‌ను తీసుకోవాలన్న ఆలోచన కూడా లేకపోలేదు. అయితే కీలకమైన ఈ మ్యాచ్‌కు రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్‌లను తీసే సాహసం టీమిండియా యాజమాన్యం చేయకపోవచ్చు. అడిలైడ్ వన్డేలో కుల్దీప్ రాణించనప్పటికీ మెల్బోర్న్ పిచ్ పొడిగా ఉండే అవకాశం ఉండటంతో అతనికే తుది జట్టులో అవకాశం ఖాయంగా కనబడుతోంది. దాంతో పెద్దగా మార్పులు లేకుండానే టీమిండియా ఫైనల్ టచ్‌కు సిద్ధమయ్యే అవకాశం ఉంది. ఇక భారత బ్యాటింగ్ ఆర్డర్‌లో కూడా ఎలాంటి మార్పులు ఉండబోవు. ఓపెనర్లుగా యథాప్రకారం రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌లు దిగుతారు. కోహ్లీ, అంబటిరాయుడు తదుపరి స్థానాల్లో దిగుతుండగా, మహేంద్రసింగ్ ధోనీ ఐదవ స్థానంలోనే వస్తాడు. ఎలాగూ దినేష్ కార్తిక్, రవీంద్ర జడేజాలు స్లాగ్‌ఓవర్లను ఆడేందుకు సిద్ధంగా వుంటారు. తొలి వన్డేలో అద్భుతమైన సెంచరీ సాధించిన రోహిత్‌శర్మ రెండో వన్డేలోనూ నలభైకిపైగా పరుగులు సాధించాడు. తొలి వన్డేలో విఫలమైన ధావన్ ఆ తర్వాత మెరుపులు మెరిపించాడు. అలాగే కోహ్లీ సిడ్నీలో విఫలమైనా, అడిలైడ్‌లో అద్భుతంగా పుంజుకొని సెంచరీ బాదేశాడు. ఎటొచ్చీ ధోనీ రెండు వన్డేల్లోనూ తనదైన శైలిలో ఆడుతూ అర్థసెంచరీలు నమోదు చేశాడు. తన స్థానాన్ని పదిలపర్చుకున్నాడు. రెండు మ్యాచ్‌ల్లోనూ తొందరపడిన అంబటి రాయుడు స్థానంలో కేదార్ జాదవ్‌ను తీసుకోవాలన్న ఆలోచన కూడా జట్టులో వుంది. అయితే అది పరిపూర్ణత సాధించకపోవచ్చు. జడేజాను మార్చగలిగితే విజయ్‌శంకర్‌కు ప్రాధాన్యత ఇవ్వాల్సివుంటుంది. భువనేశ్వర్, షమీలు పేస్‌తో సిద్ధం కాగా, సిరాజ్, ఖలీల్‌లలో ఒకరు తుదిజట్టులో ఆడటం ఖాయం. మూడో స్పిన్నర్ అవసరమనుకుంటే సిరాజ్ స్థానంలో ఖలీల్‌కు బదులుగా యజువేందర్ ఛాహల్‌ను తుదిజట్టులోకి ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా వున్నాయి. ఏదేమైనప్పటికీ, విజయమే లక్ష్యంగా భారతజట్టు వ్యూహరచన చేస్తున్నది. ప్రాక్టీసు కూడా కఠినతరంగానే సాగింది.
జట్టులోకి స్టాన్‌లేక్, జంపా
మూడో వన్డే ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టుకు అత్యంత కీలకం అవుతున్నది. అందుకే తుదిజట్టులో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. భారత్‌తో ఎట్టి పరిస్థితుల్లోనూ సిరీస్‌ను వదులుకోకూడదనే యోచనలో ఉన్న ఆసీస్ జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగనుంది. ఈ వన్డే సిరీస్‌పై ఏమాత్రం ప్రభావం చూపని స్పిన్నర్ నాథన్ లియాన్ స్థానంలో ఆడమ్ జంపాను తీసుకోగా, పేసర్ బెహ్రెన్‌డార్ఫ్ స్థానంలో బిల్లీ స్టాన్‌లేక్ జట్టులోకి వచ్చాడు. ఇక రిజర్వ్ ఆటగాడిగా కేన్ రిచర్డ్‌సన్‌ను తీసుకున్నారు. ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఒక విధంగా చెప్పాలంటే నిలకడగానే వుంది. రెండు మ్యాచ్‌ల్లోనూ జట్టు గౌరవప్రదమైన స్కోర్లే నమోదు చేసింది. షాన్ మార్ష్, పీటర్ హ్యాండ్స్‌కూంబ్‌లు మంచి ఫామ్‌లో వున్నారు. స్టాయినిస్, మ్యాక్స్‌వెల్‌లు ఆల్‌రౌండర్లుగా తమ బాధ్యతలను సక్రమంగా నిర్వరిస్తున్నారు. తొలి మ్యాచ్‌లో అద్భుతమైన బౌలింగ్‌తో భారత పతనానికి కారణమైన జే రిచర్డ్‌సన్ రెండో మ్యాచ్‌లో ఘోరంగా విఫలమయ్యాడు. పైగా అతని బౌలింగ్‌లో మన బ్యాట్స్‌మన్లు ఉతికిపారేశారు. ఈసారి అతను ఆఫ్షన్ ఆటగాడిగా వుంటాడా, తుదిజట్టులో స్థానం సంపాదిస్తాడా అన్నది వేచిచూడాల్సిందే. ఏదేమైనప్పటికీ, ఈ మూడో వన్డే నిర్ణయాత్మక మ్యాచ్ కచ్చితంగా హోరాహోరీ పోరుకు వేదిక అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం ఉదయం 7.50 గంటలకు ప్రారంభమవుతుంది. సోనీ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారమవుతుంది.